ఆన్లైన్ ఎఫైర్స్ వదిలించుకోవడం చాలా కష్టం..
లండన్ : ఆడ, మగ అనే భేదాలు లేకుండా ఎవరైనా సరే ఒకసారి ఆన్లైన్లో ఎఫైర్ మొదలెట్టారంటే వదిలించుకోవడం చాలా కష్టమట. ఈ విషయాన్ని బ్రిటన్కు చెందిన కొందరు సైకాలజీ ప్రొఫెసర్లు తమ రీసెర్చ్ ద్వారా వెల్లడించారు. సోషల్ మీడియా(ఫేస్బుక్, ట్విట్టర్), ఈమెయిల్స్, తదితర ఇంటర్నెట్ వినియోగ యాప్స్ నుంచి మనం చేసుకునే పరిచయాలు, స్నేహం, ప్రేమ లాంటి సంబంధాలను ఆన్లైన్ ఎఫైర్స్ అని చెప్పవచ్చు.
ఆండ్రియాస్ వొస్లర్, నయోమి మొల్లర్ అనే సైకాలజీ ప్రొఫెసర్లు కొందరు వ్యక్తులను పరిశీలించి వారితో మాట్లాడి ఈ విషయాన్ని వెల్లడించారు. తన భర్త మామాలుగా అయితే చాలా సిగ్గరి అని, కానీ ఆన్లైన్ విషయానికొచ్చేసరికి చాలా కాన్ఫిడెంట్గా ఉండి పరాయి మహిళను బుట్టులో వేయగలడని చెప్పిందని వారు తెలిపారు. 20 నుంచి 70ఏళ్ల వయసు ఉన్న వారిని తమ రీసెర్చ్లో భాగంగా పరిశీలించారు. ఆన్లైన్ ఎఫైర్స్ అంత త్వరగా వదిలించుకోలేమని, అవి తమకు వ్యసనంగా మారుతున్నాయని ఎక్కువ మంది తమ అనుభవాలలో పేర్కొన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.
ఆన్లైన్ అడిక్షన్ స్త్రీ, పురుషులలో ఒకే విధంగా ఉండదని, అలాగని ఒకే జెండర్ కలిగిన వ్యక్తులలో కూడా ఒకే తరహాలో ఉండదని.. ప్రతివ్యక్తి ఒక్కోలా వ్యవహారిస్తారని వోస్లర్ అన్నాడు. ఇంటర్నెట్ సౌకర్యం వల్ల భార్య, భర్త ఎవరైనా సరే పరాయి వ్యక్తులతో సంబంధాలు పెట్టుకునేందుకు అధికంగా అవకాశాలుంటున్నాయని కొందరు తమతో చెప్పినట్లు రీసెర్చర్స్ వెల్లడించారు. మరికొందరైతే ఆన్లైన్ ఎఫైర్స్, బయట కలిసినప్పుడు ఏర్పడే సంబంధాల కంటే చాలా త్వరగా కనెక్ట్ అయి రిలేషన్స్కు అడిక్ట్ అవుతారని తమ రీసెర్చ్లో తేలిందని బ్రిటన్ ప్రొఫెసర్స్ వివరించారు.