సాక్షి, భువనగిరి: నేటి యువత స్మార్ట్‌ఫోన్‌లో మునిగితేలుతోంది. ఎంతలా అంటే తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనంతలా అందులో లీనం అవుతున్నారు. నిత్యం ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర వాటిల్లో మునిగి తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేసి మోసపోతున్నారు. కొంత మంది దుండగులు అమాయక యువతులనే ఆసరా చేసుకొని వలలో వేసుకుంటున్నారు. ఇటీవలే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఓ బాలిక ఫేస్‌బుక్‌లో ఓ యువకుడితో పరిచయం పెంచుకొని, చివరికి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలు ఫోన్‌లలో ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టాల్సి న అవసరం ఉంది. పిల్ల్లలు ఫోన్‌లను మితిమీరిగా వినియోగించకుండా తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు ఫేస్‌బుక్, వాట్సాప్, షేర్‌చాట్, ఇన్‌స్ట్రాగామ్, టిక్‌టాక్, తదితర వాటిపై మునిగిపోతుంది నేటి యువత. సమయం తెలియకుండానే కాలాన్ని గడుపుతున్నారు. తాము చేసే పని వల్ల ఇతరులకి ఇబ్బందులు పెట్టడంతోపాటు, పరువు పోగొట్టుకోవడంతో చివరికి చావుకు దారితీసే పరిస్థితి వరకు వెళ్తున్నాయి. ఇంటర్‌నెట్ అపరిమితంగా అందుబాటులోకి రావడంతో జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. టిక్‌టాక్ మోజులో పడి ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. ఒకరకంగా ప్రస్తుతం నేరాల సంఖ్య పెరగడానికి సోషల్ మీడియానే కారణంగా చెప్పవచ్చు. ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్లను ఓపెన్ చేసి అమ్మాయిలను స్నేహం, ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి వారి జీవితాలతో ఆడుకోవడంతోపాటు ప్రాణాలు సైతం హరింపజేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పెట్టే ఫొటోలను నిజమా, అబద్దమా గుర్తించకుండా అపరిచితులను పరిచయాలను చేసుకుంటూ అనర్థాలకు దారి తీసుకుంటున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- ఫేస్‌బుక్‌లో పుట్టినతేదీ, తదితర తమ పర్సనల్ వివరాలు పెట్టకూడదు. ఒకవేళ పెట్టినా తనకు దగ్గర ఫ్రెండ్స్ ఉన్నవారికి మాత్రమే వివరాలు కనిపించే విధంగా జాగ్రత్త పడాలి.
- లోకేషన్ హాలీడే ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెట్టకూడదు. ఇలాంటి ఫొటోలు పెట్టడం వల్ల తాము ఎక్కడ ఉన్నదనేది గమనించి వారి ఇళ్లల్లో చోరీకి పాల్ప డే అవకాశం ఉంటుంది.
- ఆఫీస్ కార్యాలయాల్లో పనిచేసే వ్యక్తులు వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఫొటోలను ఫేస్‌బుక్‌లలో పోస్టు చేయకూడదు. ఇలాంటి ఫొటోలు పోస్టు చేయడం వల్ల కార్యాలయ వాసులు తెలుసుకుని వారిని చులకనగా చూడడంతోపాటు అవమానపర్చే విధంగా వ్యవహరించే అవకాశం ఉంది.
- ఫోన్ నంబర్లను ఎట్టి పరిస్థితుల్లో ఫేస్‌బు క్‌లో పెట్టకూడదు. ఫోన్ నంబర్లు ప్రైవసీ సిట్టింగ్‌లలో మాత్రమే పెట్టాలి.
- మద్యం తాగే ఫొటోలు పెట్టడం వల్ల యువత ఉద్యోగాలను పొందే సమయంలోగాని, వివాహం చేసుకునే సమయంలోగాని వారి జీవితాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
- ఫేస్‌బుక్‌లలో మాజీ ప్రియుడు, ప్రియురాళ్లతో ఫొటోలు అప్‌లోడ్ చేయకూడదు. ఇలాంటి ఫొటోలు పెట్టడం వల్ల వివాహ జీవితం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది.
ఫేస్‘బుక్’
నల్లగొండ: సామాజిక మాధ్యమాల ద్వారా మంచిని తెలుసుకోవాల్సిన యువత పెడదోవపడుతూ ఫేస్‘బుక్’ అవుతుతోంది. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను తెరిచి ఫేస్‌బుక్ డీపీగా అమ్మాయిల ఫొటోలు పెట్టి ఇతర అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం చేసుకొని ఆతర్వాత ఫోటోలు షేర్ చేసుకొని ఇద్దరి మధ్య స్నేహ సంబంధం బలంగా ఏర్పడిన తర్వాత తాను అమ్మాయిని కాదని, అబ్బాయిని అని చెప్పి స్నేహాన్ని కొనసాగించి ప్రేమ పేరుతో వంచనకు గురి చేస్తున్నారు. మరికొందరు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరికి ముఖం చాటేస్తున్నారు. పొరపాటున వచ్చిన ఫోన్‌కాల్‌తో మరికొందరు మోసగాళ్ల చేతిలో పడి విలువైన జీవితాన్ని కోల్పోతున్న సంఘటనలు అనేకం.
అమ్మాయి పేరిట..
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి నాగరాజు అమ్మాయి పేరిట ఫేస్‌బుక్ అకౌంట్‌ను ప్రారంభించి నల్లగొండకు చెందిన డిగ్రీ విద్యార్థితో పరిచయం ఏర్పర్చుకున్నాడు. డిగ్రీ విద్యార్థిని వివరాలను సేకరించి నేను కూడా మీ పాఠశాల, మీ కళాశాలలోనే చదివానని, అమ్మాయి ఫొటోతో వివరాలు ఫేస్‌బుక్‌లో పెట్టాడు. దీంతో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. చూడాలనిపిస్తుందని, నిన్ను చూసి చాలా ఏళ్లు గడిచాయని మధురమైన మాటలు చెప్పాడు.
ఫుల్ ఫొటో పంపించాలని కోరడంతో మోపోయిన ఆ అమ్మాయి ఫొటోలను పంపించింది. ఆ తర్వాత నాగరాజు తాను అమ్మాయిని కాదని, పెళ్లి చేసుకుందామని చెప్పడంతో అందుకు నిరాకరించిన ఆమెను బెదిరింపులకు గురి చేశాడు. ఇద్దరు కలిసి ఉన్నట్లుగా, ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫోటోలు పంపించాడు. డబ్బులు ఇవ్వకపోతే ఫేస్‌బుక్‌లో పెడతానని, పరువు పోతుందని బెదిరించడంతో పరువుపోతుందని రూ.3వేలు నాగరాజు ఖాతాలో వేసింది. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో గత ఏడాది సెప్టెంబర్‌లో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది.
పూల వ్యాపారి వలలో...
వరంగల్‌కు చెందిన ఒక ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని నల్లగొండలోని పూలు అమ్ముకునే ఒక వ్యాపారికి పొరపాటున ఫోన్ టచ్ అయి వచ్చింది. ఫోన్ మిస్డ్ కాల్స్ ఉన్నాయంటూ, మీ ఫ్రెండ్‌ను అంటూ మాటల్లో పెట్టి స్నేహం పెంచుకున్నాడు. 10వ తరగతి కూడా చదవని పూల వ్యాపారి వరంగల్‌కు చెందిన ఆ విద్యార్థినిని వలలో వేసుకున్నాడు. ఆ విద్యార్థిని పెళ్లి చేసుకుందామని నల్లగొండకు రావడంతో పూల వ్యాపారి భయపడి మైనార్టీ తీరలేదని, పెళ్లి చేసుకుంటామని పోలీసులను ఆశ్రయించాడు. 2ఏళ్ల క్రితం పోలీసులు విద్యార్థిని తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
నేటి యువత స్మార్ట్‌ఫోన్ దొరికితే చాలు సమయం తెలియకుండా గడుపుతున్నారు. ఫేస్‌బుక్‌లలో వ్యక్తుల గురించి తెలుసుకోకుండా పరిచయం చేసుకుని చాటింగ్‌లు చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పెట్టే ఫొటోలకు, కామెంట్లకు ఆకర్షితులవుతున్నారు. దీంతో వ్యక్తుల మధ్య ఎలాంటి విషయాలు తెలుసుకోకుండా పరిచయం పెంచుకుని అనర్థాలకు దారితీసుకుంటున్నారు. కొన్ని పరిచయాలు మరణాలకు సైతం దారితీస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని గాని పరిమితికి మించి వాడకూడదు. వ్యక్తిగత సమాచారాలను ఫేస్‌బుక్‌లో పెట్టకూడదు. ఫేస్‌బుక్ పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలి.
– భుజంగరావు, ఏసీపీ భువనగిరి
నిబంధనలు అమలు చేయాలి
ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిబంధనలు లేకపోవడం వల్ల స్మార్ట్‌ఫోన్‌లను విరివిగా వాడుతున్నారు. చాటింగ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లతో కాలం గడుపుతున్నారు. ఫేస్‌బుక్ పరిచయాల వల్ల అనర్థాలకు దారితీస్తోంది. యువతీ యువకుల మధ్య ఫేస్‌బుక్ ద్వారా ఏర్పడ్డ పరిచయాలతో ప్రాణాలు సైతం పొగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో నూతన చట్టాలను తీసుకువచ్చి మూడు నెలల్లో శిక్ష అమయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది.
– గొట్టిపాముల బాబురావు, అడ్వకేట్
యువత సోషల్ మీడియాతో చిత్తవుతోంది
నేటి యువత సోషల్ మీడియా మత్తులో చిత్తయిపోతుంది. సోషల్ మీడియా ప్రభావం మత్తు పదార్థాల కన్నా ఎక్కువగా ఉంటుంది. టిక్‌టాక్ మోజులో పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవడం మనం చూశాం. నేరాలకు ఒకరకంగా సోషల్ మీడియానే కారణం అవుతోంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో కనిపించని మనుషులతో కబుర్లు ఆడుతూ విలువైన కాలాన్ని హరింపజేసుకుంటున్నారు. కొంతమంది ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసి అమ్మాయిలను స్నేహం, ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. స్నేహం చేసేటప్పుడు అవతలి వ్యక్తి నిజమా, అబద్దమా తెలియకుండా గుడ్డిగా ఆడపిల్లలు ప్రేమ పేరుతో మోసపోవడం అనేది పరిపాటిగా మారింది. వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవడం, ఫొటోలను షేర్ చేయడం ద్వారా కూడా ఎదుటి వారి ఉచ్చులోకి పడిపోతున్నారు. ముఖ్యంగా యువతనే కాకుండా ఎవరైనా సరే అప్రమత్తంగా ఉండాలి. జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని లక్ష్య సాధనలో ప్రతి క్షణం కష్టపడాలి.
– గంజి భాగ్యలక్ష్మి, మోటివేషనల్ స్పీకర్, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment