వీసా సమస్యలపై ఓపెన్ హౌస్
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో 15 రోజులకు ఒకసారి..
వాషింగ్టన్: వీసా, పాస్‌పోర్ట్, ఓవర్‌సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు సమస్యలను పరిష్కరించేందుకు వచ్చే జనవరి నుంచి ఓపెన్ హౌస్ నిర్వహించనున్నట్లు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ‘భారత రాయబార కార్యాలయంలో, ఐదు కాన్సులేట్లలో వచ్చే జనవరి మొదటి వారంలో ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నాం’అని అమెరికాలో భారత రాయబారి నవతేజ్ సర్ణ వెల్లడించారు. ఇండియన్- అమెరికన్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌స ఆదివారం వాషింగ్టన్‌లో నవతేజ్ సర్ణను సత్కరించారుు. ఇప్పటివరకూ అమెరికాలో భారత ఉప రాయబారిగా వ్యవహరించిన తరణ్‌జిత్ సింగ్ సంధు శ్రీలంకలో భారత హైకమిషనర్‌గా వెళ్తున్న నేపథ్యంలో ఏర్పాటుచేసిన వీడ్కోలు కార్యక్రమంలో సర్ణ మాట్లాడారు.
వీసా, పాస్‌పోర్ట్, ఓసీఐ కార్డులపై సమస్యలుంటే ఓపెన్‌హౌస్‌లో వెంటనే పరిష్కరిస్తామన్నారు. ప్రతి పదిహేను రోజులకోసారి ఓపెన్ హౌస్ నిర్వహిస్తామని.. హౌస్ నిర్వహించే తేదీ, సమయాన్ని వెబ్‌సైట్‌లో ఉంచుతామని చెప్పారు. ఇలాంటి ఏర్పాట్లే అమెరికాలో ఉన్న తమ అన్ని కాన్సులేట్లలో చేస్తామన్నారు. ప్రస్తుత వ్యవస్థలన్నీ బాలారిష్టాలు ఎదుర్కొంటున్నాయని.. అందువల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందన్నారు. కొన్నేళ్లలో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంధు మాట్లాడుతూ భారత్, అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ పాత్ర ప్రశంసనీయమని అన్నారు.