పార్లమెంట్ సాక్షిగా మహిళపై ప్రధాని దుశ్చర్య!
ఒట్టావో: పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీకి చెందిన మహిళా నేతపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. పార్లమెంటులోనే మహిళా నాయకురాలిని ఆయన నెట్టివేశారని, ఆమెపై చేయి చేసుకున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధాని ట్రూట్ తన ఛాతీపై మోచేతితో వెనక్కి నెట్టివేశాడని, అత్యంత హేయనీయమని బాధిత మహిళా నేత రుథ్ ఎల్లెన్ బ్రోస్సే ఆరోపించారు. మహిళా నాయకురాలి ఛాతీని తాకడం, మోచేతితో నెట్టివేసి ఇంత దారుణంగా ప్రవర్తించడంలో ఆయన ఉద్దేశమేంటని ఆమె ప్రశ్నించారు.
ప్రధాని ట్రూడ్ చర్యతో మొదట ఆశ్చర్యపోయిన ఆమె ఆ వెంటనే ఘటన నుంచి తేరుకుని పార్లమెంట్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రధాని దురుసు ప్రవర్తన కారణంగా తాను ఓటు హక్కును వినియోగించుకోలేక పోయానని ఎల్లెన్ వివరించారు. హౌస్ ఆఫ్ కామన్స్ సీసీ ఫుటేజీ పరిశీలించి చూడగా, ప్రధాని ప్రతిపక్ష నేతలపై దాడికి దిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయాలను పక్కనపెడితే ట్రూడ్.. గతంలో బాక్సర్ గా, బార్ లో బౌన్సర్ గానూ చేశారు. చాంబర్ లో స్ట్రాంగ్ లీడర్లను వెనక్కి తగ్గేలా చేయడంలో భాగంగా ట్రూడ్ ఈ చర్యలకు దిగారని తీవ్రంగా మండిపడుతున్నారు. తాను తీసుకొచ్చిన సవరణలపై ఓటింగ్ ప్రవేశపెట్టామని, అయితే ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని క్షమాపణ కోరుతున్నానని ట్రూడ్ వివరణ ఇచ్చుకున్నారు.