![Orange Hair Is Everywhere In Bangladesh - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/21/henna_.jpg.webp?itok=OEWQ0V6a)
ఢాకా : అక్కడి వృద్ధులు తాము మానసికంగా యువకులమే అంటున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఎరుపు, నారింజ రంగు గడ్డాలతో తాతలంతా తళతళా మెరుస్తున్నారు. స్టైల్‌ను ప్రతిబింబించేలా భిన్న రంగుల్లో హెన్నా లభిస్తుండటంతో వయసు పైబడిన వాళ్లంతా వయసు దాచేందుకు వీటిని ఎంచుకుంటున్నారు. తాను రెండు నెలల నుంచి తన జుట్టుకు ఈ రంగులు వాడుతున్నానని 60 ఏళ్లకు చేరువైన మహబుల్ బషర్ తన తాజా లుక్‌కు ముచ్చటపడుతూ చెప్పుకొచ్చారు. స్ధానిక కూరగాయల మార్కెట్‌లో పోర్టర్‌గా పనిచేస్తున్న 60 ఏళ్ల అబుల్ మియా కూడా సరికొత్త రంగులు తమ మేకోవర్‌కు బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ‘ఇలా రంగువేసుకోవడం బావుంది..తాను ఇప్పుడు యంగ్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నానని కుటుంబ సభ్యులు చెబుతున్నా’రని ఆయన సంబరపడ్డారు.
బంగ్లాలో హెన్నా వాడకం దశాబ్ధాలుగా సాగుతున్నా ఇప్పుడు దీని ప్రాచుర్యం శిఖరాలకు చేరింది. ఢాకా వీధుల్లో ప్రస్తుతం సరికొత్త రంగుల్లో గడ్డంతో మెరిసిపోయే వారు ఎటు చూసినా కనిపిస్తారు. గడ్డం, మీసాలు, తల వెంట్రుకలు సహా జుట్టుకు ఆరంజ్ హెన్నాను అప్లై చేసేవారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. హెన్నా పెట్టుకోవడం ఇటీవల కాలంలో ఫ్యాషన్ ఛాయిస్‌గా మారిందని కాన్వాస్ మేగజైన్‌లో ఫ్యాషన్ జర్నలిస్ట్ దిదారుల్ దిపు చెప్పారు. ఈ పౌడర్ అన్ని చోట్లా దుకాణాల్లో లభ్యమవుతుందని, అందరూ సులభంగా దీన్ని అప్లై చేస్తున్నారని అన్నారు. మరోవైపు ఇమామ్‌లు సైతం తమ ఇస్లాం మూలాలు చాటేందుకు హెన్నా వాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. మహ్మద్ ప్రవక్త సైతం తన గడ్డానికి హెన్నా వాడారని తనకు కొందరు మత ప్రభోదకులు చెప్పారని అందుకే తానూ వాడుతున్నానని ఢాకాకు చెందిన అబూ తాహెర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment