ప్రతీకారంతో రగులుతున్న లాడెన్ కొడుకు!
వాషింగ్టన్: తన తండ్రి, అల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ హత్యపై అతడి కుమారుడు హంజా బిన్ లాడెన్ ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. ఈ విషయాన్ని అమెరికాలో 9/11 దాడుల విచారణలో పాల్గొన్న ఎఫ్‌బీఐ మాజీ అధికారి అలీ సౌఫన్ వెల్లడించారు. 2011 మే2 న లాడెన్‌ను మట్టుబెట్టిన సమయంలో కొన్ని లేఖలను తన బృందం స్వాధీనం చేసుకున్నట్లు ఓ టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. వాటి ప్రకారం.. తండ్రి తర్వాత అల్ ఖైదాకు తాను నాయకత్వం వహిస్తానని, జిహాద్ మార్గాన్ని తాను ఎంచుకుంటానని అందుకు ఏ త్యాగానికైనా సిద్ధపడతానని తండ్రి బిన్ లాడెన్‌కు హంజా మాటిచ్చాడు.
ఇటీవల హంజా రెండు నిమిషాల ఆడియో టేపులు కలకలం రేపిన విషయం తెలిసిందే. 'నేను అంతర్జాతీయ ఉగ్రవాదిగా మారుతున్నాను. అమెరికన్లు జాగ్రత్త.. అల్ ఖైదా మీ పై ప్రతీకారం కోసం ఎప్పుడూ రగిలిపోతుంటుంది. మేం వేసే ప్రతి అడుగు మీ నాశనానికి దారి తీస్తుంది. ఇరాక్.. అఘ్గనిస్తాన్‌లకు మీరు చేసిన ద్రోహాన్ని మేం ఎప్పటికీ మరిచిపోము. ఇదంతా మీపై ప్రతీకారానికి సంకేతాలు' అని హంజా ఆడియో సందేశాలలో ఉన్న విషయాన్ని అధికారి ప్రస్తావించారు. బిన్ లాడెన్ తరహాలో హంజా మాట్లాడుతున్నాడని, ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేయడం.. అమెరికాను నాశనం చేశడమే తన ముందున్న లక్ష్యమంటూ హెచ్చరిస్తున్నాడని ఎఫ్‌బీఐ మాజీ అధికారి అలీ సౌఫన్ వివరించారు. జిహాదీలు అందరినీ ఏకం చేసి అమెరికాపై దాడి చేసేందుకు అల్ ఖైదా నేత హంజా విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.