ఇస్లామాబాద్ : లాహోర్ సమీపంలోని ఫరూఖాబాద్ గురుద్వారను సందర్శించే భారత యాత్రికులను కలుసుకునేందుకు భారత హైకమిషన్ అధికారులను పాకిస్తాన్ మరోసారి అడ్డగించింది. నాన్‌కన సాహిబ్, గురద్వార వద్ద గురునానక్ దేవ్ 550వ జయంతోత్సవాలు నిర్వహిస్తుండగా రంజిత్ సింగ్, సునీల్ కుమార్‌ల నేతృత్వంలో ఇస్లామాబాద్ నుంచి చేరుకున్న భారత దౌత్య బృందాన్ని ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) అధికారులు నిలువరించారు. మరోవైపు గురుద్వార వెలుపల సైతం వారి పట్ల పాక్ అధికారులు అమర్యాదకరంగా వ్యవహరించారు.
భారత అధికారులను గురుద్వార లోనికి రాకుండా సిక్కుల రూపంలో ఐఎస్‌ఐ ఏజెంట్లు అడ్డుకున్నారు. భారత్‌లో ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఎన్నో గురుద్వారాలు ఉన్నా ఎక్కడా వాటిలో ప్రవేశించేందుకు నియంత్రణలు లేవని, గురుద్వారలోనికి రాకుండా కొందరు అడ్డుతగలడం తాము తొలిసారిగా చూస్తున్నామని భారత దౌత్యవేత్త చెబుతున్న వీడియో పాక్ దమననీతిని వెల్లడించింది. గురుద్వార పవిత్రతకు భంగం వాటిల్లేలా పాక్ అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు.
మరోవైపు సాధారణ యాత్రికుల తరహాలోనే తమను గురుద్వారలోకి అనుమతించాలని భారత దౌత్యవేత్త పాకిస్తాన్ అధికారులను కోరగా పంజాబి సిఖ్ సంఘటన్ చీఫ్ గోపాల్ సింగ్ చావ్లా ఆయనతో వాదనకు దిగి మరో రోజు గురుద్వారను సందర్శించాలని సూచించారు. ఇక భారత దౌత్యవేత్తలను తాము గురుద్వారలోకి అనుమతించే పరిస్థితిలో లేమని సిక్కు ప్రముఖులు రమేష్ సింగ్ అరోరా, తారా సింగ్ ప్రధాన్‌లు తేల్చిచెప్పారు. కాగా పాకిస్తాన్‌ను సందర్శించే సిక్కు యాత్రికులను కలుసుకునేందుకు భారత హైకమిషన్ అధికారులను పాకిస్తాన్ నిలువరిస్తుంటే పాకిస్తాన్ యాత్రికులతో కలిసి సర్‌హింద్ షరీఫ్‌లో చద్దర్ సమర్పించేందుకు భారత్‌లో పాక్ హైకమిషనర్‌ను భారత్ అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment