సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేస్తుందని కథనాలు వస్తున్న నేపథ్యంలో.. పాకిస్థాన్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. ఎలాగోలా భారతదేశాన్ని ఈ ఒప్పందం రద్దు చేసుకోనివ్వకుండా చూడాలని కోరింది. పాకిస్థాన్ అటార్నీ జనరల్ అష్తర్ ఔసఫ్ అలీ నేతృత్వంలో కొందరు సీనియర్ అధికారులు కలిసి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ప్రపంచబ్యాంకు ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అంతర్జాతీయ కోర్టుకు కూడా పాకిస్థాన్ వెళ్లినట్లు జియో న్యూస్ వెల్లడించినా.. దానికి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు.
నీలం, చీనాబ్ నదులపై భారతదేశం కడుతున్న కిషన్‌గంగ, రాటిల్ జలవిద్యుత్ ప్రాజెక్టుల గురించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ ఆగస్టు 19వ తేదీన ఒక లేఖ రాసింది. అంతర్జాతీయ కోర్టులో ప్రపంచ బ్యాంకుకు కూడా ప్రధాన పాత్ర ఉంది. ముగ్గురు జడ్జీలను ప్రపంచబ్యాంకు నియమించుకోవచ్చు. ప్రతి దేశం ఇద్దరు ఆర్బిట్రేటర్లను నియమించుకునే అవకాశం ఉంది. జడ్జీలను త్వరగా నియమిస్తే.. సింధు నదీ జలాల ఒప్పందాన్ని త్వరగా ఆ కోర్టు దృష్టికి తీసుకెళ్తామని ప్రపంచ బ్యాంకు అధికారులకు పాక్ అధికారులు చెప్పినట్లు తెలిసింది. అయితే.. తగిన సమయంలోనే తాము చేయాల్సిన పని చేస్తామని ప్రపంచబ్యాంకు చెప్పినట్లు సమాచారం.
అయితే.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తుండటంతో.. సాధారణంగా జరగాల్సిన వ్యవహారాలన్నీ ఆలస్యం అవుతున్నాయని భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సల్మాన్ హైదర్ చెప్పారు. ఉడీలో జరిగినది చాలా పెద్ద ద్రోహమని, కనీసం ఆ ఘటనను పాకిస్థాన్ ఖండించలేదని ఆయన అన్నారు. అలాంటిది మన కట్టడాలపై వాళ్లు ఇష్టం వచ్చినట్లు కోర్టుకు వెళ్లినంత మాత్రాన ప్రయోజనం ఉండదని చెప్పారు.
ప్రపంచబ్యాంకును ఆశ్రయించిన పాక్
Published Wed, Sep 28 2016 2:27 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
Advertisement