శ్రీనగర్: ఉగ్రవాదులకు తామేప్పుడూ మద్దతుగా నిలుస్తామని పాకిస్తాన్ మరోసారి నిరూపించుకుంది. భారత భద్రతా దళాల చేతిలో మూడేళ్ల క్రితం హతమైన కురుడుగట్టిన ఉగ్రవాది బుర్హాన్ వనీపై పాక్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ప్రసంశల వర్షం కురిపించారు. బుర్హాన్ వనీ మరణించి నేటితో మూడేళ్లు అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గఫూర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘నిబద్ధత, అంకితభావం, త్యాగం లేకుండా ఏదీ రాదు. రేపటి తరాల కోసం వీరులు దాన్ని కొనసాగించాలి’’ అని పేర్కొన్నారు. దాని తోడు బుర్హాన్ వనీ, జస్టిస్ ఫర్ కశ్మీర్ హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఈ ట్వీట్‌కి జతచేశారు.
కాగా గతంలో కూడా ఇలాంటి అనేక చర్యలకు పాకిస్తాన్ పాల్పడిన విషయం తెలిసిందే. 2017లో వనీ మరణంపై ఆ దేశ అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందిస్తూ.. అతన్ని అమరవీరులతో పోల్చారు. కశ్మీర్‌లో అనేక మంది భారత సైనికుల మరణాలకు కారకుడైన బుర్హాన్ వనీని.. 2016 జూలై 8న భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన విషయం తెలిసిందే. దీనిపై కశ్మీర్‌లో అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. రెండు నెలల పాటు లోయలో ఆందోళనకారులు నిరసనలు వ్యక్తం చేశారు.
బుర్హాన్ వనీ హతమై మూడేళ్లు అయిన సందర్భంగా సోమవారంనాడు శ్రీనగర్‌లోని దుకాణాలు, పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. అంతే కాకుండా అక్కడి ప్రజా రవాణా కూడ మూత పడడంతో రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి. సున్నిత ప్రాంతాల్లో ఎలాంటి చెదురు మదురు సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశాయి. సోషల్ మీడియాలో భావోద్వేగాలు రెచ్చగొట్టకుండా మొబైల్ డాటాను 2జీకి తగ్గించారు. శ్రీనగర్ సహా, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ చర్యలు తీసుకున్నట్లు భద్రతా దళలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment