పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో దేశీయాంగ మంత్రి ఇజాజ్ అహ్మద్ షా
ఇస్లామాబాద్ : జమ్ము కశ్మీర్‌పై పాకిస్తాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌పై పాక్ వాదనను అంతర్జాతీయ సమాజం విశ్వసించడం లేదని దేశీయాంగ మంత్రి బ్రిగేడియర్ (రిటైర్డ్) ఇజాజ్ అహ్మద్ షా వ్యాఖ్యానించారు. కశ్మీర్‌పై భారత్ వాదననే అంతర్జాతీయ సమాజం విశ్వసిస్తోందని చెప్పారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా గత పాలకులందరూ దేశ ప్రతిష్టను నాశనం చేశారని షా దుయ్యబట్టారు. అంతర్జాతీయ సమాజంలో మనల్ని ఎవరూ నమ్మడం లేదు కశ్మీర్‌లో వారు (భారత్) కర్ఫ్యూ విధించారని, ప్రజలకు ఆహారం, మందులు లభించడం లేదని, ప్రజల్ని చితకబాదుతున్నారని మనం చెబుతున్నా ఎవరూ నమ్మకపోగా భారత్ వాదనను విశ్వసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు పాక్ ప్రతిష్టను దిగజార్చారని మండిపడ్డారు.
‘మనం కశ్మీర్‌ను కోల్పోయాం..మనది బాధ్యతాయుత దేశం కాద’ని ప్రజలు భావిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అంతర్జాతీయ సమాజంలో జమ్ము కశ్మీర్ అంశాన్ని భూతద్దంలో చూపేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్న నేపథ్యంలో పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆర్టికల్ 370 రద్దుపై పాక్ గగ్గోలు పెడుతున్నా అంతర్జాతీయ సమాజం భారత్ వాదనతో ఏకీభవిస్తుండటం కూడా పాక్‌కు మింగుడు పడటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment