Interior Minister
-
'అవును ఉగ్రవాదులకు వేలకోట్లు ఇచ్చాం'
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ దేశీయాంగ మంత్రి బ్రిగేడియర్ ఇజాజ్ అహ్మద్‌షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిషేదిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవాకు చెందిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కేటాయించిందని ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.అంతకుముందు జూలైలో తొలి అమెరికా పర్యటన సందర్భంగా, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన దేశంలో 30వేల నుంచి 40వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని పేర్కొన్నట్లు తెలిపారు. వీరంతా పూర్తి స్థాయిలో శిక్షణ పొంది దేశం తరపున ఆఫ్ఘనిస్తాన్, కశ్మీర్లో పోరాడారని చెప్పుకొచ్చారు. ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ఇమ్రాన్ తమ సరిహద్దుల్లో 40 వేర్వేరు మిలిటెంట్ గ్రూపులు పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఇమ్రాన్‌ఖాన్ పాలన తమ దేశాన్ని నాశనం చేస్తోందని, పాక్‌ను పాలిస్తున్న నేతల తీరుతో దేశం భ్రష్టు పడుతోందని అహ్మద్‌షా విమర్శించారు. సెస్టెంబర్ 10న జెనీవాలో జరిగిన 42వ ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమీషన్ (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) సమావేశంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కశ్మీర్‌ను భూమి మీదే అతిపెద్ద జైలుగా మార్చేశారని ఖురేషీ వ్యాఖ్యానించడమే ఇమ్రాన్ పాలనకు నిదర్శనంగా చెప్పవచ్చని అహ్మద్ షా పేర్కొన్నారు. -
కశ్మీర్‌పై పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్ : జమ్ము కశ్మీర్‌పై పాకిస్తాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌పై పాక్ వాదనను అంతర్జాతీయ సమాజం విశ్వసించడం లేదని దేశీయాంగ మంత్రి బ్రిగేడియర్ (రిటైర్డ్) ఇజాజ్ అహ్మద్ షా వ్యాఖ్యానించారు. కశ్మీర్‌పై భారత్ వాదననే అంతర్జాతీయ సమాజం విశ్వసిస్తోందని చెప్పారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా గత పాలకులందరూ దేశ ప్రతిష్టను నాశనం చేశారని షా దుయ్యబట్టారు. అంతర్జాతీయ సమాజంలో మనల్ని ఎవరూ నమ్మడం లేదు కశ్మీర్లో వారు (భారత్) కర్ఫ్యూ విధించారని, ప్రజలకు ఆహారం, మందులు లభించడం లేదని, ప్రజల్ని చితకబాదుతున్నారని మనం చెబుతున్నా ఎవరూ నమ్మకపోగా భారత్ వాదనను విశ్వసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు పాక్ ప్రతిష్టను దిగజార్చారని మండిపడ్డారు. ‘మనం కశ్మీర్‌ను కోల్పోయాం..మనది బాధ్యతాయుత దేశం కాద’ని ప్రజలు భావిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అంతర్జాతీయ సమాజంలో జమ్ము కశ్మీర్ అంశాన్ని భూతద్దంలో చూపేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్న నేపథ్యంలో పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆర్టికల్ 370 రద్దుపై పాక్ గగ్గోలు పెడుతున్నా అంతర్జాతీయ సమాజం భారత్ వాదనతో ఏకీభవిస్తుండటం కూడా పాక్‌కు మింగుడు పడటం లేదు. -
'మీడియా జాగ్రత్తగా ఉంటే మంచిది'
ఇస్లామాబాద్: తమ దేశ మీడియాకు పాకిస్థాన్ గట్టి హెచ్చరికలు చేసింది. ఇరాన్‌తో కలిసి గూఢచర్యం నిర్వహిస్తున్నారనే కారణంతో భారత్ కు చెందిన ఓ ఇంటెలిజెన్స్ అధికారిని అరెస్టు చేశారని అక్కడి కొన్ని పాకిస్థాన్ మీడియా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తల పట్ల ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి ఇరు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పేర్కొంది. దీంతో పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి తాము అరెస్టు చేసిన భారత అధికారికి ఇరాన్ కు ఎలాంటి సంబంధం లేదని, కొన్ని వార్తలు ప్రచురించే సమయంలో కాస్తంత ముందూ వెనుక చూసుకొని చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌తో తమకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని, తమది సోదరుల మధ్య ఉండేటటువంటి అనుబంధం అని, అది చెడిపోయేలా చూడొద్దని హెచ్చరించారు. ఇంకోసారి ఇలాగే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. -
2.5 లక్షల మంది స్వదేశానికి తిరిగొచ్చేశారు
ఇస్లామాబాద్ : ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విదేశాల నుంచి మొత్తం 251,624 పాకిస్తానీ జాతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారని ఆదేశ మీడియా సంస్థ శనివారం వెల్లడించింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పాక్ తిరిగి వచ్చిన వారి వివరాలను ఆ దేశ హోం శాఖ మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ గణాంకాలతో సహా వివరించారని తెలిపింది. 2013లో జున్ 1 - డిసెంబర్ 31 మధ్య 45,008 మంది పాకిస్థానీయులు స్వదేశం చేరుకున్నారని వివరించారు. అలాగే 2014లో 78, 409 మంది... 2015లో 116,165 మంది... గత కొన్ని నెలలుగా 12,022 మంది స్వదేశం పాక్ చేరుకున్నారని విశదీకరించారు. అధికారిక నివేదిక ప్రకారం గత రెండున్నర ఏళ్లుగా.... సౌదీ అరేబియా నుంచి 120,393 మంది, ఇరాన్ నుంచి 38,097 మంది, యూఏఈ నుంచి 23, 330 మంది, బ్రిటన్ నుంచి 5400 మంది, యూఎస్ నుంచి 358 మంది, ఒమెన్ నుంచి 11,248 మంది, మలేషియా నుంచి 9, 789, గ్రీస్ నుంచి 6,976 నుంచి పాక్ చేరుకున్నారని పేర్కొంది. భారత్ నుంచి మాత్రం 27 మంది పాక్ చేరుకున్నారని చెప్పింది.