'మీడియా జాగ్రత్తగా ఉంటే మంచిది'
ఇస్లామాబాద్: తమ దేశ మీడియాకు పాకిస్థాన్ గట్టి హెచ్చరికలు చేసింది. ఇరాన్తో కలిసి గూఢచర్యం నిర్వహిస్తున్నారనే కారణంతో భారత్ కు చెందిన ఓ ఇంటెలిజెన్స్ అధికారిని అరెస్టు చేశారని అక్కడి కొన్ని పాకిస్థాన్ మీడియా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తల పట్ల ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి ఇరు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పేర్కొంది.
దీంతో పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి తాము అరెస్టు చేసిన భారత అధికారికి ఇరాన్ కు ఎలాంటి సంబంధం లేదని, కొన్ని వార్తలు ప్రచురించే సమయంలో కాస్తంత ముందూ వెనుక చూసుకొని చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్తో తమకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని, తమది సోదరుల మధ్య ఉండేటటువంటి అనుబంధం అని, అది చెడిపోయేలా చూడొద్దని హెచ్చరించారు. ఇంకోసారి ఇలాగే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు.