ఇస్లామాబాద్ : కశ్మీర్‌కు స్వాతంత్ర్యం సాధించేందుకు భారత్‌తో యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో దాయాది దేశం భారత్‌పై విద్వేషపూరిత వైఖరి ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించిన ఇమ్రాన్‌ఖాన్ మరోసారి నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. నరేంద్ర మోదీ తన ఫైనల్ కార్డును ఉపయోగించారని.. అయితే ఇందుకు భారత్ తప్పక భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీజేపీ మాతృ సంస్థ ఆరెస్సెస్ ముస్లింలపై మూక దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.
బుధవారం ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ...‘ కశ్మీర్‌లో పౌరులపై జరుగుతున్న దాడులు, అక్కడ నెలకొన్న సంక్షోభం కారణంగా పడుతున్న కష్టాల గురించి మేము చింతిస్తున్నాం. భారత ప్రభుత్వం వ్యూహాత్మక తప్పిదం చేసింది. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ సమాజం మాట్లాడకపోవచ్చు. కానీ కశ్మీరీల తరఫున నేను మాట్లాడతాను. అన్ని వేదికలపై కశ్మీర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లా ఉంటాను. ప్రస్తుత విషయాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో నేను మాట్లాడాను. అదే విధంగా ఇస్లామిక్ దేశాలతో కూడా చర్చిస్తాను’ అని పేర్కొన్నారు.
హక్కులు కాపాడేందుకు సిద్ధం
‘గత 20 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు మా సైనిక దళం శ్రమిస్తోంది. మన హక్కులు, స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. భారత్‌లో జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. పాక్ ఆర్మీ, ప్రజలు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నారు. కశ్మీరీల హక్కుల ఉల్లంఘనలను ఎంతమాత్రం సహించబోము. భారత్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాము’ అని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా కశ్మీర్‌పై భ్రమల్లో జీవించడం ఆపేయాలని పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ స్వదేశీయులకు హితవు పలికిన విషయం తెలిసిందే. మంగళవారం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో ఖురేషీ మీడియాతో మాట్లాడుతూ ఐరాస మద్దతు పొందేందుకు కొత్తగా పోరాటం ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ‘మీరు (ప్రజలు) భ్రమల్లో జీవించడం మానేయాలి. మీ కోసం ఐక్యరాజ్యసమితిలో పూలదండలు పట్టుకుని సిద్ధంగా ఎవరూ లేరు. అక్కడ ఎవరూ మీకోసం ఎదురుచూడటం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇమ్రాన్‌ఖాన్ యుద్ధానికి సిద్ధమంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇక బీజేపీ ప్రభుత్వం చర్యలకు నిరసనగా.. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పాక్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తమ దేశం నుంచి భారత రాయబారిని బహిష్కరించింది. అదే విధంగా ఢిల్లీలోని తమ రాయబారిని వెనక్కి పిలిపిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా.. జమ్మూ కశ్మీర్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, ఇదే అంశంపై సంయమనం పాటించాలని పాకిస్తాన్‌ను కోరింది. భారత్‌తో వాణిజ్య సంబంధాలకు స్వస్తి పలకడంతో పాటు దౌత్యపరమైన చర్యలతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దూకుడు పెంచడంతో సంయమనం పాటించాలని అగ్రరాజ్యం సూచించింది. దీంతో పాక్ దూకుడుకు కళ్లెం వేసినట్లు అయ్యింది. అదే విధంగా ఈ విషయంలో తమకు మద్దతు నిలవాల్సిందిగా కోరిన పాక్ అభ్యర్థనను చైనా తిరస్కరించింది. ఐక్యరాజ్యసమితి కూడా కశ్మీర్ విషయంలో దాయాది దేశాలు చేసుకున్న సిమ్లా ఒప్పందాన్ని గుర్తుచేసి తమ వైఖరిని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు భారత రాజ్యాంగ పరిధిలోనే జరిగిందని రష్యా పేర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment