గాంధీనగర్: పాకిస్తాన్‌లో బందీలుగా ఉన్న భారతీయ జాలర్లను విడిపించేందుకు భారత విదేశాంగశాఖ చేసిన ప్రయత్నలు ఫలించాయి. పాకిస్తాన్‌ను నుంచి ఈనెల 8న విడుదలైన 100 భారత జాలర్లు శుక్రవారం మాతృభూమిపై అడుగుపెట్టారు. వాఘా సరిహద్దులో దేశంలోకి ప్రవేశించిన వారు గురువారం అర్థరాత్రి అనంతరం వడోదర చేరుకున్నారు. గుజరాత్‌కు చెందిన జాలర్లు 17 నెలల క్రితం చేపలు పడుతూ అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటి పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లారు. దీంతో 100 మంది జాలర్లను పాక్ గస్తీ సైన్యం అదుపులోకి తీసుకుంది. అనంతరం వారందరినీ కరాచీ జైలులో నిర్భందించారు. దీనిపై భారత విదేశాంగ శాఖ పలు దఫాలుగా పాక్ ప్రభుత్వంతో చర్చించింది.
ఏడాదిన్నర కాలం తర్వాత జాలర్లను జైలు నుంచి విడుదల చేసిన పాక్.. ఈ నెల 8న అట్టారీ -వాఘా సరిహద్దు వద్ద భారత సైన్యానికి అప్పగించింది. అక్కడ్నుంచి అమృత్‌సర్ మీదుగా వడోదరకు రైలులో జాలర్లను తీసుకువచ్చారు. జాలర్ల విడుదలపై వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. తమను ఒక గదిలో బంధించారని, వేరే చోటకు వెళ్లేందుకు అనుమతించలేదని ఓ జాలర్ వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించాలనే ఉద్దేశంతో.. 360 మంది భారత ఖైదీలను విడుదల చేస్తామని ఏప్రిల్ 5వ తేదీన పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం నాలుగు విడతల్లో అందరినీ విడుదల చేస్తామని పాక్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment