ఆ విధంగా దగ్గరవుతోన్న చైనా- పాక్
ఇస్లామాబాద్: ఓవైపు బలూచిస్టాన్ ప్రాంతంలో ఆర్థిక కారిడార్ నిర్మించాలనుకుంటున్న చైనా.. పాకిస్థాన్ తో తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా కీలక అడుగులు వేస్తోంది. రక్షణ రంగ సహకారంలో భాగంగా మంగళవారం పాక్ ఎనిమిది చైనీస్ జలాంతర్గాముల దిగుమతికి ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 34 వేల కోట్లు. 2028 నాటికి మెత్తం ఎనిమిది చైనీస్ సబ్ మెరైన్లు పాక్ నౌకాదళంలో చేరనున్నాయి. పాక్ జలాంతర్గాముల ప్రాజెక్టు అధిపతితో పాటు సీనియర్ నౌకాదళ అధికారులు ఆగస్టు 26న జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ సభ్యులను ఒప్పించినట్లు పాక్ జాతీయ మీడియా వెల్లడించింది.
మరో విశేషం ఏమంటే పాకిస్థాన్ కు అతి తక్కువ వడ్డీపై దీర్ఘకాలిక రుణం మంజూరు చేసేమరీ చైనా ఈ జలాంతర్గాములను అమ్ముతోంది. అయితే ఏ రకం జలాంతర్గాములపై ఒప్పందం చేసుకున్నారనే విషయాన్ని ఇరుదేశాలు రహస్యంగా ఉంచాయి. ప్రచారంలో ఉన్నట్లుగా టైప్ 039, టైప్ 041 యువాన్ తరగతికి చెందిన ఎటాక్ సబ్‌మెరైన్స్‌ను అందజేసే చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.