రుబీనా సమస్య ఇప్పటికైనా తీరేనా..!
కరాచీ: ఎట్టకేలకు భారత్‌లోని జమ్ము జైలులో ఉంటున్న పాక్ మహిళ రుబీనా సమస్యకు పరిష్కారం దొరకనుంది. మరో జైలులో ఉంటున్న ఆమె కూతురుకు కూడా ఉపశమనం కలగనుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత పాకిస్థాన్‌కు ఆమె విషయంలో కదలిక వచ్చింది. ఆమె తమ దేశస్తురాలో కాదో పరిశీలించి, వివరాలు తెలుసుకుని, తమ దేశానికి తీసుకెళ్లేందుకు నిర్ణయించుకుంది. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి చౌదరీ నిసార్ అలీ ఖాన్ సోమవారం ఈ మేరకు తమ ఉన్నతాధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌కు చెందిన రుబీనా అనే మహిళ తన భర్త మైనర్ కూతురుతో ఢిల్లీకి వచ్చింది.
అయితే ఆమె భర్త ఢిల్లీలో మోసం చేసి విడిచిపెట్టి వెళ్లాడు. అయితే, చుట్టుపక్కలవారు ఆమెపై జాలితో డబ్బు సాయం చేయగా నాడు వాఘా సరిహద్దుకు వెళ్లింది. అయితే, ఆమె దగ్గర ట్రావెలింగ్ పత్రాలు లేకపోవడంతో అక్కడి పాక్ అధికారులు ఆమెను అనుమతించలేదు. ఈ సంఘటన నాలుగేళ్ల కిందట చోటు చేసుకుంది. దీంతో వారిని కశ్మీర్‌లో భారత పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆ వివరాలను పాక్ హైకమిషనర్‌కు తెలియజేయగా వారిని తమ దేశస్తులుగా గుర్తించేందుకు నిరాకరించడంతోపాటు వారికి సహాయం చేసేందుకు కూడా నిరాకరించింది.
దీంతో వారిని నాలుగేళ్లుగా జమ్ములోని రెండు వేర్వేరు జైలులో పోలీసులు ఉంచుతున్నారు. ఈమె కేసును విచారిస్తున్న మిర్ షాఫకత్ అనే న్యాయవాది కూడా గతంలో కోర్టుకు వివరణ ఇచ్చారు. రుబీనా పాకిస్థాన్‌లోని సింద్ ప్రావిన్స్‌లోగల హైదరాబాద్‌కు చెందిన మహిళ అని, తన భర్తతో కలిసి 2012 నవంబర్‌లో ఢిల్లీకి వచ్చిందని 2012లోనే వాదనలు వినిపించారు. అయినప్పటికీ అప్పుడు చలించని పాక్ తాజాగా స్పందించింది. రుబీనా పాక్ జాతీయురాలిగా గుర్తిస్తే తిరిగి మాతృదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కూడా ఆమె ఆయన తాజా ఆదేశాల్లో కోరారు.