ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌కు వెళ్లే నదుల నీటిని భారత్‌కు మళ్లిస్తామని హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ విదేశాంగ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైసల్ స్పందించారు. గురువారం ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడిన ఆయన.. హిమాలయాలకు పశ్చిమంగా ప్రవహించే మూడు నదులపై పాకిస్తాన్‌కు ప్రత్యేక హక్కులున్నాయని పేర్కొన్నారు. మోదీ చెప్పినట్టు భారత్ కనుక అలాంటి చర్యలకు పాల్పడితే అది ఒప్పంద ఉల్లంఘనే అవుతుందని అంతేకాక, దూకుడు చర్యగా కూడా పరిగణింపబడుతుందని తెలిపారు. ఈ విషయంపై స్పందించే హక్కు పాక్‌కు ఉందని వెల్లడించారు. భారత్ ఇలాంటి చర్యలకు పాల్పడదనే అనుకుంటున్నానని తెలిపారు.
కాగా, ఇరు దేశాల మధ్య నదుల నీటి విషయంలో సింధూ జలాల ఒప్పందం ఉంది. దాని ప్రకారం బియాస్, రావీ, సట్లెజ్ నదులను భారత్‌కు, సింధూ, జీలం, చీనాబ్ నదులు పాకిస్తాన్‌కు చెందాయి. ఇరు దేశాలు ఎంత నీటిని వాడుకోవాలనేది ఉమ్మడిగా నిర్ణయించారు. అయితే ప్రాజెక్టులను పూర్తి చేయడంలో జాప్యం కారణంగా భారత్ తన వాటాను పూర్తి స్థాయిలో వాడుకోలేకపోతోంది. ఆ నీళ్లతో పాకిస్థాన్ అదనపు లబ్ది పొందుతోంది. అయితే నీళ్లను అడ్డుపెట్టుకొని భారత్ తమతో ఐదో జనరేషన్ యుద్ధం చేస్తోందని పాక్ గతంలో ఆరోపణలు చేసింది. ఒక సందర్భంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. భారత్ తన వాటాను వాడుకోవడం వల్ల సింధూ ఒప్పందానికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment