ప్రేమ తాళాలు ఇక కనిపించవు!
ప్రపంచంలో అందమైన ప్రదేశాలు అనగానే ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం కూడా మనకు గుర్తుకొస్తుంది. ఎందుకంటే ప్రేమికులు ఎక్కువగా వెళ్లాలనుకునే ప్రదేశాలలో పారిస్ ఒకటి. పారిస్ అనగానే మనకు గుర్తొచ‍్చేవి ఈఫిల్ టవర్, మరొకటి సీన్ నది వంతెన. ఆ వంతెన విశేషాన్ని ప్రేమికులు అయితే బాగా చెబుతారు. అక్కడికి వచ్చే ప్రేమికులు తమ ప్రేమ కలకాలం అలాగే ఉండాలని, తమకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ సీన్ నదిపై ఉన్న పాంట్ డే ఆర్ట్స్ బ్రిడ్జిపై ప్రేమ తాళాలు(లవ్ లాక్స్) వేస్తుంటారు. ప్రేమికుల పేర్లను తాళాలపై రాసి వంతెన ఫెన్సింక్ కు కట్టిన తర్వాత ఆ తాళం చెవిలో నదిలో పారవేయటం అనవాయితీగా వస్తోంది.
అయితే ఆ ప్రేమ తాళాలకు ఇక్కడ కాలం చెల్లనుంది. ఇందుకు రెండు కారణాలున్నాయి. ప్రేమికుల తాళాల బరువు తట్టుకోలేక సీన్ నది వంతెన కూలిపోతుందని నిపుణులు హెచ్చరించడం. పనిలో పనిగా ఆ లవ్ లాక్స్ ను వేలం వేయగా వచ్చిన డబ్బుతో పారిస్ కు తరలివస్తున్న శరణార్థులకు సదుపాయాలు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు వంతెన కూలిపోతుందని నగర ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. కొందరు ప్రేమికులు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. రెండు విధాలా మంచి జరగాలంటే ఇలాంటి చర్యలు చేపట్టాల్సిందేనని పారిస్ నగర అధికారులు చెబుతున్నారు.
పారిస్ నగర అధికారులు ఈ పనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రాజెక్టు ప్రారంభించారు. 65 మెట్రిక్ టన్నుల బరువైన తాళాలు వంతెన ఫెన్సింగ్ లకు ఉన్నాయని, వీటి అమ్మకంతో దాదాపు లక్ష అమెరికన్ డాలర్లు, లేక లో యూరోలు ఆదాయం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. శరణార్థుల కోసం, ఇతర అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవాలనుకునే ప్రజలు ఈ తాళాలను ఒక్కొక్కరు 10 వరకూ కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు.