
పారిస్ మృతులకు నివాళి
పారిస్: పారిస్ నగరంలో ఉగ్రదాడి మరణమృదంగాన్ని మోగించింది. అత్యవసర పరిస్థితి, మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడ చూసినా శ్మశాన వాతావరణం నెలకొంది. ముష్కరమూకల భీకరదాడిలో అసువులు బాసిన తమ బంధువులు, సన్నిహితులకు పారిస్ ప్రజలు శోకతప్త హృదయమాలతో నివాళులర్పిస్తున్నారు. దాడుల్లో నష్టపోయినా, గాయపడినా, వెన్ను చూపేదిలేదనే సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. నిబ్బరంగా, ధైర్యంగా ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఎదుర్కొని తీరతామంటున్నారు.
మరోవైపు పారిస్‌లో నరమేధానికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్, సిరియా) ప్రకటించుకున్నది. పారిస్ దాడికి ఒకరోజు ముందు ఫ్రాన్స్‌ను హెచ్చరిస్తూ ఐఎస్‌ఐఎస్ విదేశీ మీడియా విభాగం అల్ హయత్ మీడియా సెంటర్ ఓ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది.
సిరియాలో దాడులు ఆపకపోతే.. మిమ్మల్ని ప్రశాంతంగా బతుకనివ్వమనే హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి అరబిక్ భాషలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. పారిస్ దాడికి ఒకరోజు ముందు ఆ వీడియో విడుదల చేయడం.. దాడికి పాల్పడింది తామేనని ఐఎస్‌ఐఎస్ ప్రకటించడం ప్రపంచ దేశాలను వణికిస్తోంది.