చీడపీడల గుట్టు తెలిసింది!
సాక్షి, హైదరాబాద్: ఒకేరకమైన పంటలను అధిక విస్తీర్ణంలో పండిస్తే వాటికి చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుందని చాలా కాలం నుంచి తెలిసిందే. అయితే దీనికి కారణం ఇప్పటివరకు తెలియదు. తాజాగా కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనికి గల కారణాలను కనుక్కున్నారు. వేర్వేరు మొక్కలున్న పంటపొలాల్లో కీటకాల పోషకావసరాలు పూర్తిగా తీరవని, ఒకే తీరు పంటలు (మోనోకల్చర్) మాత్రం కీటకాలకు మంచి ఆహారంగా ఉంటాయని శాస్త్రవేత్త విలియం వెట్జెల్ తెలిపారు.
అలాగే తక్కువ ప్రాంతంలో ఎక్కువ ఆహారం అందుబాటులో ఉండటం వల్ల కీటకాలు మోనోకల్చర్ పంటలను ఇష్టపడతాయని చెప్పారు. దాదాపు 53 రకాల కీటకాలను పరిశీలించిన తర్వాత ఈ అంచనాకు వచ్చామని పేర్కొన్నారు. ఒక పంటకు సంబంధించిన వేర్వేరు జాతుల మొక్కలను కలిపి పండించడం ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంటుందని తమ అధ్యయనంలో తేలిందన్నారు. కొన్నిచోట్ల వరి, గోధుమ పంటల్లో ఇప్పటికే ఈ రకమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారని తెలిపారు. అధ్యయన వివరాలు నేచర్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.