మైనస్ 30 డిగ్రీల చలిలో అద్భుతం !
ఏదైనా చల్లని ప్రదేశానికి ఇలా వెళ్తారో లేదో.. నిమిషాల వ్యవధిలో చలిపులికి తట్టుకోలేక గజగజ వణికిపోతారు మనలో చాలామంది! దూరం నుంచి చూసేందుకు మంచు ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. దగ్గరకెళ్తే ఎముకల్ని సైతం కొరికెయ్యగలదు. అందుకే మంచు అధికంగా ఉండే ప్రాంతాలు ఆవాసయోగ్యంగా ఉండవు. కానీ, యూరప్‌లాంటి దేశాల్లో మంచు తిప్పలు సర్వసాధారణం. అందుకే.. ఓ వైపు దట్టంగా మంచు కురుస్తున్నా తన కారును ముందుకే పోనిచ్చాడు స్వీడన్‌కు చెందిన పీటర్ స్కిల్‌బర్గ్. అలా ప్రయాణం కొనసాగించిన ఈయన ఉత్తర స్వీడన్‌లోని ఉమియా పట్టణానికి కూతవేటు దూరంలో ఉండగా మంచు దిబ్బల మధ్య ఇరుక్కుపోయాడు.
కొద్దిసేపు వేచిచూస్తే వాతావరణం మారుతుందనుకుని కారులోనే ఉండిపోయాడు. కానీ అనూహ్యంగా మంచువాన ఎక్కువైంది. కారు నుంచి వెలుపలికి అడుగుపెడితే ఎముకలు కొరికేసే మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత! దీంతో కారులో ఉంటేనే తన ప్రాణాలు నిలబడతాయని తెలుసుకున్నాడు. వెంట తెచ్చుకున్న కొద్దిపాటి స్నాక్స్‌తో కాలక్షేపం చేస్తూ కూర్చున్నాడు. ఎలా గడిచాయో ఏమోగాని రెండు నెలలు గడిచిపోయాయి.
స్కిల్‌బర్గ్ కారు మంచుదిబ్బల మధ్య బయటివారికి కనిపించకుండా పోయింది. ఆయన కూడా దీర్ఘ నిద్రలోకి జారుకున్నాడు. చివరకు జనవరి నెలలో కొందరు ఆయన్ను కారు నుంచి బయటకు తీసేసరికి అపస్మారక స్థితిలో ఉన్నాడు. అత్యంత ప్రమాదకరమైన స్థితి నుంచి అతడు బతికి బట్టకట్టడం వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది. నిజమే.. రెండు నెలలపాటు అంత దట్టమైన మంచులో ఎలా ప్రాణాలు నిలబెట్టుకున్నాడో ఏమో..!