అతడే పట్టించాడు!
కొన్ని సంఘటనలు ఊహలకందవు. ఎప్పుడు, ఎలా, ఎందుకు జరుగుతాయో కూడా ఎవరికీ ఒకపట్టాన బోధపడవు. ఈ కోవలోకి వచ్చేదే రేనాల్డో డగ్సా హత్య కేసు. ఊహలకందనంత విషయం ఏముందీ హత్యలో? హంతకులు దొరకలేదా..? ఎలా చంపారో తెలియలేదా..? హత్య కారణాలు కొలిక్కిరాలేదా..?
పోలీసులకు అంతుచిక్కనేలేదా..? అంటే ఇవేమీ కాదనేదే సమాధానం! మరి, ఏముందీ..?! ఇందులోని విశేషమంతా.. దర్యాప్తు సంస్థలకు, పోలీసులకు ఎలాంటి ఇబ్బందీ కలిగించకుండా హతుడే హంతకుడిని పట్టించడంలోనే ఉంది. చనిపోయిన వ్యక్తి నిందితుణ్ని ఎలా పట్టించగలడు? నమ్మశక్యంగా లేదు కదూ! అయితే, ఇది చదవండి..!
2010, డిసెంబరు 31 ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో మెట్రో ఏరియా ప్రాంతం. ఉదయాన్నే వచ్చిన పేపర్ చదవడంలో తలమునకలయ్యాడు రేనాల్డో డగ్సా(35). ఎంతైనా ఆ ఏరియా కౌన్సిల్ కాబట్టి తమ ఏరియా వార్తలను జాగ్రత్తగా చదువుతున్నాడు. ఇంతలో స్కూలుకు బయల్దేరుతున్న కూతురు రోజీ తండ్రి దగ్గరికి వచ్చింది. తలెత్తి చూసి ఏంటి? అని కళ్లతోనే అడిగాడు. ‘న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి గతేడాది తీసుకెళతానని చెప్పి మాట తప్పారు. ఈసారి మీరు తీసుకెళ్లాల్సిందే! ఇప్పటికే మాట ఇచ్చేశారు కూడా’ అని గుర్తు చేసింది రోజీ. ‘సరేనమ్మా! సాయంత్రం అందరం పార్టీకి వెళుతున్నాం’ అని డగ్సా చెప్పడంతో రోజీ కళ్లు ఆనందంతో మెరిశాయి. ‘థాంక్యూ డాడీ!’ అంటూ సంబరంగా తండ్రిని ముద్దాడింది. స్కూలు బస్సు హారన్ వినబడటంతో టాటా చెప్పి వెళ్లిపోయింది.
న్యూ ఇయర్ పార్టీ!
గతేడాది బిజీగా ఉండటంతో రోజీని పార్టీకి తీసుకెళ్లలేకపోయాడు డగ్సా. అప్పటి నుంచి ఎప్పడు గుర్తుకు వచ్చినా..ఆ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంది. దీంతో ఈసారి ఎలాగైనా తీసుకెళ్లాలని పట్టుదలతో ఉన్నాడు. వెంటనే ఫోన్ చేసి పార్టీకి నాలుగు టికెట్లు బుక్ చేశాడు. డగ్సా అత్తగారు కూడా వారితోనే ఉంటారు. ఈలోపు భార్యని పిలిచాడు. సాయంత్రం కూతురు స్కూలు నుంచి రాగానే అంతా పార్టీకి వెళుతున్నామని చెప్పాడు. కూతురు వచ్చేలోగా అన్ని ఏర్పాట్లు చేసింది డగ్సా భార్య. ఇంతలో స్కూలు బస్సు రానే వచ్చింది. క్షణాల్లో రెడీ అయింది రోజీ. చీకటి పడుతుండగా అంతా బయల్దేరారు. ఏడాది చివరి రోజు కావడంతో నగరమంతా రంగురంగుల దీపాలతో అలంకరించారు. వీధుల వెంట కుర్రకారు హుషారుగా నృత్యాలు చేస్తున్నారు. అది చూసిన రోజీ కూడా కారులోనే కేరింతలు కొడుతోంది.
చివరి చిత్రం!
పార్టీ జరుగుతున్న క్లబ్ వద్దకు చేరుకుంది డగ్సా కారు. రోజీ ఒక్క ఉదుటన కారులో నుంచి దిగింది. తరువాత మిగిలిన వారు దిగారు. కారు పక్కన నిలుచున్న రోజీ తన అమ్మ, అమ్మమ్మలని పిలిచింది. ‘డాడీ.. డాడీ.. మమ్మల్ని ఒక ఫొటో తీయరా’ అని గోముగా అడిగింది. కూతురు మాట కాదనలేక డగ్సా కారులో నుంచి కెమెరా తీశాడు. కానీ, మృత్యువు ఎదురుగానే ఉన్న సంగతిని తెలుసుకోలేకపోయాడు. ‘రెడీ.. స్మైల్..’ అంటూ కెమెరా స్విచ్ నొక్కాడు. ఫ్లాష్ వచ్చింది. ఉన్నట్టుండి ఛాతిని పట్టుకుని కుప్పకూలాడు డగ్సా. ఏం జరిగిందో అర్థం కాలేదు వారికి! అప్పటి దాకా తమతో ఉన్న డగ్సా ఉలుకూపలుకూ లేకుండా నిర్జీవంగా పడి ఉన్నాడు. గుండెపోటు వచ్చిందని కంగారుపడ్డారు. చేతులు విడదీసి చూసిన వారు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. అతని గుండెల్లో బుల్లెట్ గాయం.! వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే డగ్సా చనిపోయాడని చెప్పారు వైద్యులు.
అతడే పట్టించాడు!
క్లబ్ ఎదుట డగ్సా కుప్పకూలగానే.. పక్కనే ఉన్న పోలీసాఫీసరు అతని వద్దకు పరిగెత్తుకు వచ్చాడు. డగ్సా భార్య వెంటనే అతని చేతికి కెమెరాను ఇచ్చింది. ఏదైనా ఆధారం దొరక్కపోదా.. అన్నది వారి ఆశ! వారి అనుమానం నిజమైంది. పోలీసులకు హంతకుడిని పట్టించింది మరెవరో కాదు. చనిపోయిన డగ్సానే! విచిత్రమో.. కాకతాళీయమో.. గానీ డగ్సా తన భార్యాపిల్లలను తీసిన ఆఖరి ఫొటోలో హంతకుడు కూడా ఉన్నాడు. తనవైపే తుపాకీ గురిపెట్టినప్పటికీ డగ్సా చూపంతా కుటుంబ సభ్యులవైపే ఉండటంతో అతన్ని గమనించలేదు. తుపాకీ నుంచి బుల్లెట్లు దూసుకువచ్చే ఒక్క క్షణం ముందు కెమెరాని క్లిక్ మనిపించాడు డగ్సా. మరునాడు ఫిలిప్పీన్స్‌లోని అన్ని జాతీయ పత్రికల్లో హంతకుడి ఫొటో మొదటి పేజీల్లో ప్రచురితమైంది.
పాత కక్షలతోనే..!
దేశవ్యాప్తంగా ఈ ఫొటో తీవ్ర సంచలనం సృష్టించింది. చనిపోయింది రాజకీయ నాయకుడు కావడంతో పోలీసులు కేసును సవాలుగా తీసుకున్నారు. నిందితుడు పాత నేరస్తుడు, అతని పేరు మైఖేల్ గొంజేలిస్‌గా గుర్తించారు. ఏడాదిక్రితం ఓ కారు దొంగతనం కేసులో మైఖేల్‌ను పోలీసులకు పట్టించాడు డగ్సా. అప్పటి నుంచి అతడిపై హంతకుడు కక్ష పెంచుకున్నాడు. బెయిల్‌పై విడుదలై పథకం ప్రకారం డగ్సాను వెంబడించి మరీ కాల్చి చంపాడు. దురదృష్టవశాత్తూ డగ్సా మరణించినప్పటికీ.. పోతూ పోతూ తనను హత్యచేసిన వ్యక్తిని కూడా పట్టించాడు.