న్యూయార్క్ : ప్రఖ్యాత చిత్రకారుడు ప్లాబో పికాసో వేసిన చిత్రాలకు ఉన్న డిమాండ్ ఓ స్ధాయిలో ఉంటుంది. పికాసో వేసిన చిత్రాలను వేలం వేసిన ప్రతిసారీ అవి ముందు చిత్రాల కంటే ఎక్కువ ధరే పలుకుతాయి. తాజాగా పెగ్గీ, డేవిడ్ రాక్‌ఫెల్లర్స్ కలెక్షన్ క్రిస్టీస్‌లో నిర్వహించిన వేలం పాటలో పికాసో చిత్రానికి రికార్డు స్ధాయిలో ధర పలికింది. పికాసో 1905లో గీసిన చిత్రం ‘ఫిల్లెట్ ఏ లా కార్బిల్లె ఫ్లూరియ’ అనే చిత్రం అత్యధికంగా 115 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. రాక్‌ఫెల్లర్స్ వేలంపాట చరిత్రలోనే ఒక చిత్రం ఇంత భారీ ధరకు అమ్ముడుపోవడం ఇదే తొలిసారి.రాక్‌ఫెల్లర్స్ కలెక్షన్ మంగళవారం నిర్వహించిన వేలం పాటలో పికాసో చిత్రం అత్యధిక ధర పలకగా తర్వాతి స్థానాల్లో 1914 - 1917 నాటి ‘ఎన్మ్పియాస్ ఎన్ ఫ్లూయర్’ చిత్రం అత్యధికంగా 84.6 మిలియన్ డాలర్లు, 1923నాటి మరో చిత్రం ‘ఒడాలిస్క్ సోచ్చు ఆక్స్ మగ్నోలియాస్’ 80.7 మిలియన్ డాలర్లు పలికింది.
‘స్టాండర్డ్ ఆయిల్’ వ్యవస్థాపకుడు జాన్ డీ. రాక్‌ఫెల్లర్ చివరి మనవడు డేవిడ్ రాక్ ఫెల్లర్. ఇతని భార్య పెగ్గి రాక్ ఫెల్లర్. వీరిరువురు ఏర్పాటు చేసిన ‘డేవిడ్ రాక్‌ఫెల్లర్ కలెక్షన్’లో కళలు, ఫర్నిచర్, అలంకరణ, లైటింగ్‌కు సంబంధించిన దాదాపు 1500 వస్తువులు ఉన్నాయి. వీటన్నింటి ప్రస్తుత మార్కెట్ విలువ 500మిలియన్ డాలర్లు. డేవిడ్ రాక్ ఫెల్లర్ 2017, మార్చిలో మరణించాడు. దాంతో ఆయన వారసులు రాక్‌ఫెల్లర్ మరణించి ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఈ విలువైన సంపదను వేలం వేసారు. వచ్చిన మొత్తాన్ని ముందుగా ఎన్నుకున్న సేవా సంస్థలకు అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment