picaso painting
-
ఆ నిజాన్నే ఆవిష్కరిస్తుంది ‘పికాసో’
ఇష్టంగా గీసుకున్న బొమ్మంత కుదురుగా.. మనసుపెట్టి రంగులు అద్దుకున్నంత కలర్ఫుల్గా జీవితం ఉంటే ఎంత బాగుంటుంది? విధి ఆలోచన మనిషి ఊహకు అందదు ఎప్పుడూ! అది ఏ మలుపు దగ్గర నిలబెడితే ఆ మలుపు నుంచి కొత్తగా ప్రయాణం మొదలుపెట్టడమే.. కొనసాగడమే!! ఊతంగా కళను పట్టుకోవడమే! ఎందుకంటే జీవితాన్ని ఆస్వాదించే ప్రక్రియను నేర్పేది కళే కాబట్టి! ఆ నిజాన్నే ఆవిష్కరిస్తుంది ‘పికాసో’ చిత్రం. పిల్లలు, పెద్దలు కలిసి చూడాల్సిన ఈ మరాఠీ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది.. సీన్లోకి... ‘నువ్వే కదా నాన్నా.. రంగుల్లో బ్రష్‌లు ముంచి బొమ్మలు గీయడం నేర్పించావ్? ఇప్పుడు ఆ కళే వద్దని కోప్పడ్తున్నావ్ ఎందుకు నాన్నా?’ ప్రశ్నిస్తాడు తండ్రిని పన్నెండేళ్ల గంధర్వ్ గవాడే (సమయ్ సంజీవ్ తాంబే). ‘నీ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు’ అంటాడు ఆ తండ్రి కొడుకు కళ్లల్లోకి చూడకుండానే. అతను.. పాండురంగ్ గవాడే (ప్రసాద్ ఓక్). ఒక కళాకారుడు. కుంచెతో, ఉలితో, పాటతో, అభినయంతో కళను ప్రదర్శిస్తుంటాడు. అన్నిట్లోనూ మేటి. బొమ్మలు వేయడమంటే ప్రాణం అతనికి. పెద్ద ఆర్టిస్ట్ అయిపోవాలని కలలు కన్నాడు. పెళ్లితో వచ్చిపడ్డ బాధ్యతలు కళోపాసనలో అతణ్ణి ముందుకు సాగనివ్వవు. తనకు తెలిసిన ఆ విద్యను ఉపాధిగా మలుచుకుంటాడు. అదీ కుటుంబ అవసరాలను తీర్చదు. గంధర్వ్ పుట్టాక.. వాడినైనా మంచి చిత్రకారుడిగా తీర్చిదిద్దాలనుకుంటాడు. అందుకూ తన ఆర్థికస్థితి సహకరించదు. అందుకే ఆ అసహనాన్ని, నిస్సహాయతను, కోపాన్ని మద్యం మీద మోజు పడటం ద్వారా తీర్చుకుంటాడు. నాటకం వేసేప్పుడు కూడా తాగే రంగస్థలం ఎక్కుతాడు. దాంతో ఆ అలవాటు అతని ఆద్భుతమైన వాచకం, గానం, నటనకు ఓ మచ్చలా మారిపోతుంది. ప్రేక్షకుల్లో కూడా అతనిపట్ల ఒక రకమైన ఏవగింపు కలుగుతుంది. నాటక సంస్థ యజమానికీ పాండురంగ్ చులకనై పోతాడు. పైగా ఇంటి ఖర్చుల కోసం అతను చేసిన, చేస్తున్న అప్పులూ ఆ చులకన భావాన్ని పెంచి పోషిస్తుంటాయి. తోటి కళాకారులకూ అతని పట్ల గౌరవం పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే.. పక్క ఊళ్లో నాటకం వేయడానికి వెళ్తాడు పాండురంగ్. ఆ సమయంలోనే కొడుకు తండ్రిని ఆ ప్రశ్న అడుగుతాడు. గంధర్వ్‌కు అలా అడగాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఏడవ తరగతి విద్యార్థి గంధర్వ్. వాళ్ల నాన్న చిత్రకళకు వారసుడు. పికాసో చిత్రకళ స్కాలర్షిప్ పోటీల్లో మహారాష్ట్ర స్టేట్ ఫస్ట్‌గా గోల్డ్ మెడల్ గెలుచుకుంటాడు. జాతీయ స్థాయి పోటీలో కూడా పాల్గొని గెలుపొందితే స్పెయిన్ లో ఏడాది పాటు చిత్రకళలో శిక్షణపొందే అవకాశం దొరుకుతుంది. ఆ సమాచారం గంధర్వ్‌కు ఆలస్యంగా చేరుతుంది పోస్ట్‌లో. దరఖాస్తు చేసుకోవడానికి తెల్లవారే ఆఖరు తేదీ. దరఖాస్తు ఫారానికి పదిహేను వందల రూపాయల రుసుమూ చెల్లించాల్సి ఉంటుంది. అదే గంధర్వ్ కు అసలు పరీక్ష. గోల్డ్‌మెడల్ పట్టుకొని సంతోషంగా ఇంటికి వెళ్తాడు. అనారోగ్యంతో ఉన్న తల్లికి చెప్తాడు విషయాన్ని. సంతోషంగా కొడుకును హత్తుకుంటుంది. కాని పదిహేనువందల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తుంది? తెల్లవారి తన వైద్యపరీక్షకు డబ్బుకోసమే నానా ఇబ్బందులూ పడ్తుంటే ఇప్పుడు కొడుకు క్వాయిష్‌ను ఎలా తీర్చడం? ఆమె ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడే ‘నాన్న ఎక్కడ?’ అని అడుగుతాడు గంధర్వ్. పక్క ఊర్లో నాటకం వేయడానికి వెళ్లాడని చెప్తుంది తల్లి. అంతే! ఉన్న ఫళంగా ఆ ఊరికి బయలుదేరుతాడు గంధర్వ్. మేకప్ వేసుకుంటున్న తండ్రి దగ్గరకు వెళ్లి తన గోల్డ్ మెడల్ చూపించి.. తర్వాత రాబోయే అవకాశం గురించీ చెప్తాడు. కొడుకు విజయానికి గర్వించినా.. పదిహేను వందల రూపాయలు పెట్టి పంపించలేని తన అసహాయతను ‘చిత్రకళనే మర్చిపో’ అనే మందలింపుతో బయటపెడ్తాడు. కొడుకు కళ్లల్లోని బాధ ఆ తండ్రిని నిలువనివ్వదు. ఆ వేదననంతా ఆ నాటకంలోని తన పాత్ర అభినయం మీద పెడ్తాడు. ఆ క్షణం దాకా లోపించిన తన ఏకాగ్రతను చిక్కబట్టుకుంటాడు. మొత్తం నాటకాన్నే రక్తి కట్టిస్తాడు. ఆరోజుదాకా ఏవగించుకున్న ప్రేక్షకులు జయజయధ్వానాలతో పాండురంగ్‌ను ప్రశంసిస్తారు. డబ్బుల మాలలతో పాండురంగ్‌ను సత్కరిస్తారు. నాటక సంస్థ యజమానీ ఆ రోజు పారితోషికమే కాదు.. బక్షిష్ నూ ఇస్తాడు సంతోషంగా. ఆ రోజు తండ్రిలో కనిపించిన కళారాధనకు గంధర్వ్ కూడా మురిసిపోతాడు. పాండురంగ్‌కు ఆ రోజు భార్య వైద్యపరీక్షకే కాదు కొడుకు దరఖాస్తుకూ సరిపోయేంతగా డబ్బు వస్తుంది. కళారాధన జీవితాన్ని స్వస్థపరిచే ఒక ఔషధం.. కళ మీద నమ్మకం కలలను తీర్చే సాధనం.. అని చెప్తుందీ సినిమా. దీనికి దర్శకుడు అభిజీత్ మోహన్ వరంగ్. దశావతార్ జానపద నాటక కళ చిత్రకళను అంశంగా తీసుకున్న సినిమా మొత్తం సాగింది మహారాష్ట్ర దక్షిణ కొంకణ్ ప్రాంతానికి చెందిన ‘దశావతార్’ అనే జానపద నాటక కథ మీదే. ప్రపంచంలోనే మొదటి జానపద నాటక కళ ఇది. క్రీ.శ. పన్నెండో శతాబ్దంలో దక్షిణ కొంకణ్, వలవల్ పట్టణంలోని లక్ష్మీనారాయణ ఆలయ ప్రాంగణమే వేదికగా ప్రారంభమై.. నేటికీ మనుగడలో ఉంది. రాజుల ఆదరణ, పోషణతో కాకుండా ప్రజాదరణ, పోషణతో. నేటికీ దాదాపు 3 లక్షల 50 వేల మంది కళాకారులకు ఇదే జీవనాధారం. ఈ సినిమాలోని నాటక దృశ్యాలనూ ఆ ఆలయ ప్రాంగణంలోనే చిత్రీకరించారు. -
గిరిధర్‌గౌడ్ కుంచెకు సన్మానం!
‘ప్యారిస్ ఆఫ్ ఆంధ్రా’ తెనాలికి సమీపంలో, సుక్షేత్రం సంగం జాగర్లమూడికి పది అంగల దూరంలో ఉంటుంది గరువుపాలెం. రాయన గిరిధర్ గౌడ్ అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే ఉంటున్నారు. తండ్రి తెలుగు ఉపాధ్యాయులు. బోర్డుమీద బొమ్మలు గీస్తూ, ఆసక్తికరంగా పాఠాలు చెప్పడం ఆయనకు ఇష్టం. అలా పరంపరగా గిరిధర్‌కి రేఖలు అంటుకున్నాయ్. తర్వాత అవి నిగ్గుతేలాయి. పది పదకొండేళ్ల వయసులో జాగర్లమూడిలో డ్రాయింగ్ మాస్టారు దీవి సుబ్బరాయశాస్త్రి కొంత శిక్షణ, మరింత ప్రోత్సాహం ఇచ్చారు. ఇంటర్మీడియట్ కాగానే మైసూరు చామరాజేంద్ర అకాడమీ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ కళాశాలలో స్వయంప్రతిభతో సీటు సంపాయించుకున్నారు. ఇక్కడ పట్టా తీసుకున్నాక రెండేళ్లు బెంగళూరులో ఉన్నారు. జానపద అకాడమీ వారి కోసం పలు మీనియేచర్స్ రచించి ఇచ్చే సదవకాశం వచ్చింది. లఘుచిత్ర క్షేత్రంలో పలువురు పెద్దలవద్ద మెలకువలు నేర్చుకున్నారు. చిత్రకారునిగా నిలదొక్కుకుంటున్న తరుణంలో, భుజంమీద వాత్సల్యాభిమానాలతో చేయివేసి కొండంత భరోసా ఇచ్చిన పోలీస్ ఉన్నతాధికారి కె. సదాశివరావుకి వినమ్రంగా శిరసు వంచుతాడు. తర్వాత మజిలీలో సద్విమర్శలతో ఆదరించిన కాండ్రేగుల నాగేశ్వరరా వుని అనుక్షణం గుర్తు చేసుకుంటారు. ప్రపంచ చిత్రకళకు హద్దులు చెరిపేసిన పికాసో ఎన్నో వినూత్న పంథాలకు దారులు వేశాడు. ఆయన దక్షిణ ఫ్రాన్స్‌లో మధ్యధరా సముద్ర తీరాన ఉన్న ఒక విశాల సౌధంలో ఉండేవాడు. అదొక చిన్న గ్రామం. అది పికాసో గ్రామం. అక్కడి చేతివృత్తుల వారితో పికాసో చెలిమి. వడ్రంగులు, కుంభకారులు, బెస్తవారు, నేతపని వారు, రైతులు, వీధి కళాకారులు వీరితో మాత్రమే కలిసేవాడు. వారితో ఆడేవాడు, పాడేవాడు, తాగి తందనాలాడేవాడు. పికాసోని వేరొకరికి కలవడం, మాట్లాడ్డం అయ్యేపని కాదు. ప్రముఖ పాత్రికేయులు, నాటి ఇలస్ట్రేటెడ్ వీక్లీ సంపాదకులు ఎ.ఎస్. రామన్ తను ఎంత శ్రమతో పికాసో దర్శనం చేసిందీ తన జ్ఞాపకాల్లో రాశారు. చివరకు జీన్ అనే ఒక వృద్ధుని ద్వారా సాధ్యపడిం దని చెప్పారు. గరువు పాలేన్ని గిరిధర్ గౌడ్‌ని కలిపి చూసినపుడు నాకీ సంఘటన జ్ఞాపకం వచ్చింది. గిరిధర్లోంచి ఆ గ్రామాన్ని బయటకు లాగలేం. ఆయనని కూడా గ్రామం నించీ లాగలేం. అదే ఆయనకు శ్రీరామ రక్ష. గిరిధర్‌కి చిన్నతనంలోనే ప్రఖ్యాత కళా స్రష్ట, విమర్శకులు సంజీవ్ దేవ్‌తో పరిచయమైంది. సంజీవ్ దేవ్ తుమ్మపూడిలో నిలబడి, రంగురంగుల ఊలుదారంతో భూగోళాన్ని బెలూన్‌గా ఎగరేసిన అసాధారణ వ్యక్తి. గిరిధర్ గౌడ్ పూర్తిగా జానపద కళాకారుడు. తన నేత పనులు చేత పనులు తన నట్టింట కూచుని నెలల తరబడి చేసుకుంటాడు. నగరాలలో ఉండే సంతల్లో ప్రదర్శించి సొమ్ము చేసుకుంటాడు. మళ్లీ కొత్త ఆలోచనలతో గరువుపాలెం వస్తాడు. కలువలు నిండిన ఊర చెరువు, పంట కాలువలు, రెల్లు దుబ్బులకు వేలాడే గిజిగాడి గూళ్లు, అవిశె చెట్లకు అల్లుకున్న తమలపాకు తీగెలు, పచ్చపచ్చని అరటి, నిమ్మతోటలు బోలెడు ఐడియాలిస్తాయి. గిరిధర్ ప్రాచీనులు వాడిన రంగుల్ని కొత్తగా వాడతాడు. గుంటూరు అన్నమయ్య లైబ్రరీలో గిరిధర్ చిత్రించిన పోట్రెయిట్స్ పదిదాకా కనిపిస్తాయ్. గాంధీ, ఠాగోర్, ఆదిభట్ల నారాయణ దాసు ఇత్యాదులంతా కళ్లెదుట కనిపిస్తారు. ఆయన చిత్రించిన వృషభధారా వాహిక ఒక అద్భుతం. చాలా శాస్త్రీయంగా అధ్యయనం చేసి వేసిన ‘దశావతారం’ కన వేడుక. గిరిధర్‌కి చిత్ర శిల్పిగా కొన్ని లెక్కలున్నాయ్. వేసే బొమ్మపై పూర్తి అవగాహన లేకుండా రంగంలోకి దిగరు. చూసే కొందరికి ఇది చాదస్తం అన్పించవచ్చు. దాన్నాయన ఖాతరు చెయ్యరు. శ్రీనాథుడు తన రచనల్లో దేవుళ్లని మనుషుల్లోకి దింపేశాడని ప్రతీతి. గిరిధర్ ఒక సిరీస్‌లో అదే పని చేశాడు. పార్వతి కాళ్లమీద వేసుకుని గణపయ్యకి నీళ్లుపోస్తూ ఉంటుంది. ఎంత ముచ్చటైన ఆలోచన. గిరిధర్ కళారంగంలో చాలా విస్తృతంగా పరిశీలించాడు. పరిశోధించాడు. రూప లావణ్యాలలో ప్రత్యేకత ఉంది. రంగుల రంగరింపులో గిరిధర్ వేలిముద్ర కనిపిస్తుంది. చిత్ర కళారంగంలో ఉన్న శాఖలన్నింటిలో రాణకెక్కారు. ఇంకా వయసులో చిన్నవారు. గిరిధర్ గౌడ్‌లో ఉన్న కల్తీలేని నమ్రత ఆయనని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్తుంది. సందేహం లేదు. అప్పుడు అందరం మా గిరిధర్, మా తెనాలి, మా తెలుగు, మన భారతీయుడు అని కాలర్ ఎగరేసుకుంటాం. తథాస్తు! (జనవరి 4న గిరిధర్ గౌడ్ అజో,విభో అవార్డు అందుకుంటున్న సందర్భంగా) వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
పికాసో చిత్రం ఖరీదెంతంటే...!
న్యూయార్క్ : ప్రఖ్యాత చిత్రకారుడు ప్లాబో పికాసో వేసిన చిత్రాలకు ఉన్న డిమాండ్ ఓ స్ధాయిలో ఉంటుంది. పికాసో వేసిన చిత్రాలను వేలం వేసిన ప్రతిసారీ అవి ముందు చిత్రాల కంటే ఎక్కువ ధరే పలుకుతాయి. తాజాగా పెగ్గీ, డేవిడ్ రాక్ఫెల్లర్స్ కలెక్షన్ క్రిస్టీస్‌లో నిర్వహించిన వేలం పాటలో పికాసో చిత్రానికి రికార్డు స్ధాయిలో ధర పలికింది. పికాసో 1905లో గీసిన చిత్రం ‘ఫిల్లెట్ ఏ లా కార్బిల్లె ఫ్లూరియ’ అనే చిత్రం అత్యధికంగా 115 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. రాక్ఫెల్లర్స్ వేలంపాట చరిత్రలోనే ఒక చిత్రం ఇంత భారీ ధరకు అమ్ముడుపోవడం ఇదే తొలిసారి.రాక్ఫెల్లర్స్ కలెక్షన్ మంగళవారం నిర్వహించిన వేలం పాటలో పికాసో చిత్రం అత్యధిక ధర పలకగా తర్వాతి స్థానాల్లో 1914 - 1917 నాటి ‘ఎన్మ్పియాస్ ఎన్ ఫ్లూయర్’ చిత్రం అత్యధికంగా 84.6 మిలియన్ డాలర్లు, 1923నాటి మరో చిత్రం ‘ఒడాలిస్క్ సోచ్చు ఆక్స్ మగ్నోలియాస్’ 80.7 మిలియన్ డాలర్లు పలికింది. ‘స్టాండర్డ్ ఆయిల్’ వ్యవస్థాపకుడు జాన్ డీ. రాక్ఫెల్లర్ చివరి మనవడు డేవిడ్ రాక్ ఫెల్లర్. ఇతని భార్య పెగ్గి రాక్ ఫెల్లర్. వీరిరువురు ఏర్పాటు చేసిన ‘డేవిడ్ రాక్ఫెల్లర్ కలెక్షన్’లో కళలు, ఫర్నిచర్, అలంకరణ, లైటింగ్‌కు సంబంధించిన దాదాపు 1500 వస్తువులు ఉన్నాయి. వీటన్నింటి ప్రస్తుత మార్కెట్ విలువ 500మిలియన్ డాలర్లు. డేవిడ్ రాక్ ఫెల్లర్ 2017, మార్చిలో మరణించాడు. దాంతో ఆయన వారసులు రాక్ఫెల్లర్ మరణించి ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఈ విలువైన సంపదను వేలం వేసారు. వచ్చిన మొత్తాన్ని ముందుగా ఎన్నుకున్న సేవా సంస్థలకు అందజేయనున్నారు. -
పికాసో చిత్రానికి రూ. 1,154 కోట్లు
-
పికాసో చిత్రానికి రూ. 1,154 కోట్లు
న్యూయార్క్ :కళాఖండాల అమ్మకంలో ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. ప్రఖ్యాత స్పానిష్ చిత్రకారుడు పాబ్లో పికాసో వేసిన ‘ఉమెన్ ఆఫ్ అల్జీర్స్(వెర్షన్ ఓ)’ చిత్రం రూ. 1,154 కోట్ల(17.9 కోట్ల డాలర్ల) రికార్డు ధర పలికింది. వేలంలో ఒక కళాఖండానికి అత్యధిక ధర పలకడం ఇదే తొలిసారి. స్విట్జర్లాండ్ శిల్పి జియకోమెతి చేసిన ‘పాయింటింగ్ మేన్’ అనే శిల్పం రూ. 909 కోట్ల(14.12 కోట్ల డాలర్లు)కు అమ్ముడుబోయింది. ఒక శిల్పానికి రికార్డు ధర పలకడం ఇదే తొలిసారి. క్రిస్టీస్ సంస్థ సోమవారం న్యూయార్క్‌లో వేసిన వేలంలో ఇవి అమ్ముడుబోయాయి. వీటిని కొన్నవారి పేర్లు బయటికి వెల్లడించలేదు. వేలానికి ఉంచిన పలు కళాకతులు అమ్ముడుబోగా మొత్తం రూ. 4,500 కోట్లు వచ్చాయి. ఫ్రెంచి చిత్రకారుడు డెలక్రా వేసిన చిత్రం స్ఫూర్తితో పికాసో 1954-55 మధ్య ‘ఉమెన్ ఆఫ్ అల్జీర్స్’ పేరుతో 15 చిత్రాలు వేశారు. వీటిలో తాజాగా అమ్ముడైన చిత్రం ఒకటి. 2013లో రూ. 915 కోట్లు పలికిన బ్రిటన్ పెయింటర్ బేకన్ ‘త్రీ స్టడీస్ ఆఫ్ లూసియన్ ఫ్రాయిడ్’ చిత్రం రికార్డును ఇది బద్దలు కొట్టింది. జియకొమెతి శిల్పం గతంలో ఆయన పేరుతో ఉన్న రికార్డునే బద్దలు కొట్టడం విశేషం. 2013లో అతని ‘వాకింగ్ మేన్ 1’ శిల్పం రూ.610 కోట్లు పలికింది.