టైమ్స్ జాబితాలో రాజన్, ప్రియాంక
జాబితాలో 9 మంది భారతీయులు
న్యూయార్క్: టైమ్స్ పత్రిక ‘ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలురు’ జాబితాలో 9 మంది భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, గూగుల్ సీఈవో సుందర్ పిచయ్, ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ బన్సల్, సచిన్ బన్సల్‌లు, పర్యావరణ వేత్త సునీత నరైన్, భారత సంతతి నటుడు అజీజ్ అన్సారీ, లాస్ట్ మైల్ హెల్త్ సంస్థ సీఈవో రాజ్ పంజాబీలు జాబితాలో ఉన్నారు. వార్షిక జాబితాను టైమ్స్ గురువారం విడుదల చేసింది.
ముందుచూపు ఉన్న భారత్ బ్యాంకర్‌గా రాజన్‌ను టైమ్స్ కొనియాడింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభంలోను భారత్‌ను సమర్ధంగా ముందుకు నడిపించారని, 2003-06 మధ్య ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్నప్పుడు ‘సబ్‌ప్రైం’ సంక్షోభాన్ని ముందుగానే ఊహించారని పేర్కొంది. జాబితాలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్ అధ్యక్షులు బరాక్ ఒబామా, పుతిన్, ఫ్రాంకోయిస్ హోలాండే, మయన్మార్ మంత్రి ఆంగ్‌సాన్ సూచీ, హిల్లరీ క్లింటన్, ఐఎంఎఫ్ అధినేత క్రిస్టీన్ లాగార్డేలున్నారు. పోటీ పడ్డ వారిలో ప్రధాని మోదీ ఉన్నా.. తుది జాబితాలో మాత్రం చోటు దక్కలేదు.