'అవి లేకుంటే అమెరికా తీసుకెళ్లలేం'
దోహా: ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులను అమెరికాలోకి అడుగుపెట్టనీయకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయానికి వ్యతిరేకంగా కొన్ని దేశాలు ప్రతిచర్యలకు ఉపక్రమిస్తుంటే ఖతార్ మాత్రం అందుకు భిన్నంగా చేసింది. ట్రంప్ నిర్ణయానికి అణువుగా ఇప్పటి వరకు అమెరికాకు వెళ్లడానికి ఉన్న నిబంధనలు మార్చి కొత్త నిబంధనలు బలవంతంగా తమ దేశ పౌరులకు ప్రవేశపెడుతోంది. దాదాపు అమెరికాలోని 15 నగరాలకు ఖతార్ నుంచి విమానాలు వెళుతుంటాయి. కేవలం ప్రయాణీకులను మాత్రమే ఇవి తీసుకెళుతుంటాయి.
అయితే, అమెరికాలోకి సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధంతోపాటు ఇస్లామిక్ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తూ ట్రంప్ శుక్రవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఖతార్ నుంచి అమెరికాకు వెళ్లే వారికి డాక్యుమెంటేషన్ ప్రక్రియ కఠినతరం చేసింది.
తాము సూచించినట్లుగా సరైన ధ్రువపత్రాలు సమర్పిస్తేనే అమెరికా తీసుకెళతామని, లేదంటే తామేం చేయలేమని ఖతార్ ఎయిర్‌వేస్ చెప్పింది. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రావెల్ అలర్ట్ అంటూ ప్రకటన చేయడమే కాకుండా ప్రయాణీకులు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుందో ప్రత్యేక జాబితాను తన అధికారిక సైట్‌లో పేర్కొంది. మరోపక్క, ఇస్లామిక్ దేశం ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తమ దేశంలోకి అమెరికన్ల రాకపై ప్రతిబంధకాలు విధిస్తూ ఆ దేశం ఆదేశాలు జారీ చేసింది.