ఫుకుషిమా అణు ప్లాంటు నుంచి మళ్లీ ముప్పు?
జపాన్‌లో ఇంతకుముందు సునామీ కారణంగా తీవ్రంగా దెబ్బతిని.. మళ్లీ పునరుద్ధరించిన ఫుకుషిమా లోని దైచీ అణు విద్యుత్ ప్లాంటు నుంచి మళ్లీ ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్లాంటులోని ఒక స్టోరేజి ట్యాంకు నుంచి దాదాపు 32 లీటర్ల రేడియో ధార్మిక జలం బయటకు లీకైంది. ఇది వర్షపు నీళ్లతో కలిసినా, ట్యాంకు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలావరకు విస్తరించినట్లు తెలుస్తోంది. ఈ ప్లాంటులో లీకేజిని సాంకేతిక నిపుణులు గుర్తించారు.
సిలిండర్ ఆకారంలో ఉండే స్టీలు ట్యాంకు నుంచి ఈ రేడియో ధార్మిక జలం బయటకు వచ్చింది. ట్యాంకు వెల్డింగులో తలెత్తిన లోపం వల్లే లీకైనట్లు తెలుస్తోంది. టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) సంస్థ ఈ ప్లాంటును నిర్వహిస్తోంది. ఒక్క లీటరు రేడియోధార్మిక జలంలో దాదాపు 5.90 లక్షల బెక్వెరెల్ ఉంటుందని టెప్కో అంచనా వేసింది. అయితే లీకైన రేడియోధార్మిక జలాలు కేవలం ట్యాంకు పరిసరాల్లోనే ఉన్నాయి తప్ప బయటకు వెళ్లలేదని అంటోంది. ట్యాంకులో మిగిలిన నీటిని తక్షణం అందులోంచి తీసేశారు. ఇలా సమస్యలున్న ట్యాంకులను మార్చేసి తదుపరి ప్రమాదాలను అరికట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ, వేలాది సంఖ్యలో అలాంటి ట్యాంకులు ఉండటంతో అందుకు చాలా సమయం పట్టేలా ఉంది. 2011 మార్చిలో వచ్చిన సునామీ కారణంగా పాడైన రియాక్టర్లను చల్లగా ఉంచేందుకు ట్యాంకుల లోపల కూలెంట్లు ఉంచుతున్నారు. ప్లంటులో ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే వందలాది టన్నుల రేడియోధార్మిక జలాలను జాగ్రత్త చేయడం అతిపెద్ద సవాలుగా మారింది.