Fukushima
-
అరుదైన పరిశోధన: సైంటిస్టులకు పాముల సాయం
అణు ప్రమాదాలు కలగజేసే నష్టం మామూలుగా ఉండదు. రేడియేషన్ ప్రభావం కొన్ని వందల ఏళ్లపాటు ఆ ప్రాంతాలను పట్టి పీడిస్తుంది కూడా. ఉక్రెయిన్‌లో చెర్నోబిల్, జపాన్ ఫుకుషిమా అణు రియాక్టర్ల ప్రమాదాలు.. ఎంతటి నష్టాన్ని మిగిల్చాయో కళ్లారా చూసి ఉన్నాం. అలాంటప్పుడు ఇంక అక్కడ మనుషులు అడుగుపెట్టేది ఎప్పుడు? ఇది కనిపెట్టేందుకే సైంటిస్టులు పాముల సాయం తీసుకోబోతున్నారు. ఫుకుషిమా సైంటిస్టులు ఈ అరుదైన పరిశోధనలకు సిద్ధపడినట్లు ‘ఇచ్‌థైయోలజీ అండ్ హెర్పెటోలజీ’ అనే జర్నల్ కథనం ప్రచురించింది. అలాగని పాముల్ని హింసించడం లాంటివి చేయరు. సింపుల్‌గా వాటిని బయోఇండికేటర్లుగా ఉపయోగించుకుంటారు. సాధారణంగా మట్టి, గాలి, నీటితో మమేకమై ఉండే వృక్ష, జీవ రాశులన్నింటినీ బయోఇండికేటర్లుగానే గుర్తిస్తారు. వీటి జీవన విధానాన్ని పరిశీలిస్తూ.. అక్కడి పరిస్థితులను అంచనా వేస్తుంటారు. ఉదాహరణకు.. చెట్ల మీద మొలిచే నాచు, గాల్లో ఉండే విషవాయువుల మోతాదును ఇది సూచిస్తుంది. ఎలాగంటారా?.. గాలి నుంచే నాచుకి ఎక్కువ శక్తి లభిస్తుంది కాబట్టి. ఒకవేళ గాల్లో గనుక విష వాయువుల ప్రభావం ఎక్కువగా ఉంటే.. నాచు రంగు మారుతూ నాశనమవుతుంటుంది. చదవండి: వంద గ్రాముల విషంతో.. వంద మంది ఖతం! ఇప్పటిదాకా మొక్కలను, చెట్లను మాత్రమే బయోఇండికేటర్లుగా ఉపయోగించిన సైంటిస్టులు.. ఫస్ట్ టైం పాములపై ఈ ప్రయోగం చేస్తున్నారు. పాములను ప్రత్యేకించి జెర్రి పోతు(గొడ్డు) పాములను ఈ ప్రయోగాలకు వాడుకోబోతున్నారు. ఎందుకంటే.. ఇవి ఎక్కువ దూరం ప్రయాణించవు. మట్టితో బాగా కనెక్ట్ అయ్యి ఉంటాయి. పైగా దగ్గర దగ్గరగా జీవిస్తుంటాయి. అందుకే వీటిని ఎంచుకున్నారు సైంటిస్టులు. ఇక ఈ పరిశోధనలో.. ఫుకుషిమా రేంజ్లో బతుకుతున్న సుమారు 1700 పాముల్ని నిరంతరం పర్యవేకక్షించబోతున్నారు. వాటిపై రేడియేషన్ ప్రభావం, ఫుకుషిమా ప్రాంతంలో వాటి జీవనవిధానం ఆధారంగా రేడియేషన్ లెవల్‌ను లెక్కగడతారు. ఎప్పుడైతే మట్టిలో రేడియేషన్ ప్రభావం తగ్గుతుందో.. అవి అప్పుడు యాక్టివ్‌గా సంచరిస్తుంటాయి. అలా రేడియేషన్ ప్రభావాన్ని లెక్కగట్టబోతున్నట్లు ప్రొఫెసర్ హన్నా గెర్కె వెల్లడించారు. ఇక వీటి ట్రాకింగ్ కోసం జీపీఎస్ వ్యవస్థను ఉపయోగించబోతున్నారు. -
టోక్యో ‘జ్యోతి’ బయల్దేరింది
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై ఆశలు రేపుతూ ‘టార్చ్ రిలే’ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. 2011లో భూకంపం, సునామీ, న్యూక్లియర్ విస్ఫోటనాల ద్వారా తీవ్రంగా నష్టపోయిన ఫుకుషిమా వద్ద ఈ జ్యోతిని వెలిగించి పరుగు ప్రారంభించడం విశేషం. 2011 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యురాలైన అజుసా ఇవషిమిజు చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలైంది. జపాన్‌లోని 47 ప్రాంతాల మీదుగా ప్రయాణించే టార్చ్ 121 రోజుల తర్వాత క్రీడల ప్రారంభం రోజైన జులై 23కు టోక్యో చేరుకుంటుంది. ‘జపాన్ దేశవాసులకే కాకుండా ప్రపంచవ్యాప్త ప్రజలకు కూడా టోక్యో 2020 జ్యోతి కొత్త వెలుగులు పంచుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుత కష్టకాలంలో చీకటి తర్వాత వెలుతురు ఉంటుందనే సందేశంతో టార్చ్ పయనిస్తుంది’ అని నిర్వాహక కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమొటో వ్యాఖ్యానించారు. -
జపాన్‌లో భారీ భూకంపం
టోక్యో: జపాన్‌లో శనివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. తీరప్రాంతమైన ఫుకుషిమా, మియాగి పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైనట్లు తెలిపారు. జపాన్ సముద్రంలో 60 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఆ దేశ వాతావరణ ఏజన్సీ చెప్పింది. భారీ భూకంపమే అయినప్పటికీ సునామీ ఉండకపోవచ్చని స్పష్టం చేసింది. ఫుకుషిమాలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ప్రస్తుతానికి ఏం సమస్యా ఎదురు కాలేదని అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా ఎనిమిదిన్నర లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కో తెలిపింది. క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ప్రభుత్వం చెప్పింది. తక్షణ సాయం అందించేందుకు జపాన్ ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి సమాచారం సేకరిస్తున్నారు. పలు వార్తాల చానెళ్లలో భూకంపం కారణంగా పెచ్చులూడిన ఇళ్లు కనిపించాయి. -
జపాన్‌లో భూకంపం
-
ఫుకుషిమా అణు ప్లాంటు నుంచి మళ్లీ ముప్పు?
జపాన్‌లో ఇంతకుముందు సునామీ కారణంగా తీవ్రంగా దెబ్బతిని.. మళ్లీ పునరుద్ధరించిన ఫుకుషిమా లోని దైచీ అణు విద్యుత్ ప్లాంటు నుంచి మళ్లీ ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్లాంటులోని ఒక స్టోరేజి ట్యాంకు నుంచి దాదాపు 32 లీటర్ల రేడియో ధార్మిక జలం బయటకు లీకైంది. ఇది వర్షపు నీళ్లతో కలిసినా, ట్యాంకు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలావరకు విస్తరించినట్లు తెలుస్తోంది. ఈ ప్లాంటులో లీకేజిని సాంకేతిక నిపుణులు గుర్తించారు. సిలిండర్ ఆకారంలో ఉండే స్టీలు ట్యాంకు నుంచి ఈ రేడియో ధార్మిక జలం బయటకు వచ్చింది. ట్యాంకు వెల్డింగులో తలెత్తిన లోపం వల్లే లీకైనట్లు తెలుస్తోంది. టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) సంస్థ ఈ ప్లాంటును నిర్వహిస్తోంది. ఒక్క లీటరు రేడియోధార్మిక జలంలో దాదాపు 5.90 లక్షల బెక్వెరెల్ ఉంటుందని టెప్కో అంచనా వేసింది. అయితే లీకైన రేడియోధార్మిక జలాలు కేవలం ట్యాంకు పరిసరాల్లోనే ఉన్నాయి తప్ప బయటకు వెళ్లలేదని అంటోంది. ట్యాంకులో మిగిలిన నీటిని తక్షణం అందులోంచి తీసేశారు. ఇలా సమస్యలున్న ట్యాంకులను మార్చేసి తదుపరి ప్రమాదాలను అరికట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ, వేలాది సంఖ్యలో అలాంటి ట్యాంకులు ఉండటంతో అందుకు చాలా సమయం పట్టేలా ఉంది. 2011 మార్చిలో వచ్చిన సునామీ కారణంగా పాడైన రియాక్టర్లను చల్లగా ఉంచేందుకు ట్యాంకుల లోపల కూలెంట్లు ఉంచుతున్నారు. ప్లంటులో ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే వందలాది టన్నుల రేడియోధార్మిక జలాలను జాగ్రత్త చేయడం అతిపెద్ద సవాలుగా మారింది. -
జపాన్‌లో పెను భూకంపం.. సునామీ హెచ్చరిక
జపాన్ ఉత్తరతీరాన్ని బలమైన భూకంపం వణికించింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. 2011లో పెను భూకంపం, సునామీ వచ్చి అణు విద్యుత్ ప్లాంటు విధ్వంసం జరిగిన ఫుకుషిమా ప్రాంతంలోనే మరోసారి ఈ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు మీద దీని తీవ్రత 6.8గా నమోదైంది. శనివారం తెల్లవారుజామున టోక్యోకు ఈశాన్యప్రాంతంలో ఉన్న ఫుకుషిమా తీరంలో సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం వచ్చినట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలో భూకంపం కారణంగా జపాన్ ఉత్తర తీరం మొత్తానికి సునామీ హెచ్చరికలు జారీచేశారు. ఫుకుషిమాలోని దై-చి అణు విద్యుత్ ప్లాంటుకు కూడా ఏమైనా ప్రమాదం వాటిల్లిందేమోనని నిపుణులు పరిశీలిస్తున్నారు. 2011లో సంభవించిన భూకంపం కారణంగా జపాన్‌లో 19వేల మంది మరణించారు. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంటు కూడా చాలావరకు కరిగిపోయింది. దీనికారణంగా వెలువడిన రేడియేషన్ ప్రభావం ఇప్పటికీ దాదాపు లక్షమంది ప్రజలపై ఉంది. -
జపాన్, చైనాలల్లో భూకంపం
జపాన్‌లోని పుకోషిమాలో ఈ రోజు తెల్లవారుజామున 2.25 గంటలకు భూకంపం సంభవించిందని స్థానిక మీడియా శుక్రవారం ఇక్కడ వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 5.8గా నమోదు అయిందని తెలిపింది. అయితే ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించలేదని పేర్కొంది. అయితే 2011లో పుకోషిమాలోని తీవ్ర భూకంపం సంభవించింది. ఆ ఘటనలో వేలాది మంది మరణించారు. అలాగే అనేక వేల మంది జాడ తెలియరాలేదన్న విషయాన్ని ఆ మీడియా సంస్థ ఈ సందర్బంగా గుర్తు చేసింది. అలాగే చైనాలో ఈ రోజు తెల్లవారుజామున 5.37 గంటలకు భూకంపం సంభవించిందని ఆ దేశ భూకంప కేంద్రం శుక్రవారం బీజింగ్‌లో తెలిపింది. రిక్టార్ స్కేల్‌పై 5.1గా నమోదు అయినట్లు వెల్లడించింది. సుసాన్ కైంటీ, గన్స్ ప్రావెన్స్, మెన్యన్ కౌంటీ, క్వింగ్హై ప్రావెన్స్లోలలో ఆ భూమి కంపించిందని వివరించింది. -
ఫుకుషిమా ప్రాంతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
జపాన్‌లోని ఫుకుషిమా ప్రాంతంలో మళ్లీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. అయితే, సునామీ హెచ్చరికలు మాత్రం జారీకాలేదు. భూకంప కేంద్రం భూమికి 22 కిలోమీటర్ల లోతున ఉంది. పసిఫిక్ సముద్రానికి దగ్గరగా ఉండే ఇవాకీ నగరానికి 20 కిలోమీటర్ల పశ్చిమదిశలో ఇది వచ్చింది. ఫుకుషిమాలో గతంలో ధ్వంసమైన దైచి అణు విద్యుత్ ప్లాంటుకు ఇది కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది!! 2011 మార్చిలో వచ్చిన భారీ భూకంపం, సునామీతో దైచి అణు కేంద్రం ధ్వంసమైన విషయం తెలిసిందే. తాజా భూకంప తీవ్రత 5.8 అని జపాన్ వాతావరణశాఖ తెలిపింది. దీనివల్ల రాజధాని టోక్యోలో ఉన్న భవనాలు కూడా కంపించాయి. జపాన్ ప్రధాని షింజో అబె ఫుకుషిమాలో పర్యటించి వెళ్లిన కొద్ది సేపటికే భూకంపం రావడం గమనార్హం.