రెయిన్ బో ఇలా కూడానా!
సాధారణంగా ఇంద్రధనుస్సు ఎలా కనిపిస్తుంది? విల్లు ఆకారంలో కనిపిస్తుంది. అందుకే దీనిని హరివిల్లు అని కూడా అంటాం. కానీ, అమెరికాలో మండుతున్నట్లుగా కనిపించి అక్కడి ప్రజల్ని మురిపించింది. అత్యంత అరుదుగా సంభవించే ఈ ఘటన మంగళవారం న్యూజెర్సీలో సముద్రతీరంలో దర్శనమిచ్చింది. ఒకసారి మండుతున్న మంటలా.. ఇంకోసారి ఆకాశం నుంచి రాలుతున్న తోకచుక్కలా.. మరోసారి ఒకదాని ఒకటి ఆనుకుని ఉన్న పర్వాతాల్లా కనిపించి చూపరులను సంభ్రమాశ్చార్యాలకు గురిచేసింది.
వాతావరణంలో మార్పులు, మేఘాలు అడ్డుతగలడం వల్ల ఇలాంటివి అప్పుడప్పుడు సంభవిస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. మంగళవారం మేఘాలు చాలా ఎత్తులో ఉన్నాయని, అదే సమయంలో సూర్యుని నుంచి కిరణాలు ఒకే కోణంలో మేఘాల్లో ఘనీభవించిన నీటిని తాకడం వల్ల హరివిల్లు ఇలా ఏర్పడినట్లు వివరించారు. దాదాపు 15,000 అడుగుల ఎత్తులో హరివిల్లు ఏర్పడినట్లు చెప్పారు. కాగా, ఆర్లాండో నరమేధానికి నివాళిగా ఈ రెయిన్ బో ఏర్పడినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.