ఒంటరిగా ఉండటమంటే బోర్ కదా.. అలాంటిది అమెజాన్ అడవుల్లో23 ఏళ్లుగా ఓ వ్యక్తి ఒంటరిగా ఉంటున్నాడు.. నాగరిక ప్రపంచంతో సంబంధం లేకుండా.. ఈ మధ్యేబ్రెజిల్‌లోని రొండేనియా ప్రాంతంలో చెట్లు కొడుతూ వీడియోకుచిక్కడంతో అతడి గురించిమీడియాలో మార్మోగిపోయింది కూడా.. అంతరించిపోయిన ఆదిమ తెగకు చెందిన చివరి వ్యక్తి అంటూ అతడి ఫొటోలు హల్‌చల్ చేశాయి. ఇంతకీ అతడు ఎవడు? ఎందుకు ఒంటరి అయ్యాడు? 23 ఏళ్లుగా అమెజాన్ అడవిలో ఏం చేస్తున్నాడు? తెలియాలంటే అమెజాన్ అడవులకు చలో చలో..
తొలిసారి చూసిందెప్పుడు..
1970–80ల్లో అమెజాన్ అడవుల్లో రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో భూఆక్రమణదారులు, రైతులు, కలప అక్రమ రవాణాదారులు, పశువుల పెంపకందారుల కన్ను అటవీ భూములపై పడ్డాయి. దీంతో అక్కడ నివసిస్తున్న పలు ఆదిమ తెగలవారిని వీరు దారుణంగా చంపేశారు. ఇలాంటివాటిని నిరోధించి.. ఆదిమ తెగల వారిని, వారి హక్కులను పరిరక్షించేందుకు బ్రెజిల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఫునాయ్. ఫునాయ్ వాళ్ల లెక్క ప్రకారం.. బ్రెజిల్ పరిధిలో ఉన్న అమెజాన్ అడవుల్లో 113 అరుదైన ఆదిమ తెగలకు చెందిన వాళ్లు జీవిస్తున్నారు. ఇప్పటివరకూ గుర్తించగలిగింది 27 జాతులనే. అలాంటి టైములో 1996లో ఫునాయ్ పరిశోధకులకు కనిపించాడు ఆ ఒకే ఒక్కడు.
మిగతావాళ్లు ఏమయ్యారు..
ఇతడి తెగ చాలా చిన్నదట. కేవలం ఆరుగురే ఉండేవారు. 1995లో భూఆక్రమణదారులు చేసిన దాడిలో తెగలోని మిగిలిన ఐదుగురు చనిపోయారు. అప్పట్నుంచి ఇతడు ఒంటరి. ఈ నేపథ్యంలో ఆ తెగలో మిగిలిన చివరి వ్యక్తిని సంరక్షించడానికి ఫునాయ్ చర్యలు చేపట్టింది. 8070 హెక్టార్ల ప్రాంతాన్ని ఇతడి కోసం రిజర్వు చేసింది. అందులోకి ప్రవేశించడం నిషిద్ధం. వేటాడటానికి వీలుగా ఈ సంస్థ వాళ్లే గొడ్డలి వంటివాటిని అతడికి కనిపించేలా అడవిలో అక్కడక్కడా పడేశారట. అప్పుడప్పుడు ఎలాగున్నాడన్న విషయాన్ని దూరంగా ఉంటూ గమనిస్తూ వస్తున్నారు.
ఆదిమ తెగలకు చెందినవారిని పరిరక్షించడమే తప్ప.. వారితో మాట్లాడటం.. వారి వ్యక్తిగత జీవనానికి భంగం కలిగే చర్యలకు పాల్పడటం వంటివి ‘ఫునాయ్’ నిబంధనలకు వ్యతిరేకం. అందుకే.. ఇతడి పేరుగానీ.. తెగ పేరుగానీ ఎవరికీ తెలియదు.
ఇన్నాళ్లూ ఏం చేశాడు..
చెట్ల కొమ్మలతో తయారుచేసుకున్న ఓ గుడిసెలో ఉంటున్న ఇతడి దినచర్య చెట్లను కొట్టడం.. ఆహారం కోసం వేట సాగించడం.. జంతువులను ట్రాప్ చేయ డానికి గుడిసె దగ్గర, లోపల కందకాలులాంటివి తవ్వాడు. తన రక్షణ కోసం దాక్కోవడానికి వీలుగా వీటిలో ఏర్పాట్లు చేసుకున్నాడు. చిన్నపాటి ఆయుధాలూ ఉన్నాయి. అంతేనా.. బొప్పాయి మొక్క లను నాటాడు.. మొక్కజొన్న పంట వేశాడు. చిన్నపాటి గోచి కట్టుకుని ఉండే ఇతడి వయసు ప్రస్తుతం 50 ఏళ్లకు పైనే అని చెబుతున్నారు. 1998లో ఇతడికి సం బంధించి ఓ డాక్యుమెంటరీని చిత్రీకరించారు. వివిధ ఆదిమ తెగలపై తీసిన ఆ డాక్యుమెంటరీలో భాగంగా.. స్థానిక గిరిజన తెగ యువకుడితో కలిసి పరిశోధకులు ఇతడి గుడిసె వద్దకు వెళ్లారు. అయితే.. వాళ్లను చూడగానే.. పదునైన బాణంలాంటిదాన్ని ఎక్కుపెట్టాడు. దాంతో వారు అతడిని కలవకుండా.. వీడియో తీసుకుని వెళ్లిపోయారు. అందులో అతడి ముఖం కూడా కనిపించడం విశేషం. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇతడు చెట్లు కొడుతూ వీడియోకు చిక్కాడు. అదీ పూర్తి ఆరోగ్యంగా కనిపించాడు. భూఆక్రమణదారులు, మైనింగ్ వ్యాపారుల నుంచి ప్రాణ హానీ ఉన్నప్పటికీ.. ఇన్నాళ్లపాటు నాగరిక ప్రపంచానికి దూరంగా ఇతడు బతికి ఉండటం గొప్ప విషయమని ‘సర్వైవల్ ఇంటర్నేషనల్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. తన పరిరక్షణ కోసం ఫునాయ్ రిజర్వు చేసిన అటవీ ప్రాంతం చుట్టూ భారీ పశువుల పెంపకం కేంద్రాలు ఉన్నాయని.. వాటి యజమానుల నుంచి అతడికి ఇప్పటికీ ముప్పు పొంచి ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు.
ఇన్నేళ్లు నెట్టుకొచ్చేశాడు.. మరికొన్నేళ్లునెట్టుకురాలేడా.. మనోడి ఫిట్‌నెస్ చూస్తుంటే.. నెట్టుకొచ్చేసేటట్లే ఉన్నాడు.బాబూ.. నీ పేరేంటో తెలియదు గానీ..శతమానం భవతి..– సాక్షి సెంట్రల్ డెస్క్..
Comments
Please login to add a commentAdd a comment