గూగుల్ క్రోమ్ లాంచర్ ఇక ఉండదు!
గూగుల్ క్రోమ్ లాంచర్ ఇక కనిపించకుండా పోనుంది. క్రోమ్ యాప్ లను బ్రౌజర్ లోకి వెళ్లకుండానే సులభంగా ఓపెన్ చేసేందుకు డెస్క్ టాప్, స్మార్ట్ ఫోన్ స్క్రీన్లపై కనిపించే గూగుల్ క్రోమ్ లాంచర్‌ను తొలగించనున్నట్లు గూగుల్ సంస్థ తాజాగా వెల్లడించింది. క్రోమ్ లాంచర్ నుంచి విండోస్, మ్యాక్, లైనెక్స్ యాప్‌ల వినియోగదారులు సులభంగా ఆయా యాప్‌లను బ్రౌజ్ చేసేందుకు లాంచర్‌ను వినియోగించే వారు. అయితే ఇటీవల లాంచర్ కారణంగా ఫోన్లలో బ్యాటరీ డౌన్ అయిపోవడం, ఆపరేటింగ్ సిస్టమ్ స్లో అవ్వడం వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయంటూ గూగుల్ సంస్థకు ఫిర్యాదులు రావడంతో సమస్యపై సంస్థ దృష్టిసారించింది. లాంచర్‌ను జూలై నెలకల్లా తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది.
అయితే లాంచర్‌ను తొలగిస్తున్న గూగుల్ సంస్థ... క్రోమ్ ఓఎస్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని వెల్లడించింది. ఇప్పటికే లాంచర్ వాడుతున్న వినియోగదారులకు ఇకపై దాన్ని తొలగిస్తున్నట్లు సమాచారం వస్తుందని, తర్వాత కొన్నాళ్లకు లాంచర్ ఉండబోదని సంస్థ వెల్లడించింది. లాంచర్ లేకపోయినా క్రోమ్ యాప్‌లు బుక్ మార్క్స్ బార్ లోని యాప్ షార్ట్ కట్ ద్వారా గానీ, క్రోమ్ లో టైప్ చేసి గానీ ఓపెన్ చేయవచ్చని, లేదంటే హెల్ప్ సెంటర్ ను సంప్రదించాలని వినియోగదారులకు సంస్థ సూచించింది.