రక్తంతో బొమ్మలేయడమంటే ఇదే! | Rev Mayers is one of the world's only 'blood painters' with ink straight from his arm | Sakshi
Sakshi News home page

రక్తంతో బొమ్మలేయడమంటే ఇదే!

Published Thu, Mar 31 2016 4:34 PM | Last Updated on Wed, Apr 3 2019 4:22 PM

రక్తంతో బొమ్మలేయడమంటే ఇదే! - Sakshi

రక్తంతో బొమ్మలేయడమంటే ఇదే!

సిడ్నీ: ప్రేయసి పట్ల అమిత ప్రేమను వ్యక్తీకరించేందుకు ‘నా రక్తంతో వేశాను నీ చిత్రాన్ని’ అనే ప్రేమ పిచ్చోళ్లు మనకు అక్కడక్కడా కనిపించవచ్చు. ఆస్ట్రేలియాకు చెందిన రేవ్ మేయర్స్ అనే 39 ఏళ్ల టాటూ పెయింటర్‌కు అలాంటి ప్రేమ పిచ్చి లేదుగానీ రక్తంతో బొమ్మలేసే పిచ్చి మాత్రం బోలెడంతా ఉంది. ఇప్పటికే వందలకొద్ది బొమ్మలు రక్తంతో వేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయించారు. నేరుగా చేతి నరం ద్వారా రక్తాన్ని క్యాన్వాస్‌పైకి చిమ్మేందుకు నరానికి ఎయిర్ బ్రష్‌ను కూడా ఇంజెక్టు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఎప్పుడుపడితే అప్పుడు బొమ్మలు వేసేందుకు వీలుగా ఆయన ఫ్రిజ్ నిండా రక్తం నింపిన బాటిళ్లు ఎప్పుడూ ఉంటాయి. శరీరం నుంచి చిక్కని ఎర్రని రక్తం వచ్చేందుకు వీలుగా అందుకు అవసరమైన ఆహారాన్ని తీసుకుంటారు. ఎక్కువ సార్లు పచ్చి రెడ్ మీట్‌నే తింటారు. ఎందుకు రక్తంతో బొమ్మలు వేస్తావని అడిగితే అదో క్రేజీ, రాక్‌స్టార్ స్టైల్ అంటారు. ప్రజలను కాస్త వణికించేందుకు కూడా రక్తంతో బొమ్మలు వేస్తుంటానని చెప్పారు. దీనిపై ప్రతికూల విమర్శలు రాలేదా? అని ప్రశ్నిస్తే పదివేల మందిలో ఒక్కరంటే ఒక్కరే నెగెటివ్‌గా రియాక్ట్ అవుతారని అన్నారు.

గత 11 ఏళ్ల నుంచి తాను తన రక్తంతో బొమ్మలు వేస్తున్నానని, ఇప్పుడు అది అలవాటుగా మారిపోయిందని మేయర్స్ తెలిపారు. శరీరం నుంచి రక్తం తీయడానికి నర్సు సేవలను ఉపయోగించుకుంటానని చెప్పారు. చేతి నరం నుంచి రక్తాన్ని నేరుగా క్యాన్వాస్‌పైకి చిందించేందుకు మాత్రం నర్సు సహాయం తప్పనిసరి అవుతుందని, ఆమె అప్పుడు పక్కనే ఉండాల్సిన అవసరం కూడా ఉందని ఆయన చెప్పారు.

ఎయిర్ బ్రెష్‌లోని ఎయిర్ రివర్స్‌లో నరంలోకి వెళితే ప్రాణాపాయం తప్పదని, అందుకని నర్సు సేవలు తప్పనిసరని వివరించారు. ప్రాణాలకు ముప్పు ఉండడంతో ఈ మధ్య ఇలాంటి రిస్క్ తీసుకోవడం లేదని అన్నారు. ఇలా నరం నుంచి రక్తాన్ని చిందించినప్పుడు హ్యాంగోవర్‌గా ఉంటుందని, తెల్లారి మాత్రం భరించలేని బాధ ఉంటుందని మేయర్స్ తెలిపారు. రక్తంతో వేసే తన చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉందని చెప్పారు. ప్రపంచంలో తన లాగా రక్తంతో పెయింటింగ్‌లు వేసే వారు కొద్ది మంది ఉన్నారని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement