భారత్లో అమెరికా రాయబారిగా వర్మ
వాషింగ్టన్: భారత్లో అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ (46) పేరు ఖరారైంది. మంగళవారం యూఎస్ సెనెట్ రాహుల్ వర్మ పేరును ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి భారతీయ అమెరికన్ రాయబారిగా రాహుల్ వర్మ ఖ్యాతి పొందారు. వర్మ ఈ పదవిని చేపట్టడం ద్వారా భారత్ - అమెరికా సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ నేపథ్యంలో అంతకంటే ముందే వర్మ ఈ పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఒబామా తన ప్రభుత్వం హయాంలో భారతీయ సంతతికి పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో భారత్లో రాయబారిగా వర్మ పేరును ప్రతిపాదించారు.
అమెరికా విదేశాంగశాఖతో సహా వివిధ విభాగాల్లో ఆయన కీలక పదవులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన హ్యూమన్ రైట్స్ ఫస్ట్, ది క్లింటన్ ఫౌండేషన్, నేషనల్ డెమాక్రాటిక్ ఇన్స్‌టిట్యూట్ బోర్డుల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంతకుముందు భారత దేశంలో అమెరికా రాయబారిగా నాన్సీ పావెల్ వ్యవహరించారు. ఆ సమయంలో నాన్సీపై పలు వివాదాలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. నాటి నుంచి భారత్లో అమెరికా రాయబారి పదవి ఖాళీగా ఉంది. మరోవైపు భారత్లో నరేంద్ర మోడీ ప్రధాని పదవిని చేపట్టారు. దీంతో భారత్తో సంబంధాలు మరింత బలోపేతానికి కృషి చేసేందుకు ఒబామా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అందులోభాగంగా వర్మను భారత్లో అమెరికా రాయబారిగా ఒబామా ఎంపిక చేసినట్లు సమాచారం.