Nancy Powell
-
భారత్‌లో అమెరికా రాయబారిగా వర్మ
వాషింగ్టన్: భారత్‌లో అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ (46) పేరు ఖరారైంది. మంగళవారం యూఎస్ సెనెట్ రాహుల్ వర్మ పేరును ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి భారతీయ అమెరికన్ రాయబారిగా రాహుల్ వర్మ ఖ్యాతి పొందారు. వర్మ ఈ పదవిని చేపట్టడం ద్వారా భారత్ - అమెరికా సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ నేపథ్యంలో అంతకంటే ముందే వర్మ ఈ పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఒబామా తన ప్రభుత్వం హయాంలో భారతీయ సంతతికి పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో భారత్‌లో రాయబారిగా వర్మ పేరును ప్రతిపాదించారు. అమెరికా విదేశాంగశాఖతో సహా వివిధ విభాగాల్లో ఆయన కీలక పదవులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన హ్యూమన్ రైట్స్ ఫస్ట్, ది క్లింటన్ ఫౌండేషన్, నేషనల్ డెమాక్రాటిక్ ఇన్స్టిట్యూట్ బోర్డుల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంతకుముందు భారత దేశంలో అమెరికా రాయబారిగా నాన్సీ పావెల్ వ్యవహరించారు. ఆ సమయంలో నాన్సీపై పలు వివాదాలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. నాటి నుంచి భారత్‌లో అమెరికా రాయబారి పదవి ఖాళీగా ఉంది. మరోవైపు భారత్‌లో నరేంద్ర మోడీ ప్రధాని పదవిని చేపట్టారు. దీంతో భారత్‌తో సంబంధాలు మరింత బలోపేతానికి కృషి చేసేందుకు ఒబామా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అందులోభాగంగా వర్మను భారత్‌లో అమెరికా రాయబారిగా ఒబామా ఎంపిక చేసినట్లు సమాచారం. -
భారత్‌లో అమెరికా రాయబారిగా రాహుల్ వర్మ!
భారతదేశంతో సత్సంబంధాలు ఉంటే మంచిదని భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. తన యంత్రాంగంలో పలువురు భారతీయ అమెరికన్లకు పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో అడుగు ముందుకేసి భారత సంతతికి చెందిన రిచర్డ్ రాహుల్ వర్మను భారతదేశంలో అమెరికా రాయబారిగా ప్రతిపాదించారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా హోంశాఖలో గతంలో సహాయ మంత్రి హోదాలో పనిచేసిన వర్మ.. ప్రస్తుతం స్టెప్టో అండ్ జాన్సన్ అనే న్యాయ సంస్థలో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. ఇంతకుముందు భారత దేశంలో అమెరికా రాయబారిగా వ్యవహరించి, తన పదవీకాలంలో పలు వివాదాలు మూటగట్టుకున్న నాన్సీ పావెల్ రాజీనామా చేసినప్పటినుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. జార్జిటౌన్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చేసిన రాహుల్ వర్మ.. జాతీయ భద్రతా చట్టం, అంతర్జాతీయ వ్యవహారాలు తదితర విషయాల్లో ప్రముఖ న్యాయవాదిగా పేరుపొందారు. ఇంతకుముందు ఆయన హిల్లరీ క్లింటన్‌తో కలిసి పనిచేశారు. గతంలో అమెరికా ఎగుమతి నియంత్రణలు, ఆర్థిక ఆంక్షలపై కూడా ఆయన కృషి చేశారు. కొంతకాలం పాటు అమెరికా వైమానిక దళంలో కూడా ఎయిర్ ఫోర్స్ జడ్జి అడ్వకేట్‌గా పనిచేశారు. -
అమెరికా రాయబారి నాన్సీ పావెల్ ఆకస్మికరాజీనామా
న్యూఢిల్లీ: భారత్‌లోని అమెరికా రాయబారి నాన్సీ పావెల్(67) సోమవారం ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఇక్కడి యూఎస్ మిషన్ టౌన్హాల్లో సహోద్యోగులకు ఆమె ఈ విషయం వెల్లడించారు. రాజీనామాను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు పంపానని, మే చివరికల్లా డెలావేర్‌లోని సొంతింటికి వెళ్లిపోయి విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. యూపీఏతో సత్సంబంధాలున్న పావెల్ ఇటీవల ప్రధాని పదవి రేసులో ముందున్న బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అనవసర వివాదాలకు తావివ్వకూడదనే ఒబామా ప్రభుత్వం ఆమెతో రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. కాగా, ఒబామా ప్రభుత్వంతో విభేదాల వల్లే ఆమె రాజీనామా చేశారన్న వార్తలను ఆమెరికా విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. పావెల్ 2012 ఏప్రిల్‌లో భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. అమెరికా రాయబారి ఒక పర్యాయ పదవీ కాలం సాధారణంగా రె ండేళ్లుగా ఉంటుంది. -
మోడీతో అమెరికా రాయబారి భేటీ
తొమ్మిదేళ్ల వీసా వివాదానికి తెరపడే అవకాశం గాంధీనగర్: వీసా వ్యవహారంలో గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి అమెరికాకు మధ్య దూరం తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా రాయబారి నాన్సీ పావెల్ గురువారం నరేంద్రమోడీతో సమావేశం కావడం దీనికి బలం చేకూరుస్తోంది. గాంధీనగర్‌లో వీరిద్దరి మధ్య గంట పాటు చర్చలు జరిగాయి. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలందరినీ నాన్సీ పావెల్ కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె మోడీతో భేటీ అయ్యారు. భారత్-అమెరికా సంబంధాలు, ప్రాంతీయ రక్షణ అంశాలు, మానవ హక్కులు, వాణిజ్యం, పెట్టుబడులు తదితరల అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు తమ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోందని నాన్సీ పావెల్ చెప్పారు. మోడీ ప్రధాని అయితే ఆయనతో కలసి పని చేసేందుకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదని ఆమె సంకేతాలిచ్చారు. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చాలా కీలకమని చెప్పారు. కాగా, ఈ భేటీపై మోడీ సన్నిహిత వర్గాలు స్పందిస్తూ.. గుజరాత్లో పరిపాలన తీరును పావెల్ ప్రశంసించారని, పెట్టుబడులు పెట్టేందుకు గుజరాత్లో అనుకూల వాతావరణం ఉందని ఆమె అభిప్రాయపడ్డారని చెప్పాయి. రెండు దశాబ్దాలుగా గుజరాత్ ఎంతో అభివృద్ధి సాధించిందని ఆమె ప్రసంశలు కురిపించారన్నాయి. 2002లో గుజరాత్ అల్లర్ల తర్వాత నరేంద్రమోడీకి అమెరికా వీసా నిరాకరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. 13 ఏళ్లలో గాంధీనగర్‌కు ఓ విదేశీ రాయబారి స్థాయి అధికారి మోడీని కలిసేందుకు రావడం ఇదే తొలిసారి. మోడీతో భేటీ తర్వాత పావెల్ గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు శంకర్‌సింగ్ వాఘేలాతో భేటీ అయ్యారు. కాగా, మోడీకి వీసా మంజూరులో తమ విధానంలో మార్పులేదని, తమ దేశ చట్టం ప్రకారమే ఎవరికైనా వీసా మంజూరు చేస్తామని అమెరికా చెప్పడం గమనార్హం. అయితే మోడీతో అమెరికా రాయబారి సమావేశాన్ని తక్కువ చేసి చూపేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. మోడీకి వీసా ఇచ్చినా.. ఇవ్వకపోయినా తమకు ఒరిగేదేమీ లేదని విదేశాంగ మంత్రి సల్మాన్‌ఖుర్షీద్ అన్నారు. మోడీ విషయంలో అమెరికా తన విధానాన్ని మార్చుకోదనే తాము భావిస్తున్నామని చెప్పారు. -
నరేంద్ర మోడీతో నాన్సీ పావెల్ భేటీ
పుష్కర కాలం పాటు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అంటేనే మండిపడుతూ వచ్చిన అమెరికా.. ఎట్టకేలకు వైఖరి మార్చుకుంది. భారతదేశంలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ గురువారం నాడు నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. 2002లో గోధ్రా అనంతర మత ఘర్షణలు జరిగినప్పటి నుంచి మోడీకి అమెరికా వీసా నిరాకరించిన విషయం తెలిసిందే. ఇన్నాళ్ల తర్వాత నాన్సీ పావెల్ వచ్చి, బీజేపీ ప్రధాని అభ్యర్థి అయిన మోడీని కలిసి చేతులు కలిపారు. ఈ సందర్భంగా మోడీ ఆమెకు ఎరుపు, పసుపు పచ్చ పూలతో కూడిన ఓ బొకేను అందించారు. మరికొందరు అధికారులతో కలిసి నాన్సీ పావెల్ సుదీర్ఘ సమయం పాటు మోడీతో సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించే అవకాశం ఉందని సర్వేలన్నీ చెబుతుండటంతో.. ముందుగానే మోడీతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం మంచిదని భావించే అమెరికా ఈ నర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు మళ్లీ మోడీకి వీసా ఇచ్చే అవకాశం మాత్రం కనిపించడంలేదు. తమ వీసా విధానంలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి జెన్ సాకీ వాషింగ్టన్లో వ్యాఖ్యానించారు. -
మోడీతో అమెరికా రాయబారి భేటీ
గాంధీనగర్: గుజరాత్ సీఎం నరేంద్ర మోడీతో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ సమావేశమయ్యారు. ఈ ఉదయం గాంధీనగర్‌లోని మోడీ నివాసానికి చేరుకుని ఆయనతో నాన్సీ పావెల్ భేటీ అయ్యారు. తొమ్మిదేళ్ల కిందట మోడీపై విధించిన నిషేధాన్ని అమెరికా ఎత్తివేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి అయిన మోడీ సారథ్యంలో ఎన్డీఏ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడించడంతో మోడీతో సంబంధాలు పునరుద్ధరించాలని అమెరికా భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే మోడీపై తమ వైఖరి మారలేదని అమెరికా నిన్న స్పష్టం చేసింది. 2002 నాటి గోధ్రా ఘటన అనంతరం చెలరేగిన అల్లర్లను కారణంగా చూపి 2005లో మోడీకి దౌత్య వీసా ఇచ్చేందుకు నిరాకరించడంతోపాటు టూరిస్ట్, బిజినెస్ వీసాలను అమెరికా ఉపసంహరించింది. -
పులకరించిన జనవాడ
సాక్షి, రంగారెడ్డి జిల్లా, శంకర్పల్లి: హాలీవుడ్ నటులు.. బాలీవుడ్ తారలు.. రాజకీయ ప్రముఖులు.. అమెరికా అత్యున్నత అధికారులు.. వీరంతా ఒకేసారి తరలిరావడంతో శంకర్పల్లి మండలంలోని జనవాడ గ్రామం పులకరించింది. గ్రామంలో వాటర్ హెల్త్ ఇంటర్నేషనల్(డబ్ల్యూహెచ్ఐ), జలధార సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ వాటర్ సిస్టంను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి ఆనంద్‌శర్మ, భారత్‌లోని అమెరికా రాయబారి నాన్సీ పావెల్, బాలీవుడ్ తారలు దియామిర్జా, జాకీష్రాష్, గుల్షన్‌గ్రోవర్, హాలీవుడ్ నటులు లీసా జోయ్నర్, ప్లేరైట్ గ్రెచెన్ క్రైయర్తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రముఖుల బృందం జనవాడకు చేరుకుంది. స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, స్థానిక సర్పంచ్ వసంతలక్ష్మి తదితరులు మంగళ వాయిద్యాలతో వారికి స్వాగతం పలికారు. వారి నుదుటున కుంకుమ తిలకం దిద్ది పూలమాలలతో సత్కరిం చారు. వారిని చూసేందుకు గ్రామంలోని ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. తారలకు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు పోటీపడ్డారు. కొందరు ఆటోగ్రాఫ్ కోసం మినీ పుస్తకాలతో వారిముందు వాలిపోయారు. ఫొటోలకు ఫోజు లిస్తూ గ్రామస్తులు వారితో మమేకమయ్యారు. తారలంతా స్థానికులతో మాటామాటా కలపడంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. కేరింతలు, చప్పట్లతో గ్రామం హోరెత్తింది. ఆసక్తిగా.. వాటర్ ప్లాంట్ సమీపంలో జరిగిన సభా ప్రాంగణంలో భారతీయ సంస్కృతి ప్రతిబింబిచేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ విదేశీ బృందాన్ని కట్టిపడేశాయి. కుండలు తయారుచేసే విధానాన్ని వారు ఆసక్తిగా చూశారు. గాజుల దుకాణంలో మట్టి గాజులు కొని ధరించారు. సభ ముగిసిన తర్వాత పాఠశాల విద్యార్థులతోనూ వారు కలివిడిగా మెలిగారు. బాగా చదువుకోవాలని హితవు పలికారు. -
సంబంధాలు దెబ్బతిన్నాయి
దేవయాని అరెస్ట్ వ్యవహారంపై అమెరికా రాయబారి వ్యాఖ్య ఆ విషయంలో విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటన దేవయానిపై కేసు ఉపసంహరణ ప్రసక్తే లేదు: యూఎస్ అధికారవర్గాలు న్యూఢిల్లీ: న్యూయార్క్‌లో భారతీయ దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రగడే అరెస్ట్‌కు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న కఠిన వైఖరి వల్ల సజావుగా సాగుతున్న అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలు ఒక్కసారిగా కుదుపునకు గురయ్యాయని భారత్‌లో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ వ్యాఖ్యానించారు. అమెరికా తరఫున భారతీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. దేవయాని అరెస్ట్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల పట్ల నాన్సీ విచారం వ్యక్తం చేశారు. అయితే, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల పరంగా జరుగుతున్న కృషిని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా, దేవయానిపై అమెరికా కోర్టులో ఉన్న కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలన్న భారత్ డిమాండ్‌ను అమెరికా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కేసును వెనక్కు తీసుకునే ప్రసక్తేలేదని, జనవరి 13న ఆమెపై అభియోగాలను నమోదు చేయనున్నారని అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. సంపూర్ణ దౌత్యరక్షణ లభించే ఐక్యరాజ్యసమితి శాశ్వత మిషన్‌కు బదిలీ అయినప్పటికీ.. దేవయానిపై కేసు బలంగా ఉందని, దానిని ఉపసంహరించబోరని, కాకపోతే, వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా మినహాయిం పు ఇవ్వొచ్చని తెలిపాయి. దౌత్యరక్షణ ఉన్నంతకాలం ఆమెపై ఉన్న కేసును సస్పెన్షన్‌లో ఉంచి, ఆ తరువాత విచారణ ప్రారంభించవచ్చని.. ఆ తరువాత ఎప్పుడు అమెరికాకు వచ్చినా ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని వివరించాయి. అయితే, ఈ వార్తలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ప్రజాస్వామ్యంలో చాలామంది మాట్లాడుతుంటారని.. అయితే అమెరికా విదేశాంగ శాఖ నుంచి వచ్చే స్పందన మాత్రమే అధికారిక ప్రకటనలా భావిస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మంగళవారం పేర్కొన్నారు. దేవయాని అరెస్ట్‌కు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిస్తున్నామని అమెరికా నుంచి తమకు అధికారికంగా సమాచారం ఉందని తెలిపారు. భారతీయ దౌత్యాధికారిణిపై కేసును తీవ్రంగా తీసుకున్నామని స్పష్టం చేశారు. కాగా, తమ కాన్సులేట్లలో పనిచేస్తున్న భారతీయులకు తక్కువ వేతనాలు ఇస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలను అమెరికా ఖండించింది. ఒక్క భారత్‌లోనే కాదు తమ కాన్సులేట్లు ఉన్న అన్ని దేశాల్లోనూ స్థానిక చట్టాలు, నిబంధనల ప్రకారం వేతనాలు ఇస్తున్నామంది.