నరేంద్ర మోడీతో నాన్సీ పావెల్ భేటీ
పుష్కర కాలం పాటు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అంటేనే మండిపడుతూ వచ్చిన అమెరికా.. ఎట్టకేలకు వైఖరి మార్చుకుంది. భారతదేశంలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ గురువారం నాడు నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. 2002లో గోధ్రా అనంతర మత ఘర్షణలు జరిగినప్పటి నుంచి మోడీకి అమెరికా వీసా నిరాకరించిన విషయం తెలిసిందే. ఇన్నాళ్ల తర్వాత నాన్సీ పావెల్ వచ్చి, బీజేపీ ప్రధాని అభ్యర్థి అయిన మోడీని కలిసి చేతులు కలిపారు. ఈ సందర్భంగా మోడీ ఆమెకు ఎరుపు, పసుపు పచ్చ పూలతో కూడిన ఓ బొకేను అందించారు. మరికొందరు అధికారులతో కలిసి నాన్సీ పావెల్ సుదీర్ఘ సమయం పాటు మోడీతో సమావేశమయ్యారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించే అవకాశం ఉందని సర్వేలన్నీ చెబుతుండటంతో.. ముందుగానే మోడీతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం మంచిదని భావించే అమెరికా ఈ నర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు మళ్లీ మోడీకి వీసా ఇచ్చే అవకాశం మాత్రం కనిపించడంలేదు. తమ వీసా విధానంలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి జెన్ సాకీ వాషింగ్టన్లో వ్యాఖ్యానించారు.