మోడీతో అమెరికా రాయబారి భేటీ
తొమ్మిదేళ్ల వీసా వివాదానికి తెరపడే అవకాశం
గాంధీనగర్: వీసా వ్యవహారంలో గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి అమెరికాకు మధ్య దూరం తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా రాయబారి నాన్సీ పావెల్ గురువారం నరేంద్రమోడీతో సమావేశం కావడం దీనికి బలం చేకూరుస్తోంది. గాంధీనగర్‌లో వీరిద్దరి మధ్య గంట పాటు చర్చలు జరిగాయి. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలందరినీ నాన్సీ పావెల్ కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె మోడీతో భేటీ అయ్యారు.
భారత్-అమెరికా సంబంధాలు, ప్రాంతీయ రక్షణ అంశాలు, మానవ హక్కులు, వాణిజ్యం, పెట్టుబడులు తదితరల అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు తమ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోందని నాన్సీ పావెల్ చెప్పారు. మోడీ ప్రధాని అయితే ఆయనతో కలసి పని చేసేందుకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదని ఆమె సంకేతాలిచ్చారు. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చాలా కీలకమని చెప్పారు.
కాగా, ఈ భేటీపై మోడీ సన్నిహిత వర్గాలు స్పందిస్తూ.. గుజరాత్‌లో పరిపాలన తీరును పావెల్ ప్రశంసించారని, పెట్టుబడులు పెట్టేందుకు గుజరాత్‌లో అనుకూల వాతావరణం ఉందని ఆమె అభిప్రాయపడ్డారని చెప్పాయి. రెండు దశాబ్దాలుగా గుజరాత్ ఎంతో అభివృద్ధి సాధించిందని ఆమె ప్రసంశలు కురిపించారన్నాయి. 2002లో గుజరాత్ అల్లర్ల తర్వాత నరేంద్రమోడీకి అమెరికా వీసా నిరాకరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. 13 ఏళ్లలో గాంధీనగర్‌కు ఓ విదేశీ రాయబారి స్థాయి అధికారి మోడీని కలిసేందుకు రావడం ఇదే తొలిసారి.
మోడీతో భేటీ తర్వాత పావెల్ గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు శంకర్‌సింగ్ వాఘేలాతో భేటీ అయ్యారు. కాగా, మోడీకి వీసా మంజూరులో తమ విధానంలో మార్పులేదని, తమ దేశ చట్టం ప్రకారమే ఎవరికైనా వీసా మంజూరు చేస్తామని అమెరికా చెప్పడం గమనార్హం. అయితే మోడీతో అమెరికా రాయబారి సమావేశాన్ని తక్కువ చేసి చూపేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. మోడీకి వీసా ఇచ్చినా.. ఇవ్వకపోయినా తమకు ఒరిగేదేమీ లేదని విదేశాంగ మంత్రి సల్మాన్‌ఖుర్షీద్ అన్నారు. మోడీ విషయంలో అమెరికా తన విధానాన్ని మార్చుకోదనే తాము భావిస్తున్నామని చెప్పారు.