వీసాల కఠినతరంపై రంగంలోకి ప్రధాని
వీసాల కఠినతరంపై రంగంలోకి ప్రధాని
Published Tue, May 2 2017 7:11 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
న్యూఢిల్లీ : భారత ఐటీ కంపెనీలకు, టెక్కీలకు ఝలికిస్తూ ఇటీవల ప్రముఖ దేశాలన్నీ తమ వీసా నిబంధనల్లో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తున్నాయి. మొదట అమెరికాకు కొత్తగా వచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హెచ్-1బీ వీసాలపై ఉక్కుపాదం మోపగా.. ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా వీసా ప్రొగ్రామ్ లను సస్పెండ్ చేస్తూ వాటి స్థానంలో కొత్తవి తీసుకొచ్చాయి. ఈ విషయంపై డైరెక్ట్ గా ప్రధాని నరేంద్రమోదీనే రంగంలోకి దిగారు. ప్రతిభావంతులైన నిపుణుల వీసా నిబంధనలు కఠితనరం చేస్తూ ఆస్ట్రేలియా తీసుకున్న తాజా నిబంధనలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దేశ ప్రధాని మాల్కోమ్ టర్న్ బుల్ తో మంగళవారం చర్చించారు. వీసా నిబంధనల్లో మార్పులపై ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు.
95వేల మందికి పైగా ఉన్న విదేశీ వర్కర్లు ఆస్ట్రేలియా ఉపాధి పొందుతున్న వీసా ప్రొగ్రామ్ 457ను ఆ దేశం గత నెల 18న రద్దు చేసింది. ఈ వీసాపై ఆధారపడి ఎక్కువమంది భారతీయులు ఆస్ట్రేలియాలో ఉపాధిపొందుతున్నారు. వీసా రద్దు ప్రభావం ఎక్కువగా భారతీయులపైనే చూపనుందని ఆందోళన వ్యక్తమైంది. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ, నేడు ఆ దేశ ప్రధానితో చర్చించారు. ఆ దేశ ప్రధానితో జరిపిన టెలిఫోనిక్ సంభాషణలో మాల్కోమ్, తన భారత్ పర్యటనను విజయవంతం చేసినందుకు నరేంద్రమోదీకి కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇటు ఆస్ట్రేలియా మాత్రమే కాక, అమెరికా తీసుకున్న నిర్ణయంపైనా భారత అధికారులు ట్రంప్ ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం హెచ్-1బీ వీసాల విషయంలో అసలు తగ్గేలా కనిపించడం లేదు. హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరంపై భారత్ కూడా ఘాటుగానే స్పందిస్తోంది.
Advertisement