అమెరికా పర్యాటకుల కోసం వీసా ఆన్ అరైవల్!
న్యూఢిల్లీ: అమెరికా పర్యాటకులను ఆకర్షించడానికి వారికి వీసా ఆన్ అరైవల్ (వీఓఏ) ఇచ్చే ప్రతిపాదనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా దీనిపై ప్రకటన చేసే విధంగా ఆ కసరత్తు ముమ్మరం చేసామని ప్రభుత్వాధికారులు చెప్పారు. అమెరికా పర్యాటకులకు వీఓఏ (దేశంలోకి వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్టుల్లోగానీ, సీ పోర్టుల్లోగానీ, సరిహద్దు చెక్‌పోస్టుల్లోగానీ ఇచ్చే వీసా) విషయంలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖతో హోం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. వినోద కార్య క్రమాల్లో పాల్గొనడం, ప్రాంతాల సందర్శన, స్నేహితులను, బంధువులను కలవడం తదితర పనులపై వచ్చే వారికి మాత్రమే ఈ వీసా జారీ చేస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పారు.
అయితే ఈ వీసా కాలపరిమితి 30 రోజులు ఉండవచ్చని సమాచారం. తొలుత ఈ టూరిస్టు వీఓఏ 2010లో ప్రవేశపెట్టారు. అప్పుడు ఐదు దేశాలకు ఇవ్వగా ఇప్పుడు అది ఫిన్లాండ్, జపాన్, లక్సెంబర్గ్, న్యూజీలాండ్, సింగపూర్, కంబోడియా, వియాత్నాం, ఫిలిప్పీన్స్, లావోస్, మయన్మార్, ఇండోనేసియా, దక్షిణ కొరియా దేశాలకు విస్తరించారు. అమెరికా, భారత్ వ్యూహాత్మక భాగస్వాములైనా కూడా ఇప్పటి వరకూ ఇరు దేశాలకు సంబంధించి వీఓఏ సదుపాయంలేదు.
ఒక అంచనా ప్రకారం ఏటా 10 లక్షల మంది అమెరికన్లు భారత్ సంద ర్శిస్తున్నారు. ఇప్పుడు మోదీకి అగ్రరాజ్యం ఆహ్వానం పలికన నేపథ్యంలో దీనిపై ప్రకటనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా మూడు రోజుల పర్యటన కోసం అమెరికా వస్తున్న ప్రధాని మోదీకి ఘనంగా ఆహ్వానం పలకడానికి భారతీయ అమెరికన్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27న ఐరాస సాధారణ సభను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్న నేపథ్యంలో ఆ కార్యాలయం ముందు ‘అమెరికా వెల్‌కమ్స్ మోదీ’ పేరుతో భారీ ఎత్తున సభ నిర్వహించాలని వారు నిర్ణయించారు.