visa on arrival
-
యూఏఈ వీసా ఆన్ అరైవల్.. షరతులు వర్తిస్తాయి
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. యూఏఈ ప్రభుత్వం భారత జాతీయుల కోసం నూతనంగా వీసా ఆన్ అరైవల్ విధానాన్ని ప్రకటించింది. అయితే, ఇందుకు ఓ షరతు విధించింది. అమెరికా, యూకే, ఇతర ఏదైనా యూరోపియన్ యూనియన్ దేశం శాశ్వత నివాస కార్డు లేదా వీసా ఉన్న వ్యక్తులే వీసా ఆన్ అరైవల్‌కు అర్హులు. ఈ విధానం ద్వారా యూఏఈలో అడుగు పెట్టిన వెంటనే వీరికి 14 రోజుల వీసా లభిస్తుంది. అవసరమైన ఫీజు చెల్లించిన పక్షంలో మరో 60 రోజుల వరకు దీనిని పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకుగాను..అమెరికా వీసా, నివాస కార్డు లేక గ్రీన్ కార్డు ఉన్న వారు.. ఏదేని యూరోపియన్ యూనియన్ దేశం లేక యునైటెడ్ కింగ్డమ్ వీసా లేక నివాస ధ్రువీకరణ కార్డు ఉన్నవారు అర్హులు. కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్టు కూడా వీరు చూపాల్సి ఉంటుంది. భారత్–యూఏఈల బంధం బలపడుతున్న వేళ ఈ నూతన విధానం అమల్లోకి రావడం విశేషం. యూఏఈలో ప్రస్తుతం 35 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు. -
కరోనా కలకలం : వీసా ఆన్ అరైవల్ రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : చైనా కేంద్రంగా కరోనా వైరస్ పలు ప్రపంచ దేశాలకు వ్యాపించడంతో భారత ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. జపాన్, దక్షిణ కొరియా నుంచి వచ్చే ట్రావెలర్స్‌కు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇమిగ్రేషన్ బ్యూరో, హోం వ్యవహరాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు వెల్లడించాయి. మరోవైపు చైనాలో 44 తాజా మరణాలతో కరోనా వైరస్ మృతుల సంఖ్య 2,788కి చేరింది. చైనా వ్యాప్తంగా గురువారం 433 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 78,824కు పెరిగింది. ఈ డెడ్లీ వైరస్ బయటపడిన హుబేయ్ ప్రావిన్స్‌లోనే నూతన కేసులు, మృతుల సంఖ్య అధికంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. చదవండి : ‘ముక్క’ ముట్టడం లేదు! -
పాక్‌పై అమెరికా ఆంక్షల కొరడా
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్‌పై మరోసారి కఠిన వైఖరి తీసుకుంది. బహిష్కరణకు గురైన వారిని స్వదేశానికి తీసుకెళ్లేందుకు, వీసా గడువు ముగిశాక తిష్టవేసిన పౌరుల విషయం పట్టించుకునేందుకు నిరాకరించడంతో పాకిస్తాన్‌పై తాజాగా ఆంక్షల కొరడా ఝళిపించింది. ఈ పరిణామంతో అమెరికా ఆంక్షల భారం పడిన 10 దేశాల జాబితాలో పాకిస్తాన్ సైతం చేరినట్లయింది. బహిష్కరణకు గురైన వారిని స్వదేశానికి తీసుకెళ్లేందుకు, అమెరికాలో అక్రమంగా ఉంటున్న తమ పౌరులను వెనక్కి తీసుకునేందుకు నిరాకరించడంతో ఆఫ్రికా దేశం ఘనాపైనా ఈ ఏడాది ఆంక్షలు విధించింది. ఈ రెండు దేశాలతోపాటు గయానా (2001), గాంబియా (2016), కాంబోడియా, ఎరిట్రియా, గినియా, సియెర్రాలియోన్ (2017), బర్మా, లావోస్ (2018)పైనా అమెరికా ఆంక్షలు అమలు చేస్తోంది. ఆంక్షల కారణంగా ఆయా దేశాల పౌరులు, నివాసితులకు ఎటువంటి కారణం చూపకుండా వీసా ఆలస్యం చేయవచ్చు లేదా నిరాకరించేందుకు అమెరికా హోంశాఖకు అధికారం ఉంటుంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నందున ఈ ఆంక్షల విషయమై స్పందించలేమని అమెరికా హోం శాఖ తెలిపింది. అయితే, ఆంక్షల ప్రభావం పాక్‌పై పరిమితంగానే ఉంటుందని అధికారులు అంటున్నారు. -
చైనా, పాక్ కంటే మనమే బెటర్!
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టు జర్మనీ దేశానికి ఉందట. ఒక పాస్‌పోర్టు మాత్రమే ఉండి, ముందుగా వీసా తీసుకోకుండా (వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ ఎరైవల్‌తో) ఎన్ని దేశాలకు వెళ్లగలరు అనే అంశం ఆధారంగా వివిధ దేశాల పాస్‌పోర్టులకు స్కోర్లు, ర్యాంకులను ఆర్టన్ కేపిటల్ సంస్థ ప్రకటించింది. అందులో జర్మనీ 157 పాయింట్ల స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా ఖండంలోని సింగపూర్ 156 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి అంతకుముందు ఆ స్థానంలో ఉన్న దక్షిణ కొరియాను వెనక్కి నెట్టింది. ఇక మన దేశానికి ఈ విషయంలో స్కోరు 46 మాత్రమే వచ్చి 78వ స్థానంలో నిలిచింది. కానీ చైనా, పాకిస్థాన్ దేశాల కంటే మాత్రం మనం చాలా ముందున్నాం. అవి ఇంకా వెనకబడ్డాయి. మొత్తం ఎన్ని దేశాల పాస్‌పోర్టులను పరిశీలించారన్న విషయాన్ని ప్రస్తావించలేదు గానీ, అఫ్ఘానిస్థాన్ మాత్రం కేవలం 23 స్కోరుతో జాబితాలో అట్టడుగున నిలిచింది. వివిధ దేశాలు తమ దేశానికి ఫలానా దేశం నుంచి వీసా ఆన్ ఎరైవల్ సదుపాయాన్ని కల్పిస్తాయి. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం పలు దేశాలకు ఈ సదుపాయాన్ని కల్పించగా, ప్రతిగా మరిన్ని దేశాలు మనవాళ్లకు వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యం ఇచ్చాయి. దీని వల్ల ప్రయాణానికి ముందే వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా అక్కడకు వెళ్లిన తర్వాత విమానాశ్రయాల్లో ఉండే ప్రత్యేక కౌంటర్లలో విజిటర్స్ వీసా తీసుకోవచ్చన్న మాట. -
భారతీయులకు హాంకాంగ్ షాక్!
ప్రస్తుతం పర్యాటకులు ఎక్కువగా తిరిగే కాలం. భారతీయులు ఎక్కువగా వెళ్లే దేశాలు.. థాయ్‌లాండ్, హాంకాంగ్. కానీ, సరిగ్గా ఇలాంటి సమయంలోనే భారతీయ పర్యాటకులకు హాంకాంగ్ షాకిచ్చింది. ఒకవైపు థాయ్‌లాండ్ మూడు నెలల పాటు వీసా ఫీజులను సగానికి తగ్గించగా, హాంకాంగ్ మాత్రం మనోళ్లకు వీసా ఆన్ ఎరైవల్ సదుపాయాన్ని రద్దుచేసింది. 2016 డిసెంబర్ 1 నుంచి 2017 ఫిబ్రవరి 28 వరకు టూరిస్టు వీసా మీద వచ్చేవారికి వీసా ఆన్ ఎరైవల్ ఫీజును 2000 థాయ్ బాత్‌ల నుంచి వెయ్యి థాయ్ బాత్‌లకు తగ్గిస్తున్నట్లు రాయల్ థాయ్ కాన్సులేట్ జనరల్ ఓప్రకటనలో తెలిపింది. ఒక థాయ్ బాత్ విలువ రూ. 1.90 మాత్రమే. దాంతో వీసా ఫీజుగా సుమారు రూ. 2వేలు చెల్లిస్తే సరిపోతుంది. అదే భారతీయులకు మాత్రం మరింత వెసులుబాటు కల్పించింది. థాయ్‌లాండ్‌కు వెళ్లడానికి ముందే వీసా తీసుకుంటే కేవలం రూ. 335 వీఎఫ్ఎస్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని చెప్పింది. అయితే హాంకాంగ్ మాత్రం.. హాంకాంగ్‌కు రావడానికి ముందే ప్రీ ఎరైవల్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఇదంతా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే ఫలితం వెంటనే కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అయితే దౌత్యవేత్తలు, అధికారిక పాస్‌పోర్టులు కలిగినవాళ్లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అలాగే తరచు ఈ ఛానల్ సర్వీసు ద్వారా హాంకాంగ్‌కు వెళ్లేవారిని కూడా దీన్నుంచి మినహాయించారు. కొంతమంది భారతీయులు వీసా ఆన్ ఎరైవల్ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. -
అమెరికా పర్యాటకుల కోసం వీసా ఆన్ అరైవల్!
న్యూఢిల్లీ: అమెరికా పర్యాటకులను ఆకర్షించడానికి వారికి వీసా ఆన్ అరైవల్ (వీఓఏ) ఇచ్చే ప్రతిపాదనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా దీనిపై ప్రకటన చేసే విధంగా ఆ కసరత్తు ముమ్మరం చేసామని ప్రభుత్వాధికారులు చెప్పారు. అమెరికా పర్యాటకులకు వీఓఏ (దేశంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్టుల్లోగానీ, సీ పోర్టుల్లోగానీ, సరిహద్దు చెక్పోస్టుల్లోగానీ ఇచ్చే వీసా) విషయంలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖతో హోం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. వినోద కార్య క్రమాల్లో పాల్గొనడం, ప్రాంతాల సందర్శన, స్నేహితులను, బంధువులను కలవడం తదితర పనులపై వచ్చే వారికి మాత్రమే ఈ వీసా జారీ చేస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. అయితే ఈ వీసా కాలపరిమితి 30 రోజులు ఉండవచ్చని సమాచారం. తొలుత ఈ టూరిస్టు వీఓఏ 2010లో ప్రవేశపెట్టారు. అప్పుడు ఐదు దేశాలకు ఇవ్వగా ఇప్పుడు అది ఫిన్లాండ్, జపాన్, లక్సెంబర్గ్, న్యూజీలాండ్, సింగపూర్, కంబోడియా, వియాత్నాం, ఫిలిప్పీన్స్, లావోస్, మయన్మార్, ఇండోనేసియా, దక్షిణ కొరియా దేశాలకు విస్తరించారు. అమెరికా, భారత్ వ్యూహాత్మక భాగస్వాములైనా కూడా ఇప్పటి వరకూ ఇరు దేశాలకు సంబంధించి వీఓఏ సదుపాయంలేదు. ఒక అంచనా ప్రకారం ఏటా 10 లక్షల మంది అమెరికన్లు భారత్ సంద ర్శిస్తున్నారు. ఇప్పుడు మోదీకి అగ్రరాజ్యం ఆహ్వానం పలికన నేపథ్యంలో దీనిపై ప్రకటనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా మూడు రోజుల పర్యటన కోసం అమెరికా వస్తున్న ప్రధాని మోదీకి ఘనంగా ఆహ్వానం పలకడానికి భారతీయ అమెరికన్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27న ఐరాస సాధారణ సభను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్న నేపథ్యంలో ఆ కార్యాలయం ముందు ‘అమెరికా వెల్కమ్స్ మోదీ’ పేరుతో భారీ ఎత్తున సభ నిర్వహించాలని వారు నిర్ణయించారు. -
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోనూ వీసా ఆన్ ఎరైవల్
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లో విదేశీ పర్యాటకులకు అందిస్తున్న వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యాన్ని మరో నాలుగు నగరాల్లోని ఎయిర్‌పోర్టులకు విస్తరించాలని కేంద్రం నిర్ణయిం చింది. ఆగస్టు 15 నుంచి హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, కొచ్చిలలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులలోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు పర్యాటకశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జపాన్, న్యూజిలాండ్, సింగపూర్, వియత్నాం, కాంబోడియా, ఫిలిప్పీన్స్, మయన్మార్ సహా 11 దేశాల పర్యాటకులు ఈ సదుపాయాన్ని పొందేందుకు అర్హులని చెప్పారు.