పులకరించిన జనవాడ
సాక్షి, రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి: హాలీవుడ్ నటులు.. బాలీవుడ్ తారలు.. రాజకీయ ప్రముఖులు.. అమెరికా అత్యున్నత అధికారులు.. వీరంతా ఒకేసారి తరలిరావడంతో శంకర్‌పల్లి మండలంలోని జనవాడ గ్రామం పులకరించింది. గ్రామంలో వాటర్ హెల్త్ ఇంటర్నేషనల్(డబ్ల్యూహెచ్‌ఐ), జలధార సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ వాటర్ సిస్టంను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి ఆనంద్‌శర్మ, భారత్‌లోని అమెరికా రాయబారి నాన్సీ పావెల్, బాలీవుడ్ తారలు దియామిర్జా, జాకీష్రాష్, గుల్షన్‌గ్రోవర్, హాలీవుడ్ నటులు లీసా జోయ్‌నర్, ప్లేరైట్ గ్రెచెన్ క్రైయర్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు తరలివచ్చారు.
మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రముఖుల బృందం జనవాడకు చేరుకుంది. స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, స్థానిక సర్పంచ్ వసంతలక్ష్మి తదితరులు మంగళ వాయిద్యాలతో వారికి స్వాగతం పలికారు. వారి నుదుటున కుంకుమ తిలకం దిద్ది పూలమాలలతో సత్కరిం చారు. వారిని చూసేందుకు గ్రామంలోని ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. తారలకు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు పోటీపడ్డారు. కొందరు ఆటోగ్రాఫ్ కోసం మినీ పుస్తకాలతో వారిముందు వాలిపోయారు. ఫొటోలకు ఫోజు లిస్తూ గ్రామస్తులు వారితో మమేకమయ్యారు. తారలంతా స్థానికులతో మాటామాటా కలపడంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. కేరింతలు, చప్పట్లతో గ్రామం హోరెత్తింది.
ఆసక్తిగా..
వాటర్ ప్లాంట్ సమీపంలో జరిగిన సభా ప్రాంగణంలో భారతీయ సంస్కృతి ప్రతిబింబిచేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ విదేశీ బృందాన్ని కట్టిపడేశాయి. కుండలు తయారుచేసే విధానాన్ని వారు ఆసక్తిగా చూశారు. గాజుల దుకాణంలో మట్టి గాజులు కొని ధరించారు. సభ ముగిసిన తర్వాత పాఠశాల విద్యార్థులతోనూ వారు కలివిడిగా మెలిగారు. బాగా చదువుకోవాలని హితవు పలికారు.