సోను ఆనంద్ శర్మ; 2021 బ్రెజిల్ డెఫ్లింపిక్స్‌లో తన టీమ్‌తో సోనూ ఆనంద్
మాట వినకపోతే మాట పలకలేము. మాటతో నిండిన ఈ ప్రపంచంలో మాట లేకపోతే శూన్యతే. సోను ఆనంద్ శర్మ ఆ శూన్యత నుంచే బయలుదేరింది. పూర్తి బధిరత్వం వల్ల మాటకు కూడా దూరమైన సోను ఈ ప్రపంచంతో బ్యాట్‌తోనే మాట్లాడాలనుకుంది. బధిర బాడ్మింటన్ క్రీడాకారిణిగా సోనువి ఘన విజయాలు. ఆ తర్వాత కోచ్‌గా మారి దేశానికి ఎందరో క్రీడాకారులనిచ్చింది.
కాని ఇదంతా సులభమా? బధిరత్వం ఉంటే ఇన్ని ఆటంకాలా? దివ్యాంగుల గెలుపు కథల్లో సోను కథ ముఖ్యమైనది.
‘పూర్తిగా వినపడకపోతే ఏమవుతుందో తెలుసా?’ అని అడుగుతుంది సోను ఆనంద్ శర్మ.
పూర్తిగా వినపడని వారు దానికి పూర్తి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే పూర్తిగా వినపడని వారికే ఆ బాధ తీవ్రత తెలుస్తుంది. ‘వినడం వల్లే భాష మాట్లాడతాం. వాక్యాన్ని నిర్మిస్తాం. గ్రామర్ నేర్చుకుంటాం. పూర్తి వాక్యం రాస్తాం. పూర్తిగా వినపడకపోతే మీరు మాట్లాడలేరు. రాయలేరు. గ్రామర్‌తో సరిగ్గా రాయలేరు’ అంటుందామె.
47 ఏళ్ల సోను ఆనంద్ శర్మ ‘డెఫ్లింపిక్స్’ (బధిరులకు జరిగే ఒలింపిక్స్)లో బాడ్మింటన్ క్రీడాకారిణిగా ఈ దేశానికి పతకాలు తెచ్చింది. ఆ తర్వాత కోచ్‌గా మారి శిష్యులను తయారు చేసి పతకాలను తెస్తోంది. అయినప్పటికీ ఆమె ఒక బధిరురాలిగా వివక్ష ఎదుర్కొంటూనే ఉంది.
‘ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తే ప్రభుత్వం పది లక్షలు ఇస్తుంది. బధిరుల ఒలింపిక్స్‌లో నేను పతకాలు సాధించాను. నా మెడల్స్ కూడా అంతకు సమానమే. అయినా నాకు డబ్బు రాలేదు’ అంటుందామె. అంతే కాదు... క్రీడాకారుల పెన్షన్‌లు, నజరానాలు అన్నీ కూడా అన్నీ సవ్యంగా ఉన్నవారికే. దివ్యాంగులకు వివక్షే.
‘అయినా సరే నేను నా దేశం కోసం పని చేస్తూనే ఉంటాను’ అంటుంది సోను.
సైన్ లాంగ్వేజ్ ఎక్కడ?
సోను ఆనంద్ శర్మది న్యూఢిల్లీ. పుట్టు బధిరురాలు. క్లాసుకు వెళితే టీచర్లకు సైన్ లాంగ్వేజ్ వచ్చేది కాదు. ఈమెకు పాఠాలు వినపడేవి కావు. ‘మన దేశంలో ఆరున్నర కోట్ల మంది పూర్తి బధిరులు లేదా పాక్షిక బధిరులు. వారిలో 50 లక్షల మంది పిల్లలు. అయినా మన దేశంలో కేవలం 700 స్కూళ్లలోనే సైన్ లాంగ్వేజ్‌లో చదువు చెప్తారు. సైన్ లాంగ్వేజ్‌ను అధికారిక భాషగా ప్రకటిస్తే సమస్య చాలామటుకు తీరుతుంది. కాని ప్రకటించరు. చదువు రాకపోతే బధిరులు జీవితాంతం ఇబ్బంది పడుతూనే ఉండాలి’ అంటుందామె. ఇప్పుడు ఆమె ఢిల్లీ టూరిజంలో ఉద్యోగం చేస్తుంది. మొత్తం డిజిటల్ కమ్యూనికేషనే జరుగుతుంది. సోను కమ్యూనికేట్ చేస్తుంది కాని భాష మెరుగ్గా ఉండదు. ‘అందుకని నన్ను ఒకలా చూస్తారు కొలీగ్స్’ అంటుందామె.
10 ఏళ్ల వయసు నుంచి
పాఠాలు అర్థం కాకపోవడం వల్ల సోను బాడ్మింటన్‌తో ఆ వెలితి పూడ్చుకోవాలని అనుకుంది. ‘కాని మాకు మంచి కోచ్‌లు దొరికేవారు కాదు. కోచ్‌లు దొరికినా వారి దృష్టి నార్మల్ ఆటగాళ్ల మీద ఉండేది. బధిరుల మీద ఫోకస్ ఉండేది కాదు. అందుకని నన్ను నేను నమ్ముకున్నాను. రోజూ ఉదయం నుంచి రాత్రి దాకా ప్రాక్టీసు చేసేదాన్ని. మాది మధ్యతరగతి కుటుంబం. స్కూటర్ కూడా లేదు. బస్‌లో కోర్టుకు తిరుగుతుంటే మా తల్లిదండ్రులు భయపడేవారు... ఆడపిల్లనని... మాటలు రావని. మా నాన్న ఆఫీస్ నుంచి వచ్చి నా కోసం నేను ప్రాక్టీసు చేసే చోట కాచుకుని కూచునేవాడు’ అని గుర్తు చేసుకుంది సోను. ఆ శ్రమ వృథా పోలేదు. 1997 సమ్మర్ డెఫ్లింపిక్స్ నుంచి 2009 సమ్మర్ డెఫ్లింపిక్స్ వరకూ దేశం తరఫున ఆడి పతకాల పంట పండించింది సోను ఆనంద్ శర్మ. 2014 నుంచి కోచ్ శిష్యుల ద్వారా పతకాలు తెచ్చి పెడుతోంది. బధిర బాడ్మింటన్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జెర్న్‌లిన్ అనిక ఈమె శిష్యురాలే.
‘దివ్యాంగులను తక్కువ అంచనా వేయొద్దు. వారి సామర్థ్యాల పై సానుభూతి వద్దు. మమ్మల్ని గ్రహాంతర వాసుల్లా చూడొద్దు. మీలాగే సాటి మనుషులుగా చూడండి’ అంటుంది సోను శర్మ.
వారికి అనువుగా సమాజం మారాలి. వారి కోసం కూడా ఈ సమాజం ఉంది. వారి సమాన వాటాను ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment