కరెన్సీ స్వాప్ ఒప్పందాలపై త్వరలో టాస్క్‌ఫోర్స్
న్యూఢిల్లీ: రూపాయి విలువ ఘోరంగా పడిపోతున్న నేపథ్యంలో దీన్ని స్థిరీకరించేందుకు ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడుతోంది. ముఖ్యంగా భారత్‌తో కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలతో కరెన్సీ స్వాప్(మార్పిడి) ఒప్పందాలకు గల అవకాశాలను అన్వేషిస్తున్నామని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ మంగళవారం ఇక్కడ చెప్పారు. 7-8 మంది సభ్యులతో దీనికోసం ఒక టాస్క్‌ఫోర్స్/కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ వారాంతలోగా టాస్క్‌ఫోర్స్‌ను ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు. వాణిజ్య శాఖ కార్యదర్శి నేతృత్వంలోని ఈ బృందం నాలుగు వారాల్లో తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుందని శర్మ తెలిపారు. ఇప్పటికే జపాన్(15 బిలియన్ డాలర్లు)తో ఇటువంటి ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకున్న విషయాన్ని గుర్తుచేశారు. భూటాన్‌తో సైతం(10 కోట్ల డాలర్లు) ఒప్పందం ఉంది. ఒక కరెన్సీతో మరో కరెన్సీని మార్పిడి చేసుకునేందుకు స్వాప్ ఒప్పందాలు దోహదం చేస్తాయి.