International Disability Day
-
International disabled day: దివ్యాంగుల కోసం ఎన్నో కార్యక్రమాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం దివ్యాంగులు తమ ప్రతిభను చాటుకునేందుకు, వారికి అవకాశాలు కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని ప్రధాని మోదీ చెప్పారు. దివ్యాంగులు ప్రదర్శిస్తున్న ధైర్యాన్ని, వారు సాధిస్తున్న విజయాలను ఆయన ప్రశంసించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందనటానికి తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలే తార్కాణం. దివ్యాంగుల జీవితాల్లో సానుకూల మార్పు కోసం అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్న కృషి వారందరికీ కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. -
International Disability Day: నిశ్శబ్ద విజయం
మాట వినకపోతే మాట పలకలేము. మాటతో నిండిన ఈ ప్రపంచంలో మాట లేకపోతే శూన్యతే. సోను ఆనంద్ శర్మ ఆ శూన్యత నుంచే బయలుదేరింది. పూర్తి బధిరత్వం వల్ల మాటకు కూడా దూరమైన సోను ఈ ప్రపంచంతో బ్యాట్‌తోనే మాట్లాడాలనుకుంది. బధిర బాడ్మింటన్ క్రీడాకారిణిగా సోనువి ఘన విజయాలు. ఆ తర్వాత కోచ్‌గా మారి దేశానికి ఎందరో క్రీడాకారులనిచ్చింది. కాని ఇదంతా సులభమా? బధిరత్వం ఉంటే ఇన్ని ఆటంకాలా? దివ్యాంగుల గెలుపు కథల్లో సోను కథ ముఖ్యమైనది. ‘పూర్తిగా వినపడకపోతే ఏమవుతుందో తెలుసా?’ అని అడుగుతుంది సోను ఆనంద్ శర్మ. పూర్తిగా వినపడని వారు దానికి పూర్తి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే పూర్తిగా వినపడని వారికే ఆ బాధ తీవ్రత తెలుస్తుంది. ‘వినడం వల్లే భాష మాట్లాడతాం. వాక్యాన్ని నిర్మిస్తాం. గ్రామర్ నేర్చుకుంటాం. పూర్తి వాక్యం రాస్తాం. పూర్తిగా వినపడకపోతే మీరు మాట్లాడలేరు. రాయలేరు. గ్రామర్‌తో సరిగ్గా రాయలేరు’ అంటుందామె. 47 ఏళ్ల సోను ఆనంద్ శర్మ ‘డెఫ్లింపిక్స్’ (బధిరులకు జరిగే ఒలింపిక్స్)లో బాడ్మింటన్ క్రీడాకారిణిగా ఈ దేశానికి పతకాలు తెచ్చింది. ఆ తర్వాత కోచ్‌గా మారి శిష్యులను తయారు చేసి పతకాలను తెస్తోంది. అయినప్పటికీ ఆమె ఒక బధిరురాలిగా వివక్ష ఎదుర్కొంటూనే ఉంది. ‘ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తే ప్రభుత్వం పది లక్షలు ఇస్తుంది. బధిరుల ఒలింపిక్స్‌లో నేను పతకాలు సాధించాను. నా మెడల్స్ కూడా అంతకు సమానమే. అయినా నాకు డబ్బు రాలేదు’ అంటుందామె. అంతే కాదు... క్రీడాకారుల పెన్షన్లు, నజరానాలు అన్నీ కూడా అన్నీ సవ్యంగా ఉన్నవారికే. దివ్యాంగులకు వివక్షే. ‘అయినా సరే నేను నా దేశం కోసం పని చేస్తూనే ఉంటాను’ అంటుంది సోను. సైన్ లాంగ్వేజ్ ఎక్కడ? సోను ఆనంద్ శర్మది న్యూఢిల్లీ. పుట్టు బధిరురాలు. క్లాసుకు వెళితే టీచర్లకు సైన్ లాంగ్వేజ్ వచ్చేది కాదు. ఈమెకు పాఠాలు వినపడేవి కావు. ‘మన దేశంలో ఆరున్నర కోట్ల మంది పూర్తి బధిరులు లేదా పాక్షిక బధిరులు. వారిలో 50 లక్షల మంది పిల్లలు. అయినా మన దేశంలో కేవలం 700 స్కూళ్లలోనే సైన్ లాంగ్వేజ్‌లో చదువు చెప్తారు. సైన్ లాంగ్వేజ్‌ను అధికారిక భాషగా ప్రకటిస్తే సమస్య చాలామటుకు తీరుతుంది. కాని ప్రకటించరు. చదువు రాకపోతే బధిరులు జీవితాంతం ఇబ్బంది పడుతూనే ఉండాలి’ అంటుందామె. ఇప్పుడు ఆమె ఢిల్లీ టూరిజంలో ఉద్యోగం చేస్తుంది. మొత్తం డిజిటల్ కమ్యూనికేషనే జరుగుతుంది. సోను కమ్యూనికేట్ చేస్తుంది కాని భాష మెరుగ్గా ఉండదు. ‘అందుకని నన్ను ఒకలా చూస్తారు కొలీగ్స్’ అంటుందామె. 10 ఏళ్ల వయసు నుంచి పాఠాలు అర్థం కాకపోవడం వల్ల సోను బాడ్మింటన్తో ఆ వెలితి పూడ్చుకోవాలని అనుకుంది. ‘కాని మాకు మంచి కోచ్‌లు దొరికేవారు కాదు. కోచ్‌లు దొరికినా వారి దృష్టి నార్మల్ ఆటగాళ్ల మీద ఉండేది. బధిరుల మీద ఫోకస్ ఉండేది కాదు. అందుకని నన్ను నేను నమ్ముకున్నాను. రోజూ ఉదయం నుంచి రాత్రి దాకా ప్రాక్టీసు చేసేదాన్ని. మాది మధ్యతరగతి కుటుంబం. స్కూటర్ కూడా లేదు. బస్‌లో కోర్టుకు తిరుగుతుంటే మా తల్లిదండ్రులు భయపడేవారు... ఆడపిల్లనని... మాటలు రావని. మా నాన్న ఆఫీస్ నుంచి వచ్చి నా కోసం నేను ప్రాక్టీసు చేసే చోట కాచుకుని కూచునేవాడు’ అని గుర్తు చేసుకుంది సోను. ఆ శ్రమ వృథా పోలేదు. 1997 సమ్మర్ డెఫ్లింపిక్స్ నుంచి 2009 సమ్మర్ డెఫ్లింపిక్స్ వరకూ దేశం తరఫున ఆడి పతకాల పంట పండించింది సోను ఆనంద్ శర్మ. 2014 నుంచి కోచ్ శిష్యుల ద్వారా పతకాలు తెచ్చి పెడుతోంది. బధిర బాడ్మింటన్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జెర్న్లిన్ అనిక ఈమె శిష్యురాలే. ‘దివ్యాంగులను తక్కువ అంచనా వేయొద్దు. వారి సామర్థ్యాల పై సానుభూతి వద్దు. మమ్మల్ని గ్రహాంతర వాసుల్లా చూడొద్దు. మీలాగే సాటి మనుషులుగా చూడండి’ అంటుంది సోను శర్మ. వారికి అనువుగా సమాజం మారాలి. వారి కోసం కూడా ఈ సమాజం ఉంది. వారి సమాన వాటాను ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకుందాం. -
అవును నిజమే.. అయితే ఏంటి?
న్యూఢిల్లీ: ‘‘అవును నిజమే.. నా శరీరానికి వైకల్యం ఉంది. అయితే దానర్థం నేనేమీ సాధించలేనని కాదు. మిగతా వారికంటే కాస్త భిన్నమైన దారిలో పయనిస్తానని మాత్రమే అర్థం. ‘వైకల్యం’ అనేది నేను చేయాలనుకున్న పనులు చేయకుండా నన్ను అడ్డుకోలేదు. కాబట్టి ఇంటర్నేషనల్ డిజెబిలిటీ డే సెలబ్రేట్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా’’ అంటూ మోటివేషనల్ స్పీకర్ మాళవికా అయ్యర్ దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపారు. డిసెంబరు 3న ‘వరల్డ్ డిజెబిలిటీ డే’ సందర్భంగా తన పనులు తానే చేసుకుంటున్న వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. గ్రానైడ్ పేలిన ఘటనలో మాళవిక చిన్నతనంలోనే తన రెండు అరచేతులను కోల్పోయారు. ఇరుగుపొరుగు సూటిపోటి మాటలు తట్టుకుని ధైర్యంగా నిలబడిన ఆమె.. స్క్రైబ్సాయంతో పరీక్షలు రాసి ఉన్నత విద్య పూర్తి చేశారు. అంతర్జాతీయ స్థాయి మోటివేషనల్ స్పీకర్‌గా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. (చదవండి: అదే అన్నింటికంటే పెద్ద శాపం.. కాబట్టి) ఈ క్రమంలో వివిధ దేశాల్లో ప్రసంగాలు చేసిన మాళవిక.. సమాజ తీరు, మహిళలు, దివ్యాంగులపై వివక్ష వంటి అంశాలపై ఐక్యరాజ్యసమితిలోనూ తన గళాన్ని బలంగా వినిపించారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా అత్యున్నత మహిళా పురస్కారం నారీ శక్తి పురస్కార్‌తో సత్కరించింది. మాళవిక తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. గత నెల 29న వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన ఆమె.. ‘‘ పదేళ్ల క్రితం.. ‘ఈ వ్యక్తితోనే మన జీవితం గడపాలని నిర్ణయించుకున్నపుడు.. ఇంక ఆలస్యం చేయకూడదు. వెంటనే దానిని అమలు చేసేయాలి’ అనే సినిమా డైలాగ్‌తో మా సంభాషణ మొదలైంది. మా బంధానికి కాలంతో పనిలేదు. హ్యాపీ యానివర్సరీ మై లైఫ్’’ అంటూ తన బెస్టాఫ్పై ప్రేమను చాటుకున్నారు. బాల్యం రాజస్తాన్‌లో మాళవిక అయ్యర్ తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు క్రిష్ణన్- హేమా క్రిష్ణన్. తండ్రి వాటర్ వర్క్స్‌లో ఇంజనీరుగా పనిచేసిన క్రమంలో మాళవిక బాల్యం రాజస్తాన్‌లోని బికనీర్‌లో గడిచింది. అక్కడ ఉన్నపుడే ఓ రోజు తమ గ్యారేజీలో ఆడుకుంటున్న సమయంలో గ్రానైడ్ చేతుల్లో పేలింది. ఆ తర్వాత ఆమెను చెన్నైలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఉన్నత విద్య కోసం ఢిల్లీకి చేరకున్న మాళవిక... ఎకనమిక్స్ హానర్స్ చదివారు. సోషల్ వర్క్‌లో పీహెచ్డీ చేసి డాక్టరేట్ సంపాదించారు. 2013 నుంచి మోటివేషనల్ స్పీకర్‌గా మారారు. I have a disability, yes that's true, but all that really means is I may have to take a slightly different path than you. Having a #disability doesn’t stop me from doing anything. ❤️ I'm all ready to celebrate #InternationalDisabilityDay #IDPD2020 #IDPD pic.twitter.com/VEzICaOBEy — Dr. Malvika Iyer (@MalvikaIyer) December 3, 2020 -
రక్తపు మడుగులో మునిగినా ఏడ్వలేదు.. కానీ
మానసిక వైకల్యమే అన్నింటి కంటే పెద్ద శాపం. ఒక విషయం పట్ల ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. కొంతమంది తీవ్ర ఉద్వేగాలకు లోనవుతారు. అయితే తాము మానసికంగా దృఢంగా లేమన్న విషయాన్ని గుర్తించరు. తమను పిచ్చివాళ్లుగా ముద్ర వేస్తారన్న భయంతో... అందుకు చికిత్స కూడా తీసుకోరు అంటారు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ మాళవిక అయ్యర్. భారతదేశ మహిళా అత్యున్నత నారీశక్తి పురస్కార గ్రహీత ఆమె. తమిళనాడుకు చెందిన మాళవిక పదమూడేళ్ల వయస్సులోనే అర చేతులు కోల్పోయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి మోటివేషనల్ స్పీకర్‌గా ఎదిగారు. సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ పొంది దివ్యాంగులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. డిసెంబరు 3న ‘వరల్డ్ డిసబిలిటీ డే’ సందర్భంగా శారీరక వైకల్యం ఉన్న వారి పట్ల సమాజం అనుసరించాల్సిన తీరును సోషల్ మీడియాలో ప్రస్తావించారు. నిజంగా శాపగ్రస్తురాలే..! ‘ఇది పదిహేడేళ్ల క్రితం నాటి మాట. నా రెండు చేతులు రక్తపు మడుగులో మునిగిపోయినపుడు నేను అంతగా ఏడ్వలేదు. డాక్టర్లు నా చేతుల్లో ఇనుప రాడ్లు వేసినపుడు కూడా ఎక్కువ బాధ పడలేదు. కానీ ఆస్పత్రి బెడ్ మీద ఉన్నపుడు నా పక్కనున్న ఆడవాళ్లు మాట్లాడిన మాటలు విని వెక్కివెక్కి ఏడ్చాను. జనరల్ వార్డులో కొత్త అమ్మాయి చేరిందట. తను నిజంగా శాపగ్రస్తురాలే. ఇక తన జీవితం ముగిసిపోయినట్లే అంటూ నా గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అప్పుడే మొదటిసారిగా నా కళ్ల నుంచి ధారాపాతంగా కన్నీళ్లు కారాయి. బాంబు పేలుడులో అర చేతులు కోల్పోయిన నాకు భవిష్యత్తే లేదన్నట్లుగా వారు మాట్లాడారు. ఆ మాటలను అంగీకరించడానికి నా హృదయం అప్పుడు సిద్ధంగానే ఉంది. అయితే నా కుటుంబం, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహం నాలో కొత్త ఉత్సాహం నింపింది. వారి చొరవతోనే నేనింత వరకు రాగలిగాను. నిజానికి దివ్యాంగుల పట్ల సమాజం స్పందించే తీరు సరిగా లేదు. ప్రతి ఒక్కరికీ అటిట్యూడ్ ప్రాబ్లం ఉంటుందని’ మాళవిక చెప్పుకొచ్చారు. అదే పెద్ద శాపం.. ‘నిజానికి మానసిక వైకల్యమే అన్నింటి కంటే పెద్ద శాపం. ఎదుటివారిని ప్రోత్సహించకపోయినా ఫర్వాలేదు కానీ నిరాశ చెందేలా మాట్లాడకూడదు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 26.8 మంది దివ్యాంగులు ఉన్నారు. మొత్తం జనాభాలో వీరిది 2.21 శాతం. ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి వంటి పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడే ముందు ప్రతీ ఒక్కరు దివ్యాంగుల పట్ల తాము ప్రవర్తిస్తున్న తీరు గురించి ఆలోచించుకోవాలి. వారిని సమాజంలో మమేకం చేసి.. ఉద్యోగ భద్రత కల్పించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలి. శారీరక వైకల్యం ఉంటే ఇక జీవితం ముగిసినట్లే అనే మాటలు మానుకోవాలి. దివ్యాంగులనంతా ఒక్కచోట చేర్చడం కాదు.. వారికి ఏమేం అవసరమో గుర్తించి... వాటిని సమకూర్చాలి. అలా చేసినపుడే సమాజంతో వారు కలిసిపోగలుగుతారు. లేదంటే ఆత్మన్యూనతా భావంతో కుంగిపోతారు. అందుకే బాల్యం నుంచే ప్రతీ ఒక్కరు వివక్ష లేకుండా పెరిగే వాతావరణం కల్పించాలి. విద్యా విధానంలోనూ మార్పులు రావాలి. శారీరక వైకల్యం ఉన్న వారిని చారిటీ వస్తువులుగా చూపకుండా... దివ్యాంగులైనప్పటికీ సమాజంలో ఉన్నత స్థితికి చేరిన వారి గురించి పాఠ్యాంశంలో బోధించాలి. ఒకరిపై ఆధారపడకుండా.. సొంతంగా తమ పనులు తాము చేసుకునేలా తీర్చిదిద్దాలి. సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సాహం అందించాలి. సానుకూల దృక్పథం నెలకొనేలా సినిమాలు నిర్మించాలి. చేతులు, కాళ్లు లేకుంటే పెళ్లి కాదు. ఇక జీవితమే ఉండదు అనే పిచ్చి నమ్మకాలను తొలగించాలి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న దివ్యాంగులకు సమాజం పట్ల, తమ సమస్యల పట్ల ఒక అవగాహన ఏర్పడింది. తమ హక్కులకే గళాన్ని గట్టిగా వినిపించగలుగుతున్నారు. అయితే వారికి ప్రజాప్రతినిధుల, రాజకీయ నాయకుల అవసరం ఎంతగానో ఉంది. దివ్యాంగులను సమాజం నిండు మనస్సుతో ఆలింగనం చేసుకోవాలనేదే నా కల. ఆ దిశగా వడివడిగా అడుగులు పడాలి’ అని మాళవిక ఆకాంక్షించారు. గ్రానైడ్ పేలడంతో... మాళవిక అయ్యర్ తమిళనాడులోని కుంభకోణంలో క్రిష్ణన్- హేమా క్రిష్ణన్ దంపతులకు జన్మించారు. తండ్రి వాటర్ వర్క్స్‌లో ఇంజనీరుగా పనిచేసిన క్రమంలో ఆమె బాల్యం రాజస్తాన్‌లోని బికనీర్‌లో గడిచింది. అక్కడ ఉన్నపుడే ఓ రోజు తమ గ్యారేజీలో ఆడుకుంటున్న సమయంలో గ్రానైడ్ చేతుల్లో పేలి రెండు అరచేతులు పోయాయి. ఆ తర్వాత ఆమెను చెన్నైలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్క్రైబ్ సహాయంతో పరీక్షలు రాస్తూ మాళవిక తన విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు(ప్రైవేటు పరీక్ష) సంపాదించి ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రశంసలు పొందారు. అనంతరం ఉన్నత విద్య కోసం ఢిల్లీకి చేరకున్న మాళవిక... ఎకనమిక్స్ హానర్స్ చదివారు. అదే విధంగా సోషల్ వర్క్‌లో పీహెచ్డీ చేసి డాక్టరేట్ సంపాదించారు. 2013 నుంచి మోటివేషనల్ స్పీకర్‌గా మారి ఎంతోమందిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. వివిధ దేశాల్లో ప్రసంగాలు చేసిన మాళవిక.. సమాజ తీరు, మహిళలు, దివ్యాంగులపై వివక్ష వంటి అంశాలపై ఐక్యరాజ్యసమితిలోనూ తన గళాన్ని వినిపించారు. ఈ క్రమంలో ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా అత్యున్నత మహిళా పురస్కారం నారీ శక్తి పురస్కార్‌తో సత్కరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. ఇదే కాదు మరెన్నో పురస్కారాలను మాళవిక అందుకున్నారు. 17 years ago, when I was lying on the hospital bed, I heard a bunch of women whisper, “Did you see that new girl in the general ward? What a shame! She must be cursed as now her life has now come to an end.”#WorldDisabilityDay #InternationalDisabilityDay #IDPD2019 #Disability pic.twitter.com/P9ZhWDslIK — Dr. Malvika Iyer (@MalvikaIyer) December 3, 2019 -
సానుభూతి కాదు... సహానుభూతి కావాలి!
ఓ వారం పది రోజుల క్రితం అనుకుంటా... యద్దనపూడి సులోచనా రాణిగారు ఫోన్ చేసి, ‘వెంకటేష్ అనే కుర్రాడు ఉన్నాడు... తెలుగు భాషపై మంచి పట్టుంది, అద్భుతంగా రాస్తాడు. పిల్లాడు చూడలేడనే కానీ... ప్రపంచాన్ని చదివాడు, కాస్త ఎంకరేజ్ చేయమ్మా’ అన్నారు. రెండు రోజుల తర్వాత వెంకటేష్ నన్ను కలిశాడు. తను నన్ను కలిశాడు అనేకంటే... నేను తనని కలిశాననడం సబబేమో! జీవితంలో తనకు ఎదురైన తీపి అనుభూతుల నుంచి చేదు అనుభవాల దాకా, సాహిత్యం నుంచి సంగీతం దాకా, జీవితంలో ఇష్టమైన వ్యక్తుల నుంచి నటీనటుల దాకా, వికలాంగులు ఎదుర్కొనే సమస్యల నుంచి పరిష్కారాల దాకా... ఇందుగలడందు లేడన్నట్టు, అన్నిటి గురించీ అనర్గళంగా మాట్లాడాడు. తన మాటల్లోనే... ‘‘చాలామంది వైకల్యాన్ని ఒక వ్యాధిలా, అంగవికలురిని ఆధారపడేవారిగా చూస్తుంటారు. కొందరైతే ఎగతాళి కూడా చేస్తారు. ఇక కొన్ని సినిమాల్లో అయితే మమ్మల్ని హాస్యాస్పదంగా కూడా చూపిస్తుంటారు. అది మమ్మల్ని చాలా బాధపెడుతుంది. ఎందుకంటే, మాకు కళ్లు లేవనే గానీ అందరిలానే వివేచన ఉంది, మనసూ పని చేస్తుంది. అలానే, నడవలేని వాళ్లక్కూడా కాళ్లు ఉండవనేగానీ... ప్రపంచాన్ని చూడగలిగే శక్తి ఉంది, ఆలోచించగలిగే యుక్తి ఉంది. ఒక్క విషయంలో తక్కువైనంత మాత్రాన మమ్మల్ని అన్ని విషయాల్లో తక్కువగా ఎందుకు చూడాలి? మేమంతా డిజేబుల్డ్ కాదు... డిఫరెంట్లీ ఏబుల్డ్! మాక్కావాల్సింది సానుభూతి కాదు... సహానుభూతి! మాకు కాసింత ప్రోత్సాహాన్నిస్తే చాలు, కొండంత లక్ష్యాన్నయినా అందుకుంటాం! ఒకటే ఏంటంటే... విదేశాల్లో ఉన్నట్టుగా మన దేశంలో వికలాంగులకు సౌకర్యాలు అంతగా లేవు. స్కూళ్ల దగ్గర్నుంచి ప్రభుత్వాఫీసుల వరకూ మెట్లు ఉండే ప్రతిచోటా ర్యాంప్ ఉండటం, పట్టుకుని నడిచేందుకు రాడ్స్ ఉండటం, ప్రభుత్వ బస్సులు, రైళ్లలో సరిపడినన్ని సీట్లు, వికలాంగులకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు... ఇలా మాకంటూ కొన్ని అదనపు సదుపాయాలను ఇక్కడ మన ప్రభుత్వం కూడా కల్పిస్తే... మా జీవితం కాస్తంత సాఫీగా సాగుతుంది. అయితే, ఇది మాత్రమే చాలదు. ఈ సౌకర్యాలతో పాటు ప్రభుత్వం కొన్ని ప్రత్యేక విధివిధానాలను కూడా రూపొందించాలి. వాటిని ప్రజలు చిత్తశుద్ధితో పాటించాలి. అదే కనుక జరిగితే... అసలు మాకు ఇలాంటి స్పెషల్ రోజొకటి అవసరమే లేదు, మేము ఎవరిమీదా ఆధారపడాల్సిన అవసరమూ ఉండదు. ఇక నా అభిరుచుల విషయానికొస్తే... నాకు చిన్నతనం నుంచి తెలుగు భాష పట్ల మక్కువ కలగడానికి కారణం - మా సోషల్ టీచర్ సుభాష్‌గారు. పాక్షికంగా చూపు లేకపోయినా కూడా, ఆయన రోజూ నాకోసం న్యూస్ పేపర్ చదివి వినిపించేవారు. ఆ తరువాత మా తెలుగు టీచర్ రాముగారు... ఆయన వల్లే నాకు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి ఏర్పడింది. ఇక ఇంటర్లో తెలుగు లెక్చరర్ కృష్ణమూర్తిగారు... భాషపై నాకున్న అభిమానాన్ని గుర్తించి, హైదరాబాద్ వెళ్లి యూనివర్సిటీలో చదువుకోమని ప్రోత్సహించి, ముందుకు నడిపించారు. ఇక, యూనివర్సిటీలో అటెండ్ అయిన సెమినార్లు, చదివిన పుస్తకాలు నా భాషాపరిజ్ఞానాన్ని, ప్రపంచాన్ని విస్తరింపచేశాయి. నార్ల వెంకటేశ్వరరావు గారి రచనలు నాకెంత స్ఫూర్తినిచ్చాయంటే... రచయితని కావాలనే సంకల్పం నాలో మొదలైంది. ఎప్పటికైనా పీహెచ్డీ చేయాలని, డాక్టరేట్ తీసుకోవాలఐన్నది నా కోరిక.’’ ... ఇలా వెంకటేష్ బోలెడు మాటలతో పాటు పాటల్ని, కొన్ని కవితల్ని, రచనల్ని కూడా వినిపించాడు. అవి విన్నాక, తన టాలెంట్ చూశాక... తన రచనలను సాక్షిలో తప్పకుండా ప్రచురిస్తామని హామీ ఇచ్చి పంపించాను. అయితే, తను వెళ్లిపోయిన తరువాత... ఫ్లోలో తను క్యాజువల్‌గా అన్న ఓ మాట మనసులో మెదిలింది... ‘‘నాకు ఏదో ఒక రోజు తెలుగు న్యూస్ పేపర్‌కి ఎడిటర్ని అవ్వాలని ఉంది’’ అన్నది. దగ్గర్లోనే ప్రపంచ వికలాంగుల దినం ఉందని గుర్తుకు రావడంతో, ఆ రోజు తనని గెస్ట్ ఎడిటర్‌గా తీసుకొచ్చి, ఆ కోరిక తీరిస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. ఆ ఆలోచనా ఫలితమే... నేటి స్పెషల్ ఫ్యామిలీ ఎడిషన్! వెంకటేష్‌కి నచ్చిన, వెంకటేష్ మెచ్చిన ఆర్తితో నిండిన స్ఫూర్తిదాయక కథనాలు మీకోసం... -ఇందిర పరిమి, ఫీచర్స్ ఎడిటర్