సానుభూతి కాదు... సహానుభూతి కావాలి! | World Disability Day Special, No sympathy.. Need empathy | Sakshi
Sakshi News home page

సానుభూతి కాదు... సహానుభూతి కావాలి!

Published Tue, Dec 3 2013 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM

World Disability Day Special, No sympathy.. Need empathy

ఓ వారం పది రోజుల క్రితం అనుకుంటా... యద్దనపూడి సులోచనా రాణిగారు ఫోన్ చేసి, ‘వెంకటేష్ అనే కుర్రాడు ఉన్నాడు... తెలుగు భాషపై మంచి పట్టుంది, అద్భుతంగా రాస్తాడు. పిల్లాడు చూడలేడనే కానీ... ప్రపంచాన్ని చదివాడు, కాస్త ఎంకరేజ్ చేయమ్మా’ అన్నారు.
 
రెండు రోజుల తర్వాత వెంకటేష్ నన్ను కలిశాడు. తను నన్ను కలిశాడు అనేకంటే... నేను తనని కలిశాననడం సబబేమో! జీవితంలో తనకు ఎదురైన తీపి అనుభూతుల నుంచి చేదు అనుభవాల దాకా, సాహిత్యం నుంచి సంగీతం దాకా, జీవితంలో ఇష్టమైన వ్యక్తుల నుంచి నటీనటుల దాకా, వికలాంగులు ఎదుర్కొనే సమస్యల నుంచి పరిష్కారాల దాకా... ఇందుగలడందు లేడన్నట్టు, అన్నిటి గురించీ అనర్గళంగా మాట్లాడాడు. తన మాటల్లోనే...
 
‘‘చాలామంది వైకల్యాన్ని ఒక వ్యాధిలా, అంగవికలురిని ఆధారపడేవారిగా చూస్తుంటారు. కొందరైతే ఎగతాళి కూడా చేస్తారు. ఇక కొన్ని సినిమాల్లో అయితే మమ్మల్ని హాస్యాస్పదంగా కూడా చూపిస్తుంటారు. అది మమ్మల్ని చాలా బాధపెడుతుంది. ఎందుకంటే, మాకు కళ్లు లేవనే గానీ అందరిలానే వివేచన ఉంది, మనసూ పని చేస్తుంది. అలానే, నడవలేని వాళ్లక్కూడా కాళ్లు ఉండవనేగానీ... ప్రపంచాన్ని చూడగలిగే శక్తి ఉంది, ఆలోచించగలిగే యుక్తి ఉంది. ఒక్క విషయంలో తక్కువైనంత మాత్రాన మమ్మల్ని అన్ని విషయాల్లో తక్కువగా ఎందుకు చూడాలి? మేమంతా డిజేబుల్డ్ కాదు... డిఫరెంట్లీ ఏబుల్డ్! మాక్కావాల్సింది సానుభూతి కాదు... సహానుభూతి! మాకు కాసింత ప్రోత్సాహాన్నిస్తే చాలు, కొండంత లక్ష్యాన్నయినా అందుకుంటాం!
 
ఒకటే ఏంటంటే... విదేశాల్లో ఉన్నట్టుగా మన దేశంలో వికలాంగులకు సౌకర్యాలు అంతగా లేవు. స్కూళ్ల దగ్గర్నుంచి ప్రభుత్వాఫీసుల వరకూ మెట్లు ఉండే ప్రతిచోటా ర్యాంప్ ఉండటం, పట్టుకుని నడిచేందుకు రాడ్స్ ఉండటం, ప్రభుత్వ బస్సులు, రైళ్లలో సరిపడినన్ని సీట్లు, వికలాంగులకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు... ఇలా మాకంటూ కొన్ని అదనపు సదుపాయాలను ఇక్కడ మన ప్రభుత్వం కూడా కల్పిస్తే... మా జీవితం కాస్తంత సాఫీగా సాగుతుంది. అయితే, ఇది మాత్రమే చాలదు. ఈ సౌకర్యాలతో పాటు ప్రభుత్వం కొన్ని ప్రత్యేక విధివిధానాలను కూడా రూపొందించాలి. వాటిని ప్రజలు చిత్తశుద్ధితో పాటించాలి. అదే కనుక జరిగితే... అసలు మాకు ఇలాంటి  స్పెషల్ రోజొకటి అవసరమే లేదు, మేము ఎవరిమీదా ఆధారపడాల్సిన అవసరమూ ఉండదు.
 
ఇక నా అభిరుచుల విషయానికొస్తే... నాకు చిన్నతనం నుంచి తెలుగు భాష పట్ల మక్కువ కలగడానికి కారణం - మా సోషల్ టీచర్ సుభాష్‌గారు. పాక్షికంగా చూపు లేకపోయినా కూడా, ఆయన రోజూ నాకోసం న్యూస్ పేపర్ చదివి వినిపించేవారు. ఆ తరువాత మా తెలుగు టీచర్ రాముగారు... ఆయన వల్లే నాకు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి ఏర్పడింది. ఇక ఇంటర్‌లో తెలుగు లెక్చరర్ కృష్ణమూర్తిగారు... భాషపై నాకున్న అభిమానాన్ని గుర్తించి, హైదరాబాద్ వెళ్లి యూనివర్సిటీలో చదువుకోమని ప్రోత్సహించి, ముందుకు నడిపించారు. ఇక, యూనివర్సిటీలో అటెండ్ అయిన సెమినార్లు, చదివిన పుస్తకాలు నా భాషాపరిజ్ఞానాన్ని, ప్రపంచాన్ని విస్తరింపచేశాయి. నార్ల వెంకటేశ్వరరావు గారి రచనలు నాకెంత స్ఫూర్తినిచ్చాయంటే... రచయితని కావాలనే సంకల్పం నాలో మొదలైంది. ఎప్పటికైనా పీహెచ్‌డీ చేయాలని, డాక్టరేట్ తీసుకోవాలఐన్నది నా కోరిక.’’
 
... ఇలా వెంకటేష్ బోలెడు మాటలతో పాటు పాటల్ని, కొన్ని కవితల్ని, రచనల్ని కూడా వినిపించాడు. అవి విన్నాక, తన టాలెంట్ చూశాక...  తన రచనలను సాక్షిలో తప్పకుండా ప్రచురిస్తామని హామీ ఇచ్చి పంపించాను. అయితే, తను వెళ్లిపోయిన తరువాత... ఫ్లోలో తను క్యాజువల్‌గా అన్న ఓ మాట మనసులో మెదిలింది... ‘‘నాకు ఏదో ఒక రోజు తెలుగు న్యూస్ పేపర్‌కి ఎడిటర్‌ని అవ్వాలని ఉంది’’ అన్నది. దగ్గర్లోనే ప్రపంచ వికలాంగుల దినం ఉందని గుర్తుకు రావడంతో, ఆ రోజు తనని గెస్ట్ ఎడిటర్‌గా తీసుకొచ్చి, ఆ కోరిక తీరిస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. ఆ ఆలోచనా ఫలితమే... నేటి స్పెషల్ ఫ్యామిలీ ఎడిషన్!


 వెంకటేష్‌కి నచ్చిన, వెంకటేష్ మెచ్చిన ఆర్తితో నిండిన స్ఫూర్తిదాయక కథనాలు మీకోసం...
 -ఇందిర పరిమి, ఫీచర్స్ ఎడిటర్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement