![Venkatesh Talk About Sankranthiki Vasthunam Movie At Success Meet](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/sankranthiki-vastunam.jpg.webp?itok=KebmaokI)
‘‘నేను రికార్డుల గురించి ఆలోచించను. ప్రేక్షకులు సినిమాలను ఆస్వాదించాలి. ఐదు పదేళ్లుగా థియేటర్స్‌లో సినిమాలు చూడనివాళ్లు కూడా థియేటర్స్‌కు వెళ్లి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చూశారు. థియేటర్స్ రీ ఓపెనింగ్ జరిగి, అక్కడ కూడా మా సినిమాను ఆడియన్స్ చూశారంటే... ఇది చాలా మంచి సెలబ్రేషన్. అనిల్ అద్భుతమైన వర్క్ చేశాడు. 2027లో మళ్లీ సంక్రాంతికి వస్తాం’’ అని వెంకటేశ్(Venkatesh ) అన్నారు.
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని చిత్రయూనిట్ పేర్కొంది.
ఈ సందర్భంగా సోమవారం ‘సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వేడుక’ పేరిట నిర్వహించిన వేడుకలో వెంకటేశ్ మాట్లాడతూ– ‘‘దేవుడా... ఓ మంచి దేవుడా... 1986లో యాక్సిడెంటల్‌గా ఇండస్ట్రీకి వచ్చాను. అడక్కుండానే ‘కలియుగ ΄పాండవులు’ ఇచ్చావ్. ఆ తర్వాత కూడా చాలా హిట్స్ ఇచ్చావ్. మధ్యలో నేను అడగకుండానే ‘చంటి’లాంటి సినిమా ఇచ్చి, అదొక బ్లాక్‌బస్టర్ చేశావ్. దాని తర్వాత అడిగినా అడగకపోయినా.. ప్రేమించుకుందాం రా, ఆడవాళ్ళు..., సీతమ్మ వాకిట్లో.., గణేష్, లక్ష్మీ, తులసీ, రాజా... ఇలా ఎన్నో ఇచ్చావ్.
2000లో ‘కలిసుందాం..రా’ వంటి హిట్ ఇచ్చావ్... నేను అడగలేదు... నువ్వు ఇస్తూనే ఉన్నావ్. ఈసారి 2025లో ఏం అడగకుండానే ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ ఇచ్చావ్. నా ఊహకు మించి జరిగిపోయింది. అభిమానులు, ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్, ఇండస్ట్రీలో ఉన్న అందరూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఈ సినిమాతో అసోసియేట్ అయిన అందరికీ, సినిమా లవర్స్‌కు థ్యాంక్స్. వెంకీ... ఓ క్లీన్ ఎంటర్‌టైనర్ చేస్తే పెద్ద విజయం సాధిస్తుందని మా గురువు రాఘవేంద్రరావుగారు చెప్పారు. ఆయన ఊహ నిజమైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బాగా పాల్గొన్నాను.. డ్యాన్స్‌లు చేశాను. ఈ ప్రభావం నా కాలుపై పడింది. ఇక ఉంటాను’’ అన్నారు.
ముఖ్య అతిథి దర్శకుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో ‘వి’ ఫర్ విక్టరీ’ వెంకటేశ్ సొంతమైంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’... ఇండస్ట్రీకి సంక్రాంతినిచ్చింది. ‘దిల్’ రాజు, అనిల్ కాంబినేషన్‌లోని ప్రతి సినిమా హిట్’’ అన్నారు. ‘‘రూ. 300 కోట్ల గ్రాస్. నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్‌కు ముందు నేను కానీ, తీసిన రాజుగారు కానీ, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్... ఇలా ఎవరికీ ఈ సినిమా ఇంత స్థాయిలో కలెక్ట్ చేస్తుందన్న విషయం అంతు చిక్కి ఉండదు’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘ఈ సినిమా యూనిట్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్... ఇలా అందరికీ థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు శిరీష్.
ఈ వేడుకలో దర్శకులు వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, వశిష్ఠ ముఖ్య అతిథులుగా పాల్గొని, సినిమా విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’ యూనిట్‌కు షీల్డ్స్ ప్రదానం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment