‘జబర్థస్త్ కామెడీ’ట్రోలింగ్‌పై స్పందించిన అనిల్ రావిపూడి
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ శాతం చాలా తక్కువ. వరుస హిట్లను అందించిన దర్శకులు చాలా అరుదు. టాలీవుడ్‌లో అయితే రాజమౌళి తర్వాత కెరీర్‌లో ఒక్క ప్లాఫ్ లేని దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi ) మాత్రమే. ఆయన దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తి అయ్యాయి. ఈ పదేళ్లలో ఏనిమిది సినిమాలు తెరకెక్కిస్తే ప్రతిదీ సూపర్ హిట్ టాక్‌నే సంపాదించుకుంది.
ఇక ఈ సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam) సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. వారం రోజుల్లో రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టించింది. ఎఫ్ 2 మొదలుకొని చివరి 5 సినిమాలు 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. అయినా కూడా అనిల్ రావిపూడిపై కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన సినిమాల్లో ఉండే కామెడీ ‘జబర్థస్త్’ కామెడీ షోని గుర్తు చేస్తుందని కొంతమంది విమర్శిస్తుంటారు. తాజాగా ఈ విమర్శలపై అనిల్ రావిపూడి స్పందించాడు. గత పదేళ్లుగా తన సినిమాలను ‘జబర్థస్త్ కామెడీ’ షోతో పోలుస్తూనే ఉన్నారని.. సినిమా ప్రేక్షకులే వారికి సమాధానం చెబుతున్నారని కాస్త వ్యంగ్యంగా చెప్పారు.
‘నా సినిమాల్లో జబర్దస్త్ టైపు స్కిట్స్ ఉంటాయని కొంతమంది అంటుంటారు. అలా అనేవాళ్లు పది శాతం ఉంటే.. 90 శాతం మంది నా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. గత పదేళ్లుగా కొంతమంది నా సినిమాలను విమర్శిస్తూనే ఉన్నారు. నాకు అలవాటైపోయింది. అందుకే నేను వాళ్లను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నా. ఆడియన్సే వాళ్లకు సమాధానం చెబుతున్నారు. ఒకవేళ వాళ్లు అన్నదే నిజమైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా వారం రోజుల్లో 200 కోట్లను రాబట్టదు. ఎవరో ఏదో అంటున్నారని నేను నా పంథాను మార్చుకోను. ఇలానే సినిమాలు చేస్తాను. నాకు ఆడియన్స్ తోడుగా ఉన్నారు. నా సినిమాలను ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
ఎలాంటి వల్గారిటీ లేకుండా సినిమాలను చేస్తున్నాను. కామెడీ కోసం కూడా బూతు పదాలను వాడట్లేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజు చేత కూడా కొంతవరకు మాత్ర బూతులు తిట్టించాను. అది కూడా ఓ మంచి సందేశం ఇవ్వడం కోసమే. ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసి పిల్లలు ఎలా చెడిపోతున్నారనేది ఈ సినిమాలో చూపించాం. దాని కోసమే చిన్న చిన్న బూతు పదాలు వాడం.అంతకు మించి నా సినిమాల్లో బోల్డ్ కంటెంట్ అనేది ఉండదు. ఇకపై కూడా కామెడీ సినిమాలను చేస్తాను.ప్రతి శుక్రవారం ఏ సినిమా రిలీజ్ అయినా ఆ థియేటర్లో ఉంటా. నాకంటే సినిమా బాగా తీస్తే నేర్చుకుంటా, నేను తప్పులు చేస్తే సరిద్దుకుంటా. ఇక ముందు నేను తీసే సినిమాల జర్నీ కూడా ఇలానే ఉంటుంది’ అని అనిల్ రావిపూడి అన్నారు.
కాగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. విక్టరీ వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్లోంది. విడుదలైన ఎనిమిది రోజుల్లో 218 కోట్ల గ్రాస్ వసూళ్లను సంపాదించి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment