deaf woman
-
Mia Le Roux: ఈ అందం వినిపిస్తోందా?
‘సమాజం ఎడంగా ఉంచే దివ్యాంగులకు ఇదెంత ముఖ్యమైన గెలుపో నాకు తెలుసు. అనూహ్యమైన కలలు కని వాటిని సాధించవచ్చని ఇవాళ నేను నిరూపించాను. దివ్యాంగుల పట్ల ఈ భూగ్రహంలో ఉన్న ఆంక్షల సరిహద్దులను నేను బద్దలు కొట్టాను’ అని హర్షధ్వానాల మధ్య అంది మియా లే రూ. 28 ఏళ్ల బధిర వనిత మియా లే 66 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాఫ్రికా అందాల పోటీలో కిరీటం ధరించిన తొలి బధిర మహిళగా చరిత్ర సృష్టించింది. ఆమె ఈ పోటీలో గెలిచినందుకుగాను సంవత్సరం పాటు నివసించడానికి ఒక ఖరీదైన ఫ్లాటు, లగ్జరీ బెంజి కారు, సుమారు 50 లక్షల రూపాయల నగదు, ఇంకా అనేక బహుమతులు దక్కాయి. శనివారం (ఆగస్టు 10) రాత్రి దక్షిణాఫ్రికాలోని పాలనా రాజధాని ప్రిటోరియాలో జరిగిన ఫైనల్స్‌లో ఈ ఘనత సాధించింది.పుట్టుకతో చెవుడుఫ్రెంచ్ మూలాలున్న మియా లే కుటుంబం తరాల ముందు వచ్చి సౌత్ ఆఫ్రికాలో స్థిరపడింది. మియా పుట్టాక సంవత్సరం తర్వాత ఆమెకు పూర్తిచెవుడు ఉన్నట్టు గ్రహించారు తల్లిదండ్రులు. కొన్నేళ్ల తర్వాత కాక్లియర్ ఇంప్లాంట్స్ వేసి రెండు సంవత్సరాల పాటు స్పీచ్‌థెరపీ ఇస్తే తప్ప ఆమె మొదటి మాట మాట్లాడలేదు. ఆ తర్వాత కూడా ఆమె మాట స్పష్టం కాలేదు. ఆమెకు ఇప్పటికీ వినపడదు. ‘నా కాక్లియర్ ఇంప్లాంట్స్‌ను ఆధునిక సాఫ్ట్వేర్ ద్వారా అనుసంధానం చేసుకున్నాను. అందువల్ల పెదవుల కదలికను బట్టి కొద్దిగా వినపడే ధ్వనిని బట్టి ఎదుటివారి మాటలు అర్థం చేసుకుంటాను. గుంపులో ఉండి నాతో మాట్లాడితే నాకు ఏమీ అర్థం కాదు. అందరి శబ్దాలు కలిసి నాకు స్పష్టత ఉండదు’ అంటుంది మియా లే. మోడల్‌గా, మార్కెటింగ్ రంగ నిపుణురాలిగా పని చేస్తున్న ఈమె అందాలపోటీలో విజేతగా నిలవాలని కలగని, సాధించింది.నల్లరంగు–తెల్లరంగుసౌత్ ఆఫ్రికా అందాల కిరీటం కోసం నల్ల అందగత్తె చిడిమ్మ అడెస్ట్షినా పోటీ పడింది. ఆమెకు సౌత్ ఆఫ్రికాలో గొప్ప ఫాలోయింగ్ ఉంది. అయితే ఆమె పౌరసత్వం మీద వివాదం నెలకొంది. ఆమె నైజీరియా తండ్రికీ, మొజాంబిక్ తల్లికీ జన్మించిందని ట్రోల్స్ మొదలయ్యాయి. దాంతో విజయం అంచు వరకూ చేరిన చిడిమ్మ పోటీ నుంచి తప్పుకుంది. దాంతో మియా గెలుపు సులవు అయ్యింది. రంగును బట్టి మియా గురించి ఒకటి రెండు విమర్శలు వచ్చినా పోటీ నుంచి తప్పుకున్న చిడిమ్మ మనస్ఫూర్తిగా ఆమెను అభినందించింది. ‘నువ్వు మా అందరి కలలకు ప్రతినిధిగా నిలిచావు’ అని పోటీలో గెలిచిన మియాను చిడిమ్మ కొనియాడింది.నేనొక వారధిని‘దివ్యాంగులు సమాజంలో భాగం కావాలంటే ప్రభుత్వాలు పూనుకోవాలి. నాకొచ్చిన ఈ అందాల కిరీటంతో నేను దివ్యాంగులకు ప్రభుత్వానికి ఒక వారధి కాదలిచాను. చిన్నవయసు నుంచి దివ్యాంగులు అసాధ్యమైన కలలు గనే స్థయిర్యాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను’ అంది మియా లే రూ. -
International Disability Day: నిశ్శబ్ద విజయం
మాట వినకపోతే మాట పలకలేము. మాటతో నిండిన ఈ ప్రపంచంలో మాట లేకపోతే శూన్యతే. సోను ఆనంద్ శర్మ ఆ శూన్యత నుంచే బయలుదేరింది. పూర్తి బధిరత్వం వల్ల మాటకు కూడా దూరమైన సోను ఈ ప్రపంచంతో బ్యాట్‌తోనే మాట్లాడాలనుకుంది. బధిర బాడ్మింటన్ క్రీడాకారిణిగా సోనువి ఘన విజయాలు. ఆ తర్వాత కోచ్‌గా మారి దేశానికి ఎందరో క్రీడాకారులనిచ్చింది. కాని ఇదంతా సులభమా? బధిరత్వం ఉంటే ఇన్ని ఆటంకాలా? దివ్యాంగుల గెలుపు కథల్లో సోను కథ ముఖ్యమైనది. ‘పూర్తిగా వినపడకపోతే ఏమవుతుందో తెలుసా?’ అని అడుగుతుంది సోను ఆనంద్ శర్మ. పూర్తిగా వినపడని వారు దానికి పూర్తి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే పూర్తిగా వినపడని వారికే ఆ బాధ తీవ్రత తెలుస్తుంది. ‘వినడం వల్లే భాష మాట్లాడతాం. వాక్యాన్ని నిర్మిస్తాం. గ్రామర్ నేర్చుకుంటాం. పూర్తి వాక్యం రాస్తాం. పూర్తిగా వినపడకపోతే మీరు మాట్లాడలేరు. రాయలేరు. గ్రామర్‌తో సరిగ్గా రాయలేరు’ అంటుందామె. 47 ఏళ్ల సోను ఆనంద్ శర్మ ‘డెఫ్లింపిక్స్’ (బధిరులకు జరిగే ఒలింపిక్స్)లో బాడ్మింటన్ క్రీడాకారిణిగా ఈ దేశానికి పతకాలు తెచ్చింది. ఆ తర్వాత కోచ్‌గా మారి శిష్యులను తయారు చేసి పతకాలను తెస్తోంది. అయినప్పటికీ ఆమె ఒక బధిరురాలిగా వివక్ష ఎదుర్కొంటూనే ఉంది. ‘ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తే ప్రభుత్వం పది లక్షలు ఇస్తుంది. బధిరుల ఒలింపిక్స్‌లో నేను పతకాలు సాధించాను. నా మెడల్స్ కూడా అంతకు సమానమే. అయినా నాకు డబ్బు రాలేదు’ అంటుందామె. అంతే కాదు... క్రీడాకారుల పెన్షన్లు, నజరానాలు అన్నీ కూడా అన్నీ సవ్యంగా ఉన్నవారికే. దివ్యాంగులకు వివక్షే. ‘అయినా సరే నేను నా దేశం కోసం పని చేస్తూనే ఉంటాను’ అంటుంది సోను. సైన్ లాంగ్వేజ్ ఎక్కడ? సోను ఆనంద్ శర్మది న్యూఢిల్లీ. పుట్టు బధిరురాలు. క్లాసుకు వెళితే టీచర్లకు సైన్ లాంగ్వేజ్ వచ్చేది కాదు. ఈమెకు పాఠాలు వినపడేవి కావు. ‘మన దేశంలో ఆరున్నర కోట్ల మంది పూర్తి బధిరులు లేదా పాక్షిక బధిరులు. వారిలో 50 లక్షల మంది పిల్లలు. అయినా మన దేశంలో కేవలం 700 స్కూళ్లలోనే సైన్ లాంగ్వేజ్‌లో చదువు చెప్తారు. సైన్ లాంగ్వేజ్‌ను అధికారిక భాషగా ప్రకటిస్తే సమస్య చాలామటుకు తీరుతుంది. కాని ప్రకటించరు. చదువు రాకపోతే బధిరులు జీవితాంతం ఇబ్బంది పడుతూనే ఉండాలి’ అంటుందామె. ఇప్పుడు ఆమె ఢిల్లీ టూరిజంలో ఉద్యోగం చేస్తుంది. మొత్తం డిజిటల్ కమ్యూనికేషనే జరుగుతుంది. సోను కమ్యూనికేట్ చేస్తుంది కాని భాష మెరుగ్గా ఉండదు. ‘అందుకని నన్ను ఒకలా చూస్తారు కొలీగ్స్’ అంటుందామె. 10 ఏళ్ల వయసు నుంచి పాఠాలు అర్థం కాకపోవడం వల్ల సోను బాడ్మింటన్తో ఆ వెలితి పూడ్చుకోవాలని అనుకుంది. ‘కాని మాకు మంచి కోచ్‌లు దొరికేవారు కాదు. కోచ్‌లు దొరికినా వారి దృష్టి నార్మల్ ఆటగాళ్ల మీద ఉండేది. బధిరుల మీద ఫోకస్ ఉండేది కాదు. అందుకని నన్ను నేను నమ్ముకున్నాను. రోజూ ఉదయం నుంచి రాత్రి దాకా ప్రాక్టీసు చేసేదాన్ని. మాది మధ్యతరగతి కుటుంబం. స్కూటర్ కూడా లేదు. బస్‌లో కోర్టుకు తిరుగుతుంటే మా తల్లిదండ్రులు భయపడేవారు... ఆడపిల్లనని... మాటలు రావని. మా నాన్న ఆఫీస్ నుంచి వచ్చి నా కోసం నేను ప్రాక్టీసు చేసే చోట కాచుకుని కూచునేవాడు’ అని గుర్తు చేసుకుంది సోను. ఆ శ్రమ వృథా పోలేదు. 1997 సమ్మర్ డెఫ్లింపిక్స్ నుంచి 2009 సమ్మర్ డెఫ్లింపిక్స్ వరకూ దేశం తరఫున ఆడి పతకాల పంట పండించింది సోను ఆనంద్ శర్మ. 2014 నుంచి కోచ్ శిష్యుల ద్వారా పతకాలు తెచ్చి పెడుతోంది. బధిర బాడ్మింటన్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జెర్న్లిన్ అనిక ఈమె శిష్యురాలే. ‘దివ్యాంగులను తక్కువ అంచనా వేయొద్దు. వారి సామర్థ్యాల పై సానుభూతి వద్దు. మమ్మల్ని గ్రహాంతర వాసుల్లా చూడొద్దు. మీలాగే సాటి మనుషులుగా చూడండి’ అంటుంది సోను శర్మ. వారికి అనువుగా సమాజం మారాలి. వారి కోసం కూడా ఈ సమాజం ఉంది. వారి సమాన వాటాను ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకుందాం. -
ధైర్యం... ఆమె మనసు మాట విన్నది..
Miss Deaf Asia 2018 Winner Nishtha Dudeja: ఈ అమ్మాయికి చిన్ననాటి నుంచి వినికిడి లోపం ఉందని చెబితే ఎవ్వరైనా జాలిపడతారు. కానీ, ఈ అమ్మాయే మిస్ డెఫ్ ఆసియా 2018 టైటిల్ విజేత, మిస్ అండ్ మిస్టర్ డెఫ్ ఇండియా పోటీ లో ఢిల్లీ నుంచి ప్రాతినిథ్యం వహించింది. 18 సంవత్సరాల మిస్ అండ్ మిస్టర్ డెఫ్ వరల్డ్ పోటీల్లో భారతదేశం నుంచి టైటిల్ గెలుచుకున్న మొదటి ప్రతినిధి అని చెబితే ఆమె ధైర్యానికి, పట్టుదలకు ఫిదా అవకుండా ఉండరు. గ్లామర్ ప్రపంచంలో మోడల్‌గా రాణిస్తూ, క్రీడల్లోనూ ఎదిగిన 26 ఏళ్ల నిష్ఠా దూదెజా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న తీరు గురించి తెలుసుకోవాల్సిందే అనిపించక మానదు. నిష్ఠా దూదెజాకు చిన్ననాటి నుంచి వినికిడి సమస్య ఉంది. ఫలితంగా మనం అడిగిన దానికి సమాధానమివ్వలేదు. ఏదైనా చెప్పాల్సి వస్తే కాగితమ్మీద రాసిస్తుంది. లేదంటే ఫోన్లో టెక్స్›్ట మెసేజ్‌ల ద్వారా విషయం చెప్పేస్తుంది. మనం ఓ ప్రశ్న రాసిస్తే, ఆమె దానికి రాతపూర్వకంగానే సమాధానమిస్తుంది. కానీ, ఆమే గ్లామర్ ప్రపంచంలో విజయవంతమైన మోడల్‌గా రాణిస్తోంది. టెన్నిస్ క్రీడాకారిణి.. నిష్ఠా తన గురించి రాతపూర్వకంగా ఇచ్చిన తన మనసులోని మాటలు.. ‘12 ఏళ్ల వయసు నుంచి పదేళ్ల పాటు టెన్నిస్ క్రీడలో సాధన చేశాను. 2013, 2015, 2017 సంవత్సరాలలో బధిరుల ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొన్నాను. తీవ్రమైన దవడ కండరాల నొప్పులు రావడంతో వైద్యుల సూచన మేరకు కొన్నాళ్లు ఆ క్రీడకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అమ్మానాన్న తర్వాత టెన్నిస్ నాకు బెస్ట్ ఫ్రెండ్. అందుకే, పోటీలలో పాల్గొనలేకపోయినా టెన్నిస్‌ను పూర్తిగా వదులుకోలేదు. ఐదేళ్ల వయసు నుంచి జూడో ఆడటంలో సాధన చేశాను. ఏడేళ్లపాటు ఈ గేమ్‌లో రాణించాను’ అని తన గెలుపుకు వేసుకున్న బాట గురించి వివరిస్తుంది. అందాల పోటీలో మేటి మరిన్ని వివరాలను తెలియజేస్తూ– ‘టెన్నిస్ పోటీలో పాల్గొనలేనని అర్థమయ్యాక అంతకుమించి ఏదైనా చేయాలని ఆలోచించినప్పుడు మిస్ ఇండియా బ్లైండ్ గురించి తెలిసింది. ఈ విభాగంలో డెఫ్ కూడా ఉంటారని తెలుసుకున్నాను. దానికి తగిన కృషి చేశాను. అలా మిస్ ఇండియా డెఫ్, మిస్ ఆసియా డెఫ్ టైటిట్స్ గెలుచుకున్నాను’ అని తెలిపిన నిష్ఠా దూదెజా జూడో, టెన్నిస్, బ్యూటీ విభాగాలలోనూ నంబర్ వన్ అనిపించుకుంది. వికలాంగుల సాధికారత భారత ఉపరాష్ట్రపతి నుంచి రోల్ మోడల్ కేటగిరీలో వికలాంగుల సాధికారత జాతీయ అవార్డును అందుకున్నది. ‘నా పై జాలి చూపే వారిని నేను ఇష్టపడను’ అని చెప్పే నిష్ఠా ప్రయాణం అంత తేలికగా సాగలేదు. ‘పాఠశాల స్థాయిలో తోటి పిల్లలే ఎగతాళి చేసేవారు. చిన్నప్పుడు అర్ధం కాలేదు. చాలా బాధనిపించేది. టీనేజ్ దాటాక నా పరిస్థితి పైన పూర్తి అవగాహన వచ్చింది. అప్పటి నుంచే జీవితంలోని సానుకూల కోణాన్ని చూశాను. అడ్డంకులను దాటుకుంటూ నా ప్రయణాన్ని కొనసాగించాను. విజయవంతమయ్యాను’ తెలిపే నిష్ఠా దూదెజా విజయం వినికిడి లోపం గల పిల్లలున్న తల్లిదండ్రులు తమ పిల్లలపై ఆశలు చివురించేలా చేస్తుంది. సరైన విధంగా దారి చూపిస్తే తమ పిల్లలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారనే ధైర్యాన్ని నింపుతుంది. -
పసి మొగ్గపై పైశాచికం
అభంశుభం తెలియని 17ఏళ్ల మూగ, చెవుడు యువతిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన సంఘటన విజయవాడలోని భవానీపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 55ఏళ్ల సాంబశివరావు అనే వ్యక్తి చిన్నారిపై నెల రోజులుగా ఈ ఘాతుకానికి పాల్పడుతున్నాడని తల్లి సోమవారం భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భవానీపురం (విజయవాడ పశ్చిమ): మూగ, చెవుడు, ఆపై మతిస్థిమితంలేని బాలికపై ఒక వ్యక్తి నెల రోజులుగా లైంగికదాడి చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి తల్లి భవానీపురం పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు.. గొల్లపూడి సారాయి కొట్టు సెంటర్లో ఓ మహిళ నివసిస్తోంది. భర్తతో పదేళ్ల కిందట విడిపోయిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తెకు వివాహం చేసింది. ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ మతిస్థిమితంలేని చిన్నకుమార్తె(17)తో కలిసి జీవిస్తోంది. గన్నవరం మండలం జక్కులనెక్కలం గ్రామానికి చెందిన వీర్ల సాంబశివరావు(55) కుమార్తె గొల్లపూడిలో నివసిస్తోంది. ఆమె ఇంటిలోనే బాలికతల్లి అద్దెకు ఉంటూ, ఆ ఇంట్లోనే పాచిపనులు చేస్తోంది. తన కుమార్తె ఇల్లు నిర్మిస్తుండటంతో సాంబశివరావు నాలుగురోజులు ఇక్కడుంటే మూడు రోజులు స్వగ్రామం వెళ్లొస్తున్నాడు. సాంబశివరావు నెల రోజులుగా తల్లి ఇంట్లో లేని సమయంలో మతిస్థిమితంలేని బాలికపై లైంగికదాడి చేస్తున్నాడు. బాలిక సైగలద్వారా తల్లికి విషయం చెప్పడంతో ఆమె సాంబశివరావును నిలదీ సింది. తమపైనే ఆరోపణలు చేస్తావా అంటూ వారిని బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించారు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదుచేసి బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
మూగ,చెవిటి యువతిపై సామూహిక లైంగికదాడి
* చెట్టుకు కట్టేసి.. సొమ్మసిల్లేలా కొట్టి * పుట్టు మూగ అని చూడకుండా అమానుషం ఎంజీఎం : పుట్టు మూగ, చెవిటి అయిన కూతురిని ఉన్నంతలో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఆర్థికబాధలు వెంటాడుతున్నా... ఇంటర్ వరకు చదివించారు. ఆపై స్థోమత లేకపోవడంతో ఇంటివద్దనే ఉంటున్న ఆమెను కంటికిరెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. వికలాంగురాలినని బాధపడకుండా... సదరు యువతి సైతం ఆత్మవిశ్వాసంతో స్వయం ఉపాధి వెతుక్కుంది. నిరుపేద కుటుంబానికి తన వంతు అండగా ఉండాలని, తన కాళ్లపై తాను జీవించాలనే పట్టుదలతో కుట్టు మిషన్ నేర్చుకుంది. తల్లిదండ్రులకు ఎంతో కొంత ఆసరాగా నిలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి తమ కూతురుకు జరిగిన అమానవీయ సంఘటన ఆ వర్ధన్నపేట మండలం ఐనవోలు గ్రామానికి చెందిన కొత్తూరి ఎల్లయ్య, ఉపేంద్ర దంపతుల కళ్లల్లో నీరు ఇంకేలా చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు మూగ యువతి కళ్లకు గంతలు కట్టి... పిడిగుద్దులతో సొమ్మసిల్లిపోయేలా చేసి సామూహిక లైంగికదాడికి పాల్పడడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. చెట్టుకు కట్టివేసి.. సొమ్మసిల్లి పడిపోయి ఉండడాన్ని చూసి వారు రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కలచివేసింది. ‘చిన్న బిడ్డ ఆరేండ్ల క్రితం చనిపోయింది... ఉన్న ఒక్కగానొక్క కొడుకు వేరే చోట ఉంటున్నడు. నా బిడ్డ కోసమే కూలీనాలి చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాం... అది కూడా మమ్మల్ని కష్టపెట్టకుండా జీవిస్తోంది... ఎవరి కన్ను కుట్టిందో.. ఇంత దారుణానికి ఒడిగటటిండ్రు’ అని విలపించిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. సీకేఎంలో గంటపాటు అందని వైద్యం బాధితురాలిని ముందుగా హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకురాగా.. వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు. దీంతో ఆమెను వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రికి తరలించగా... అక్కడా తిప్పలు తప్పలేదు. స్ట్రెచర్‌పై తీవ్రమైన గాయాలతో బాధపడుతున్న యువతిని గంట పాటు ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. ఇంతలో ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి వైద్యం అందకపోవడంపై మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తదితరులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.కోట్లు పోసి ఆస్పత్రిని నిర్మించి... లక్షల రూపాయాల జీతాలు తీసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వైద్యులను దేవుళ్లతో కొలుస్తారని, ఇంకా అలసత్వం ప్రదర్శించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, రక్త నమూనాలను సేకరించి లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. డీజీఓ సుజాత, ఇతర జూనియర్ డాక్టర్లు, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పరిస్థితిని గమనించి వైద్యసేవలందించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారు. కాగా, బాధితురాలిని పరామర్శించిన అనంతరం వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ సభ్యసమాజం తలదించుకునేలా మూగ యువతిపై ఘాతుకానికి పాల్పడ్డారని, కారకులైన నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధితురాలిని పరామర్శించిన వారిలో వర్ధన్నపేట ఎంపీపీ మార్నెని రవీందర్రావు, సర్పంచ్ పల్లంకొండ సురేష్ తదితరులు ఉన్నారు. నిందితులను వదిలిపెట్టం : ఎస్పీ కిషోర్ ఝా మహిళపై అకృత్యానికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు రూరల్ ఎస్పీ, అర్బన్ ఇన్చార్జ్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, క్రైం అడిషనల్ ఏఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. బాధితురాలి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించి, కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరించారు.