Mia Le Roux: ఈ అందం వినిపిస్తోందా? | Mia Le Roux crowned first deaf Miss SA | Sakshi
Sakshi News home page

Mia Le Roux: ఈ అందం వినిపిస్తోందా?

Published Tue, Aug 13 2024 12:37 AM | Last Updated on Tue, Aug 13 2024 11:17 AM

Mia Le Roux crowned first deaf Miss SA

న్యూస్‌మేకర్‌

‘సమాజం ఎడంగా ఉంచే దివ్యాంగులకు ఇదెంత ముఖ్యమైన గెలుపో నాకు తెలుసు. అనూహ్యమైన కలలు కని వాటిని సాధించవచ్చని ఇవాళ నేను నిరూపించాను. దివ్యాంగుల పట్ల ఈ భూగ్రహంలో ఉన్న ఆంక్షల సరిహద్దులను నేను బద్దలు కొట్టాను’ అని హర్షధ్వానాల మధ్య అంది మియా లే రూ. 

28 ఏళ్ల బధిర వనిత మియా లే 66 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాఫ్రికా అందాల పోటీలో కిరీటం ధరించిన తొలి బధిర మహిళగా చరిత్ర సృష్టించింది. ఆమె ఈ పోటీలో గెలిచినందుకుగాను సంవత్సరం పాటు నివసించడానికి ఒక ఖరీదైన ఫ్లాటు, లగ్జరీ బెంజి కారు, సుమారు 50 లక్షల రూపాయల నగదు, ఇంకా అనేక బహుమతులు దక్కాయి. శనివారం (ఆగస్టు 10) రాత్రి దక్షిణాఫ్రికాలోని పాలనా రాజధాని ప్రిటోరియాలో జరిగిన ఫైనల్స్‌లో ఈ ఘనత సాధించింది.

పుట్టుకతో చెవుడు
ఫ్రెంచ్‌ మూలాలున్న మియా లే కుటుంబం తరాల ముందు వచ్చి సౌత్‌ ఆఫ్రికాలో స్థిరపడింది. మియా పుట్టాక సంవత్సరం తర్వాత ఆమెకు పూర్తిచెవుడు ఉన్నట్టు గ్రహించారు తల్లిదండ్రులు. కొన్నేళ్ల తర్వాత కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ వేసి రెండు సంవత్సరాల పాటు స్పీచ్‌థెరపీ ఇస్తే తప్ప ఆమె మొదటి మాట మాట్లాడలేదు. ఆ తర్వాత కూడా ఆమె మాట స్పష్టం కాలేదు. ఆమెకు ఇప్పటికీ వినపడదు.

 ‘నా కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ను ఆధునిక సాఫ్ట్‌వేర్‌ ద్వారా అనుసంధానం చేసుకున్నాను. అందువల్ల పెదవుల కదలికను బట్టి కొద్దిగా వినపడే ధ్వనిని బట్టి ఎదుటివారి మాటలు అర్థం చేసుకుంటాను. గుంపులో ఉండి నాతో మాట్లాడితే నాకు ఏమీ అర్థం కాదు. అందరి శబ్దాలు కలిసి నాకు స్పష్టత ఉండదు’ అంటుంది మియా లే. మోడల్‌గా, మార్కెటింగ్‌ రంగ నిపుణురాలిగా పని చేస్తున్న ఈమె అందాలపోటీలో విజేతగా నిలవాలని కలగని, సాధించింది.

నల్లరంగు–తెల్లరంగు
సౌత్‌ ఆఫ్రికా అందాల కిరీటం కోసం నల్ల అందగత్తె చిడిమ్మ అడెస్ట్‌షినా పోటీ పడింది. ఆమెకు సౌత్‌ ఆఫ్రికాలో గొప్ప ఫాలోయింగ్‌ ఉంది. అయితే ఆమె పౌరసత్వం మీద వివాదం నెలకొంది. ఆమె నైజీరియా తండ్రికీ, మొజాంబిక్‌ తల్లికీ జన్మించిందని ట్రోల్స్‌ మొదలయ్యాయి. దాంతో విజయం అంచు వరకూ చేరిన చిడిమ్మ పోటీ నుంచి తప్పుకుంది. దాంతో మియా గెలుపు సులవు అయ్యింది. రంగును బట్టి మియా గురించి ఒకటి రెండు విమర్శలు వచ్చినా పోటీ నుంచి తప్పుకున్న చిడిమ్మ మనస్ఫూర్తిగా ఆమెను అభినందించింది. ‘నువ్వు మా అందరి కలలకు ప్రతినిధిగా నిలిచావు’ అని పోటీలో గెలిచిన మియాను చిడిమ్మ కొనియాడింది.

నేనొక వారధిని
‘దివ్యాంగులు సమాజంలో భాగం కావాలంటే ప్రభుత్వాలు పూనుకోవాలి. నాకొచ్చిన ఈ అందాల కిరీటంతో నేను దివ్యాంగులకు ప్రభుత్వానికి ఒక వారధి కాదలిచాను. చిన్నవయసు నుంచి దివ్యాంగులు అసాధ్యమైన కలలు గనే స్థయిర్యాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను’ అంది మియా లే రూ.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement