
‘అందమే ఆనందం’ అనుకోవడంతో పాటు ‘ఆనందమే అందం’ అనుకునే రిజుల్ మైని మిచిగాన్ (యూఎస్)లో మెడికల్ స్టూడెంట్. ఈ ఇండో– అమెరికన్ స్టూడెంట్ ‘మిస్ ఇండియా యూఎస్‌ఏ 2023’ కిరీటాన్ని గెలుచుకుంది...
‘మిస్ ఇండియా యూఎస్‌ఏ’ టైటిల్ గెలుచుకోవడానికి 25 రాష్ట్రాల నుంచి 57 మంది పోటీ పడ్డారు.
‘వినయంతో, ఒకింత గర్వంతో నేను మిస్ ఇండియా యూఎస్‌ఏ 2023 అని చెబుతున్నాను. నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేకపోతే ఈ విజయం సాధ్యం అయ్యేది కాదు. నా ప్రయాణంలో అడుగడుగునా స్నేహితులు అండగా నిలిచారు. విలువైన సూచనలు ఇచ్చారు’ అంటుంది రిజుల్ మైని.
ఇరవై నాలుగు సంవత్సరాల ఇండియన్–అమెరికన్ రిజుల్ మైని తనను తాను మెడికల్ స్టూడెంట్, మోడల్‌గా పరిచయం చేసుకుంటుంది. సర్జన్ కావాలనేది తన లక్ష్యం. స్కూలు రోజుల నుంచి చదువుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేదో, కళలు, సాంస్కృతిక సంబంధిత కార్యక్రమాలకు అంతే ప్రాధాన్యత ఇచ్చేది రిజుల్.
మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో ‘హ్యుమన్ సైకాలజీ’లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన రిజుల్‌కు ఖాళీ సమయం అంటూ ఉండదు. ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది. ఆమె హాబీల జాబితాలో పెయింటింగ్, కుకింగ్, గోల్ఫింగ్... ఇలా ఎన్నో ఉన్నాయి.
స్వచ్ఛంద కార్యక్రమాలలోనూ ముందుంటుంది. వైద్యానికి సంబంధించిన సరికొత్త విషయాలు, పుస్తకాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో ఇతరులతో పంచుకోవడం అంటే ఇష్టం.
‘కళ అనేది మనసులోని మాలిన్యాన్ని శుభ్రం చేస్తుంది’ అనే మాట రిజుల్ మైనికి ఇష్టం. అందుకేనేమో ఆమెకు కళలు అంటే అంత ఇష్టం. కళలు ఉన్నచోట వెలుగు ఉంటుంది. ఆ వెలుగే అందం. ఆనందం.