మూగ,చెవిటి యువతిపై సామూహిక లైంగికదాడి | group sexual assault on the Dumb, deaf woman | Sakshi
Sakshi News home page

మూగ,చెవిటి యువతిపై సామూహిక లైంగికదాడి

Published Fri, Dec 12 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM

మూగ,చెవిటి యువతిపై సామూహిక లైంగికదాడి

మూగ,చెవిటి యువతిపై సామూహిక లైంగికదాడి

* చెట్టుకు కట్టేసి.. సొమ్మసిల్లేలా కొట్టి     
* పుట్టు మూగ అని చూడకుండా అమానుషం
ఎంజీఎం :  పుట్టు మూగ, చెవిటి అయిన కూతురిని ఉన్నంతలో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఆర్థికబాధలు వెంటాడుతున్నా... ఇంటర్ వరకు చదివించారు. ఆపై స్థోమత లేకపోవడంతో ఇంటివద్దనే ఉంటున్న ఆమెను కంటికిరెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. వికలాంగురాలినని బాధపడకుండా... సదరు యువతి సైతం ఆత్మవిశ్వాసంతో స్వయం ఉపాధి వెతుక్కుంది. నిరుపేద కుటుంబానికి తన వంతు అండగా ఉండాలని, తన కాళ్లపై తాను జీవించాలనే పట్టుదలతో కుట్టు మిషన్ నేర్చుకుంది.

తల్లిదండ్రులకు ఎంతో కొంత ఆసరాగా నిలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి తమ కూతురుకు జరిగిన అమానవీయ సంఘటన ఆ వర్ధన్నపేట మండలం ఐనవోలు గ్రామానికి చెందిన కొత్తూరి ఎల్లయ్య, ఉపేంద్ర దంపతుల కళ్లల్లో నీరు ఇంకేలా చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు మూగ యువతి కళ్లకు గంతలు కట్టి... పిడిగుద్దులతో సొమ్మసిల్లిపోయేలా చేసి సామూహిక లైంగికదాడికి పాల్పడడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

చెట్టుకు కట్టివేసి.. సొమ్మసిల్లి పడిపోయి ఉండడాన్ని చూసి వారు రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కలచివేసింది. ‘చిన్న బిడ్డ ఆరేండ్ల క్రితం చనిపోయింది... ఉన్న ఒక్కగానొక్క కొడుకు వేరే చోట ఉంటున్నడు. నా బిడ్డ కోసమే  కూలీనాలి చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాం... అది కూడా మమ్మల్ని కష్టపెట్టకుండా జీవిస్తోంది... ఎవరి కన్ను కుట్టిందో.. ఇంత దారుణానికి ఒడిగటటిండ్రు’ అని విలపించిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది.
 
సీకేఎంలో గంటపాటు అందని వైద్యం
బాధితురాలిని ముందుగా హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకురాగా.. వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు. దీంతో ఆమెను వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రికి తరలించగా... అక్కడా తిప్పలు తప్పలేదు. స్ట్రెచర్‌పై తీవ్రమైన గాయాలతో బాధపడుతున్న యువతిని గంట పాటు ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. ఇంతలో ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బాధితురాలికి వైద్యం అందకపోవడంపై మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తదితరులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.కోట్లు పోసి ఆస్పత్రిని నిర్మించి... లక్షల రూపాయాల జీతాలు తీసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వైద్యులను దేవుళ్లతో కొలుస్తారని, ఇంకా అలసత్వం ప్రదర్శించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, రక్త నమూనాలను సేకరించి లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు.

డీజీఓ సుజాత,  ఇతర జూనియర్ డాక్టర్లు, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పరిస్థితిని గమనించి వైద్యసేవలందించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారు. కాగా, బాధితురాలిని పరామర్శించిన అనంతరం వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ సభ్యసమాజం తలదించుకునేలా మూగ యువతిపై ఘాతుకానికి పాల్పడ్డారని, కారకులైన నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధితురాలిని పరామర్శించిన వారిలో వర్ధన్నపేట ఎంపీపీ మార్నెని రవీందర్‌రావు, సర్పంచ్ పల్లంకొండ సురేష్ తదితరులు ఉన్నారు.
 
నిందితులను వదిలిపెట్టం : ఎస్పీ కిషోర్ ఝా
మహిళపై అకృత్యానికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు రూరల్ ఎస్పీ, అర్బన్ ఇన్‌చార్జ్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా,  క్రైం అడిషనల్ ఏఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. బాధితురాలి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించి, కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement